పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

23, జనవరి 2016, శనివారం

తరాల పాఠకుల రచయిత్రి యద్దనపూడి


మా అమ్మ నవల్స్ సేకరణ
యద్దనపూడి సులోచనారాణి గారు మా అమ్మకి అభిమాన రచయిత్రి. చిన్నప్పుడు చందమామ ,బాలమిత్ర  లాంటి పుస్తకాలు నాన్న తెచ్చేవాడు.. ఆంధ్రభూమి,చతుర విపుల అమ్మ చదివే పుస్తకాలు.ఆంధ్రభూమిలో వచ్చే సీరియల్స్ చాలా వాటిని అమ్మ కట్ చేసి నవల్స్ లాగా బైండింగ్ చేయించేది.మా అమ్మకి మొదట నవల్స్ పరిచయం చేసింది మా విజయవాడ పెద్దమ్మ. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ లో విజయవాడ వెళ్తే ఆమ్మ ( మేము పెద్దమ్మని "ఆమ్మ" అంటాము ) ఇంటినిండా పుస్తకాలే.. ముఖ్యంగా యద్దనపూడి, యండమూరి, కోడూరి కౌసల్యాదేవి ,కొమ్మనాపల్లి గణపతిరావు లాంటి అప్పటితరం రచయితల పుస్తకాలెన్నో మా ఆమ్మ దగ్గర ఉండేవి.పుస్తకాలంటే ఆసక్తి ఉన్న అమ్మ ఈ పుస్తకాలన్నీ ఎక్కడ తెప్పించావని ఆమ్మని అడిగితే ఎమెస్కో గురించి చెప్పింది. మెంబర్ షిప్ తీసుకుంటే ప్రతినెలా ఇంటికి పుస్తకం VPP ద్వారా పంపించేవాళ్లు అలా అమ్మ చాలా పుస్తకాలు తెప్పించేది.ముఖ్యంగా యద్దనపూడి,యండమూరి నవల్స్ ఏ వున్నాయో ఎమెస్కో వాళ్ళిచ్చే కేటలాగ్ లో వెతికి అవే తెప్పించేది.

నేను మొదట చదివిన నవల యద్దనపూడి సులోచనారాణి గారి "ఈ దేశం మాకేమిచ్చింది" ఒక నిజాయితీ కలిగిన పోలీస్ అధికారి తన నిజాయితీ వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా వాటి ఎదుర్కొని తన భార్యాపిల్లల్ని కాపాడుకోవాలని తాపత్రయపడే ఆ అధికారి కధ  చాలా బాగుండేది.అప్పట్లో మా పెదనాన్న విజయవాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ కావటంతో నాకు ఆ నవల చదువుతుంటే మా పెదనాన్న గురించి చదువుతున్నట్లే అనిపించేది.ఉద్యోగంలో, బయట ప్రపంచంలో ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని ఇంటి దాకా తేకుండా ,ఆయన  ఉన్నన్ని రోజులు మా పెద్దమ్మని పసిపిల్లలాగా ప్రేమించి,అందరూ అసూయపడేలా భార్యని చూసుకున్న మా పెదనాన్న నిజంగా గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషి..ఉన్నప్పుడే కాదు లేనప్పుడు కూడా వారి గురించి చెడుగా చెప్పుకునే అవకాశం  రాకుండా బ్రతకగలిగే మనుషులు అరుదుగా ఉంటారేమో. ఇలాంటి  గొప్ప వ్యక్తిత్వాలను ఎన్నిటినో తన నవలల్లో పాత్రలుగా యద్దనపూడి పరిచయం చేశారు. 

తర్వాత నవల మీనా ఈ నవల 2 పార్టులుగా వచ్చింది.అప్పట్లో చాలా మంది తల్లులు ఈ నవల చదివి మా ఆడపిల్లలు కూడా ఎక్కడ ఇలా తయారవుతారో అని భయపడేవారట.ఈ నవల్లో కూతుర్ని తన కోరిక ప్రకారం ఉన్నతంగా చూడాలనే తల్లిమనసు, కూతురి పెంకితనం, అనుబంధాలు,ఆప్యాయతలు ఇలా ఎన్నో ఎమోషన్స్ ఈ నవలలోని  పాత్రల్లో చిత్రించారు.యద్దనపూడి.అప్పటి రోజుల్లో మనుషులకి ఆ నవల సరిపోతుందేమో కానీ.. ఊర్లో ఉన్న కాలేజ్ లో ఇంజినీరింగో,ఏదో డిగ్రీనో చదివేసి, సిటీకి వెళ్ళిపోయి,అక్కడి నుండి అమెరికాలు కూడా సొంతగా వెళ్ళిపోతున్న ఈరోజుల్లో  వాళ్లకి మీనా నవల నచ్చుతుందని నేననుకోను.ఈ నవల మీనా సినిమాగా వచ్చింది. 

మా చిన్నప్పటి మర్చిపోలేని మరో జ్ఞాపకం సెక్రటరీ సినిమా .. అప్పట్లో ఎప్పుడైనా స్కూల్ హాలిడేస్ వస్తే నాన్న తీసుకెళ్ళే సినిమాలే కాకుండా, అమ్మ, ఇంటి పక్కల వాళ్ళతో వెళ్ళే మాట్నీ సినిమాలు కూడా మాకో సరదా. అలా నన్ను,తమ్ముడ్ని అమ్మ తీసుకెళ్ళి మరీ హింసించిన సినిమా సెక్రటరీ . అప్పట్లో అలా అనిపించింది కానీ ఇప్పుడు చూస్తుంటే బాగానే ఉంటుంది. :).ఇప్పటికీ ఆ సినిమా వస్తుంటే నాకు,మా తమ్ముడికి చిన్నప్పుటి  విషయం గుర్తొస్తుంది.అప్పటి సెక్రటరీ,జీవనతరంగాలు  సినిమాల్లో యద్దనపూడి నవలానాయిక వాణిశ్రీ అనిపిస్తుంది ఆ సినిమాలు చూస్తుంటే.. ఆ సినిమాల్లో వాణిశ్రీ కట్టుకున్న ఎంబ్రాయిడరీ చీరలు ఇప్పుడు వర్క్ శారీస్ అని వస్తున్నాయి అంటుంది అమ్మ. 

యద్దనపూడి నవలల గురించి అప్పట్లో వచ్చిన ఒక కామెంట్ ప్రతి నవలలో నాయిక ఎక్కడినుండో కలల రాకుమారుడు వస్తాడు అని ఎదురుచూస్తూ ఉంటుంది.అలాగే ఏదైనా సమస్య రాగానే హీరో వచ్చి కాపాడతాడని ఆశిస్తుంది. ఇలా తనకంటూ ఒక వ్యక్తిత్వం లేని స్త్రీ పాత్రల్ని ఆమె సృష్టించింది.ఇలాంటివి చదివి ఆడపిల్లలు కూడా అలాగే కలలప్రపంచంలో విహరిస్తారు అని విమర్శించే వాళ్ళు... కానీ నాకనిపిస్తుంది స్త్రీ తనకు తానుగా ఎంత స్థాయికి ఎదిగినా,ఎన్ని శక్తి యుక్తులు ఉన్నా తనకంటే అన్నిటిలో ఉన్నతస్థాయిలో ఉన్న తోడునే కోరుకుంటుంది.కానీ నిజంగా అలాంటి హీరో వస్తాడా రాదా అన్నది వాళ్ళ వాళ్ళ అదృష్టం.అమ్మాయిల విషయాల్లో ఇప్పటికీ అప్పటి యద్దనపూడి నవలల్లో  లాంటి పాత్రలు,స్వభావాలు లేకపోలేదన్నది మాత్రం వాస్తవం.
 

సెక్రటరీ నవల ప్రచురితమై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు సాక్షి పేపర్,టీవీలో "తరాల పాఠకుల రచయిత్రి" యద్దనపూడి గారి ఇంటర్వ్యూ,  చూశాక నాకు గుర్తొచ్చిన జ్ఞాపకాలు ఇవి.



4 కామెంట్‌లు:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

భలే ఆసక్తిగా ఉన్నాయి ఈ కబుర్లు . మళ్ళీ చదవాలి అనిపించేలా చెప్పారు రాజీ గారు . Good memories.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

నా కబుర్లు నచ్చినందుకు Thank You వనజవనమాలి గారు ..
రాజీ అనండి ప్లీజ్ ... :)

మాలా కుమార్ చెప్పారు...

యద్దనపూడి ఇప్పటికీ నా అభిమానరచయిత్రి అని, ఆవిడ నవలలు ఇప్పటికీ చదువుతాను అంటే అందరూ నన్ను విచిత్రంగా చూసి, వెక్కిరిస్తారు ఎందుకో!ఐనా సరే ఆవిడకు నేను వీరాభిమానిని.ఎందుకో "ఈ దేశం మాకేమిచ్చింది"మిస్సయ్యాను.ఇంతవరకూ చదవలేదు .దాదాపు ఆవిడ నవలలన్నీ నా దగ్గర ఉన్నాయి.
గుడ్ పోస్ట్.బాగారాశారు రాజీ.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

Thank You మాలాకుమార్ గారు ..
మా అమ్మకే కాదండీ నాకు కూడా యద్దనపూడి గారి నవలలు చాలా నచ్చుతాయి. ఇప్పటికీ కొన్ని స్టోరీస్ మర్చిపోయినట్లు అనిపిస్తే మళ్ళీ చదవాలనిపించే నవల్స్ చాలా ఉన్నాయి. "ఈ దేశం మాకేమిచ్చింది" 1981 లో ద్వితీయ ముద్రణ అని వుంటుందండి.. నాకు చాలా నచ్చిన నవల అది. పోస్ట్ నచ్చినందుకు,మీ కామెంట్ కి చాలా థ్యాంక్స్ అండీ

Related Posts Plugin for WordPress, Blogger...