పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

23, జూన్ 2016, గురువారం

మా తమిళనాడు యాత్రా విశేషాలు - పంచభూత లింగ క్షేత్రాలు



ఆకాశమే ఆకారమై ,భూమియే విభూతియై
అగ్నియే త్రినేత్రమై ,వాయువే చలనమై
జలమే జగమేలు మందహాసమై .. 
  పంచభూతాధారా ప్రపంచేశ్వరా 
విధాతా విశ్వనాధ

నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ప్రాణి మనుగడకు అత్యావశ్యకమైన ఈ పంచభూతాలకు అధిపతి శివయ్య పంచ భూతతత్వాలతో కొలువైన పంచభూత క్షేత్రాలను చూడటం కల నిజం కావటం లాగా అనిపించింది. చిన్నప్పుడు ప్రతి సంవత్సరం జనవరి 1 రోజు అమ్మ,నాన్న,తమ్ముడు,చెల్లి తో మాఊరి పాత శివాలయానికి వెళ్ళి,అభిషేకం జరుగుతున్నంతసేపూ కూర్చుని విభూతి పెట్టుకుని,తీర్ధం తాగి ఎప్పుడెప్పుడు బయటపడదామా అనుకునే రోజుల్లో తెలియదు  ఆ పరమేశ్వరుడు ఇన్ని రూపాల్లో, ఇన్ని క్షేత్రాల్లో  కొలువై ఉన్నాడని.. కానీ ఈ మధ్య ఆ శివయ్యే చెప్పి మరీ  చూపిస్తున్నట్లుగా చూసిన అయిదు జ్యోతిర్లింగాలు, పంచభూత క్షేత్రాల దర్శనం ఏజన్మలో  చేసుకున్న పుణ్యమో అనిపిస్తుంది. కాళహస్తి,శివకంచి,అరుణాచలం ఇప్పటికే చూసినా మళ్లీ ఈ సంవత్సరం మేలో వెళ్లిన ట్రిప్ లో జంబుకేశ్వరం,చిదంబరం తో పాటూ కాళహస్తి,శివకంచి కూడా మళ్ళీ దర్శించుకున్నాము.

పంచభూతలింగాల నాలుగు తమిళనాడులో 1 మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ లోని  శ్రీకాళహస్తి లో వాయులింగం
తమిళనాడు లోని శివ కంచిలో పృధ్వీలింగం
తిరువన్నామలై లో అగ్నిలింగం
జంబుకేశ్వరం లో జలలింగం
చిదంబరంలో ఆకాశలింగం

శ్రీ కాళహస్తి --- వాయులింగం

పంచభూత లింగాలలో ఇది వాయులింగం. వాయుతత్వానికి ప్రతీకగా గర్భగుడిలో స్వామికి ఎదురుగా వున్న దీపాలు  లింగము నుండి వచ్చే  గాలికి రెపరెపలాడుటూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా  శ్రీ కాళహస్తిలో సువర్ణముఖీ నదీ తీరంలో శ్రీ కాళహస్తీస్వర నామముతో పరమేశ్వరుడు లింగరూపంలో స్వయంభువుగా వున్నాడు. శ్రీకాళహస్తిని 'దక్షిణకాశీ ' అని అంటారు. శ్రీ, కాళ, హస్తి అనే మూడు పదాల కలయికతో ఈ ఊరిపేరు ఏర్పడింది. శ్రీ అంటే సాలీడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు జంతువులూ శివారాధన చేసి ఇక్కడే మోక్షం పొందాయని అందుకే ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చిందని పురాణ కధనం. ఇక్కడ అమ్మవారు జ్ఞానప్రసునాంబ. పరమేశ్వరుడు పార్వతీదేవికి పంచాక్షరీ మంత్రాన్ని ఇక్కడే ఉపదేశించాడని పురాణ కధనం.

శ్రీకాళహస్తి 
 శ్రీకాళహస్తీశ్వరుడు , శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి 


శివకంచి  --   పృధ్వీలింగం

ఇక్కడ పంచభుతాలలో ఒకటైన పృధ్వీకి ప్రతీకగా ఏకామ్రేశ్వరుడు మృత్తికా లింగంగా దర్శనమిస్తాడు.శివుడు అభిషేక ప్రియుడు అని అంటారు. కాని ఇక్కడ మాత్రం స్వామికి అభిషేకం చేయరు. పూలతో అర్చిస్తారు. ఈ ఆలయము లోని మామిడి చెట్టు కింద మట్టితో ఒక శివలింగం చేసి పార్వతీదేవి తపస్సు చేసింది.ఆ మట్టితో చేసిన లింగమే ఈ పృధ్వీలింగంగా  పూజలందుకుంటుంది. ఇక్కడ ఉన్న మామిడి చెట్టు సుమారు మూడు వేల ఐదు వందల సంవత్సరాల వయస్సు కలదని అంటారు. ఇప్పుడు ఆ మామిడి చెట్టుని గాజు పెట్టెలో భద్రపరచి ఆ స్థలంలో నాటిన వేరే మామిడి చెట్టు కనిపిస్తుంది.

 శివకంచి 
 శ్రీ ఏకామ్రేశ్వరుడు ,పార్వతీ దేవి 


అరుణాచలం(తిరువణ్ణామలై) -- అగ్ని లింగం

పంచభూతాలలో ఒకటైన అగ్నిగా శివుడు వెలసిన క్షేత్రం అరుణాచలం.అహంకారమనే చీకటిని తొలగించటానికి భగవంతుడు జ్యోతి స్వరూపమై వెలసి,పర్వతంగా నిలచిన మహిమాన్వితమైన క్షేత్రం .అరుణాచలం స్వయంగా శివుడే..ఇక్కడ భగవంతుడైన శివుడు పర్వత రూపంలో వున్నాడు..ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపం కావటంవలన దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణము అని భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడ గిరి ప్రదక్షిణకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ గర్భగుడిలో కాసేపు కూర్చుంటే విపరీతమైన వేడి,చమటలు పట్టేస్తాయి. స్వామి తేజోలింగ రూపంలోని అగ్నిస్వరూపుడు కదా మరి.ఇక్కడ అమ్మవారు అన్నామలై అమ్మన్ గా దర్శనమిస్తుంది. 
అరుణాచలం
 అరుణాచలేశ్వరుడు - ఉన్నామలై అమ్మన్ 

 జంబుకేశ్వరం -- జలలింగం

తమిళనాడు లోని తిరుచిరాపల్లి(Trichy)సమీపములోని శ్రీరంగానికి సుమారు ఎనిమిది కి.మీ. దూరంలో జంబుకేశ్వర ఆలయము ఉంది.తిరువనై కోవిల్ అని కూడా అంటారు.చాలా పురాతనమైన దేవాలయం.అమ్మవారు జలంతో సృష్టించి, తపస్సు చేసిన లింగమే ఇక్కడ జంబుకేశ్వర స్వామి గా పూజలందుకుంటున్నాడు. ఇక్కడ జంబు వృక్షాల (నేరేడు చెట్లు ) అడవి ఉండేదని అందులో ఒక చెట్టు కింద వెలిసిన ఈ శివలింగాన్ని జంబుకేశ్వరుడు అని అంటారు. ఇక్కడ స్వామి వారిని ఏనుగు, సాలిపురుగు పూజిస్తుండేవి.  శ్రీకాళహస్తి స్థలపురాణానికి సన్నిహితంగా ఉండే ఇతిహాసం ఇక్కడ కూడా వినిపిస్తుంది.

ఇక్కడ గర్భగుడిలో శివలింగం కింద నుండి ఎప్పుడూ నీరు వస్తూ ఉంటుంది. నీటిని మెత్తం తొలగించినా, మళ్ళీ నీరు వస్తూ ఉండటం ఇక్కడ విశేషం.అందుకని దీన్ని "జలలింగం" అంటారు.ఈ గర్భాలయం ఎత్తు నాలుగు అడుగులే వంగి లోపలికి వెళ్ళాలి. ఇక్కడే పార్వతీ దేవికి పరమేశ్వరుడు జ్ఞానోపదేశం చేశాడని అంటారు. ఇక్కడ అమ్మవారు అఖిలాండేశ్వరీ దేవి. నిలుచున్న భంగిమలో అమ్మవారి నిండైన విగ్రహం  మనల్ని చూస్తున్నట్లే అనిపిస్తుంది. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులను గురు శిష్యులుగా భావించడం చేత, శివపార్వతుల కళ్యాణము జరిపించరు.

జంబుకేశ్వర్ 
శ్రీ జంబుకేశ్వరుడు - అఖిలాండేశ్వరీ దేవి

చిదంబరం -- ఆకాశలింగం

పంచ భూతాలలో ఆకాశలింగం చిదంబరం తిల్లై నటరాజ స్వామి ఆలయం.ఆనంద తాండవం చేస్తున్న నటరాజుని రమ్య రంగస్థలం. పంచభూతాలలో ఒకటైన ఆకాశానికి ప్రతీకగా, చిదంబరంలోని గర్భగుడిలో స్వామి శివలింగం ఉండదు.దీన్ని చిదంబర రహస్యం అంటారు.శివలింగానికి బదులుగా పీఠం మీద కనులు మిరుమిట్లు గొలిపే అందమైన అలంకరణలో నటరాజ స్వామి, శివగామి /శివకామ సుందరీదేవి అమ్మవారు దర్శనమిస్తారు.పక్కనే ఒక కర్టెన్ ఉంటుంది.శివుడు యంత్రరూపంలో కొలువైన శూన్య ప్రాంతాన్ని ఒక తెరతో కప్పి ఉంచారు. ప్రతిరోజు ఉదయం స్ఫటికలింగరూపంలో ఉన్న శివునికి అభిషేకం,పూజలు చేసిన తర్వాత ప్రత్యేక దర్శనములో మాత్రమే ఆ తెర తీస్తారు.ఎంతో పురాతనమైన ఈ ఆలయం చాలా పెద్దది. ఈ ఆషాఢమాసంలో అక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి.
చిదంబరం

శ్రీ  నటరాజ స్వామి, శివగామి /శివకామ సుందరీదేవి


పంచభూత లింగ క్షేత్రాలు

ఇవీ పంచభూత లింగ క్షేత్రాల విశేషాలు.తమిళనాడులో అడుగడుగునా శివాలయాలు కనిపిస్తాయి. అన్నీ పురాతన ఆలయాలు.ఎంతో మహత్యం కలిగిన ఎన్నో ఆలయాల్లో కొన్నిటిని చూసే అవకాశం కలిగింది.మరిన్ని క్షేత్రాల విశేషాలు నా తర్వాత పోస్టుల్లో..

_/\_ చిదానంద రూపా .. శివోహం శివోహం  _/\_



Related Posts Plugin for WordPress, Blogger...