పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

27, జులై 2016, బుధవారం

మా తమిళనాడు యాత్రా విశేషాలు - శ్రీకాళహస్తి,కాణిపాకం,కంచి



2011 లో అరుణాచలం,కంచి,శ్రీపురం చూసిన తర్వాత మళ్లీ ఈ (2016) సంవత్సరం మే నెలలో
మేము వెళ్లిన తమిళనాడు టూర్ ఎప్పటికీ మర్చిపోలేని సంతోషకరమైన జ్ఞాపకంగా గుర్తుండేలా జరిగింది.పంచభూత క్షేత్రాలు చూడాలని నాకోరిక,కాళహస్తి(వాయులింగం),అరుణాచలం(అగ్నిలింగం),
కంచి(పృథ్వి లింగం) చూశాము,మిగతా 2 పంచభూతలింగాలు తమిళనాడులో ఉన్నాయి
ఎలాగూ వెళ్తున్నాం కాబట్టి చెన్నైలో ఎంతవరకు చూడగలమనుకుని చాలా ఆలయాలు ప్లాన్ చేసుకుని వెళ్ళాము.వాటిలో కొన్నిటిని అనుకున్నట్లుగా నే చూడగలిగాము.తమిళనాడు అంతా అడుగడుగునా
శివాలయాలే, అంతా శివమయం. మేము వెళ్లిన దారిలో కూడా మాకు తెలియని, చూడలేని క్షేత్రాలు
కూడా ఉండే ఉంటాయి..

శ్రీ కాళహస్తి రాజగోపురం 

గుంటూరు నుండి బయల్దేరతాము కాబట్టి ముందు కాణిపాకం,కాళహస్తి దర్శించుకుని వెల్లూర్ మీదుగా చెన్నై వెళ్లాలని అనుకున్నాము. via  NH16 5 h 20 min (339.1 km).కాళహస్తి 2009 తర్వాత ఇప్పటికి వెళ్ళటం కుదిరింది.కారు టెంపుల్ స్ట్రీట్ లోకి వెళ్తుంటేనే రూమ్స్ కోసం మనం వెతుక్కునే పని లేకుండా వాళ్ళే వచ్చి రూమ్స్ కావాలా అని పోటీపడుతూ మరీ అడుగుతున్నారు. ఉదయాన్నే దర్శనానికి వెళ్ళిపోయాము.సమ్మర్ హాలిడేస్ కావటంతో జనం చాలా ఎక్కువగా ఉన్నారు.కానీ అంత జనాల్లో కూడా స్వామి,  అమ్మవారి దర్శనం సులభంగా  చాలా దగ్గరినుండి జరిగింది.బయటికి వచ్చి ప్రసాదాలు, ఈసారి స్పెషల్ ప్రసాదం జిలేబీ కూడా తీసుకుని బయటికి వచ్చాము. ఆలయంలో రాహుకేతు పూజలకు  ప్రసిద్ధి కదా ఆ  పూజల మండపం అంతా బిజీ బిజీ.. కాసేపు గుడి ఆవరణలో కూర్చుని కాణిపాకం  బయలుదేరాము..

కాణిపాకం వినాయకుడు


కాణిపాకం వెళ్తున్న దారంతా మామిడి తోటలు. ఏ చెట్టు చూసినా విరగకాసినట్లున్న మామిడి కాయలే.దారంతా  చల్లటి కొబ్బరిబోండాలు, మామిడి కాయల్ని స్లైసులుగా కోసి ఉప్పు,కారం చల్లి అమ్ముతున్నారు.మండే ఎండల్లో ఇవి కాస్త హాయిగా అనిపించాయి.మేము కూడా ఆ మామిడికాయలు కొని కాసేపు మామిడి తోటల దగ్గర ఆగి బయలుదేరాము.కాణిపాకం ఆలయంలో కూడా జనం రద్దీ ఎక్కువగానే ఉంది .స్పెషల్ దర్శనం అయితేనే త్వరగా బయటపడగలం.విఘ్నేశ్వరుడిని దర్శించుకుని అక్కడ ప్రసాదంగా అమ్మే  పెద్ద సైజ్ లడ్డు కొనుక్కుని కాణిపాకం ఆలయ ప్రాంగణంలోనే ఉన్న శివాలయం,అమ్మవారిని దర్శించుకున్నాము.2011 లో మేము వెళ్ళినప్పుడు ఇంకా పూర్తి కాని పార్కు,వినాయక విగ్రహాలు ఇప్పుడు పాతగా కూడా అయిపోతున్నాయి అనిపించింది.

మామిడి తోటలో మా తమ్ముడు వాళ్ళ Photo session

మండే ఎండలో రోడ్డు పక్కన మసాలా మామిడికాయలు అమ్ముతున్న మామ్మ, 
మేము చెన్నై టూర్ వెళ్తున్నామని చెప్తే సంతోషంగా వెళ్ళిరండి అంటూ 
మాదగ్గరే కాసేపు ఉండి వెళ్ళింది.

ఇక ఇక్కడి నుండి తమిళ్ నాడు లోకి ఎంటర్ అయ్యి అక్కడ తమిళ్ సాంబార్ సాదం/సాంబార్ అన్నం :) తిని, కంచి ఏకామ్రేశ్వర స్వామి  కోవెలకి బయలుదేరాము. ఏకామ్రేశ్వరుడిని దర్శనం ఇది రెండో సారి. మేము వెళ్లే సమయానికి సాయంత్ర హారతి సమయం కావటంతో స్వామివారిని కవచం లేకుండా చూసే అవకాశం కలిగింది. ఉదయం పూజల తర్వాత శివలింగానికి కవచం వేసి మళ్ళీ సాయంత్రం హారతి సమయంలోనే తీస్తారని చెప్పారు.స్వామి  పృధ్విలింగం కాబట్టి శివలింగానికి అభిషేకాలు చేయరు.ఇక్కడ జనం  తక్కువగానే  ఉండటం వల్ల ఎక్కువసేపు గర్భగుడికి సమీపంలోనే ఉండి  స్వామికి మనసారా నమస్కరించుకుని బయటికి వచ్చేశాము.

ఇక్కడ అమ్మవారు మామిడి చెట్టుకింద శివుడికోసం తపస్సు చేసింది. 
3500 సంవత్సరాల వయసు కలిగిన ఆ చెట్టుని ఇప్పుడిలా గాజుపెట్టెలో భద్రపరిచారు

ఆలయంలో మామిడి చెట్టు

ఏకామ్రేశ్వర స్వామికి,కంచి కామాక్షి అమ్మవారి గుడికి మధ్యలో  శ్రీ కుమారకొట్టం సుబ్రహ్మణ్యస్వామి  గుడి ఉంది. ఇక్కడ కూడా హారతి సమయం కావటంతో  భక్తులు చాలా ఎక్కువగా ఉన్నారు.ఇక్కడ భక్తులు ధ్వజస్థంభం దగ్గర రాతిఉప్పు చల్లి ప్రదక్షిణ చేస్తున్నారు.జాతక సమస్యలు ఉన్నవాళ్ళు ఇలా చేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుందని  ఇక్కడ నమ్మకం. కాసేపు ఉండి హారతి అయ్యాక దర్శనం చేసుకుని అమ్మవారి గుడికి బయలుదేరాము.

 కుమారకొట్టం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం  - కంచి 

కంచి కామాక్షమ్మ గుడి రిపేర్లు,మార్పులు జరుగుతున్నాయి.అంతా సిమెంటు,నీళ్లు.అలాగే దర్శనానికి వెళ్లి అమ్మని దర్శించుకుని ఎదురుగా ఉన్న మండపంలోనుండి అమ్మని చూస్తూ కాసేపు నమస్కరించుకుని బయటికి వచ్చేశాము.చెన్నై లో వచ్చిన వరదలకు గుడిలోకి కూడా నీళ్ళొచ్చాయని అందుకే ఈ రిపేర్లు జరుగుతున్నాయని మాతో వచ్చిన గైడ్ చెప్పాడు.మేము ఆంధ్రా నుండి వచ్చామని చెప్పగానే వరదలప్పుడు మాకు సహాయం చెయ్యటానికి  మీ ఆంధ్రావాళ్ళు ముందుగానే వచ్చారు  అని చాలా సంతోషంగా చెప్పాడు.

కంచి కామాక్షి అమ్మ

అమ్మవారి దర్శనం తర్వాత విష్ణుకంచి వరదరాజపెరుమాళ్ ఆలయానికి వెళ్ళాము.అక్కడ మే 19 నుండి మొదలయ్యే బ్రహ్మోత్సవాలకు ముందు  జరిగే ఉత్సవాలు జరుగుతున్నాయి.ఆలయం అంతా రకరకాల అలంకరణలతో కళకళ లాడుతుంది. ఆలయానికి ముందు వేసిన పందిర్లలో స్వామివారి ఊరేగింపు జరుగుతుంది.దివిటీలు,విద్యుద్దీపాల వెలుగులో స్వామివారు మెరిసిపోతూ దర్శనమిచ్చాడు.అక్కడంతా ఆలయంలో పూజారులు ,వాళ్ళ భార్యలు అందరూ మంత్రోచ్చారణ చేస్తూ, శ్లోకాలు చదువుతూ ఊరేగింపును అనుసరిస్తూ వెళ్తున్నారు. ఆ సమయంలో మేము అక్కడ ఉండటం మా అదృష్టం అనిపించింది.ఆ ఉత్సవాన్ని చూస్తుంటే తిరుమల బ్రహ్మోత్సవాలకి ఎప్పుడూ వెళ్ళలేదు కానీ ఇక్కడ చూడగలిగాము అనిపించింది .అప్పటికే చీకటి పడుతుండటంతో గుడి మూసేస్తారని లోపల ఆలయంలోకి వెళ్లి అమ్మవారిని,గోవిందరాజ పెరుమాళ్ స్వామిని దర్శించుకుని, రెండోసారి వెండిబల్లి,బంగారుబల్లిని తాకి అమ్మయ్య చివరి దర్శనం అందింది లేకపోతే ఇంతదూరం వచ్చి చూడలేకపోయామని ఫీలవ్వాల్సి వచ్చేది అనుకున్నాము.

విష్ణుకంచి స్వామివారి ఊరేగింపు

కైలాస నాధార్  టెంపుల్ కి వెళ్లాలనుకున్నాము కానీ అప్పటికే చీకటి పడింది,అప్పుడు వెళ్లినా గుడి క్లోజ్ అవుతుందని చెప్పటంతో కంచి వస్తే తప్పకుండా చీరలు కొనాలి కాబట్టి, ఆ చీరల్ని ఇష్టపడనివాళ్ళు కూడా 
ఉండరు కాబట్టి మేము కూడా చీరల షాపింగ్ కి వెళ్ళాము.

కంచి శారీస్

ఇక ఇక్కడినుండి మా ప్రయాణం మహాబలిపురానికి ఆ విశేషాలు తర్వాత పోస్టులో..


4 కామెంట్‌లు:

నీహారిక చెప్పారు...

మీకు చాలా ఓపిక ఎక్కువండీ ! ఇన్ని బ్లాగులను ఎలా వ్రాయగలుగుతున్నారు ?
Nice Trip !

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"నీహారిక" గారు మా ట్రిప్ నచ్చినందుకు,మీ స్పందన తెలిపినందుకు థ్యాంక్సండీ.. ఇక నా బ్లాగుల విషయంలో నా పని
"కొంచెం ఇష్టం ఉంటే .. కొంచెం కష్టం అయినా" అన్నట్లుందండీ :) ఈ మధ్య అనుకోకుండా దొరికిన ఫ్రీ టైమ్ ని ఇలా ఉపయోగిస్తున్నాను.. పాటల బ్లాగుల సంగతేమో కానీ.. మా ట్రిప్స్ విశేషాలు మాత్రం ఎప్పటికీ మర్చిపోకుండా ఉండటానికి
బ్లాగులో పెడుతున్నాను :)

Thank You ..

Pavan Kumar Reddy Rendeddula చెప్పారు...

బాగున్నాయండి మీ యాత్రా విశేషాలు. చదువుతున్నపుడు నేను అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి వచ్చాను మేము వెళ్లినప్పటి రోజులు గుర్తుకు తెచ్చుకొని .

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

యాత్రా విశేషాలు నచ్చినందుకు, మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు R.Pavan Kumar Reddy గారు..
నా ప్రయత్నం కూడా అదేనండి ఇలా పోస్ట్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు చూస్తే అప్పుడు అవన్నీ గుర్తొస్తాయి కదా అని
Thank You ..

Related Posts Plugin for WordPress, Blogger...