పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

7, ఆగస్టు 2016, ఆదివారం

మా తమిళనాడు యాత్రా విశేషాలు - చిదంబరం



మహాబలిపురం నుండి మా ప్రయాణం చిదంబరం నటరాజ స్వామి  ఆలయానికి.ఇక్కడి నుండి మా ప్రయాణం అంతా ఈస్ట్ కోస్ట్ రోడ్ చెన్నై నాగపట్నం హైవే మీద సముద్రం పక్కనుండే జరిగింది.(3 h 1 min (161.1 km) via E Coast Rd and Chennai - Nagapattinam Hwy/E Coast Rd )ఈ ప్రయాణంలో మేము మర్చిపోలేనిది సముద్రానికి చాలా దగ్గరలో ప్రయాణించటం. కొంచెం కిందికి రోడ్డు దిగితే పక్కనే సముద్రం ఉండేది.ఉప్పు పండించే పొలాలు (salt fields)కనపడుతూ ఉండేవి.సముద్రానికి అతిదగ్గరలో ఉన్నామన్న ఆలోచన  కొంచెం థ్రిల్లింగ్ గాను,కొంచెం భయంగాను అనిపించేది.కొన్నిచోట్ల లైట్ హౌసులు కూడా పక్కనే కనపడేవి.2 గంటల్లో పాండిచ్చేరి వచ్చేశాం.పాండిచ్చేరి లో "Auroville"అనే ప్రదేశం గురించి ఈ పోస్ట్ చివర్లో రాస్తాను.

 

పాండిచ్చేరి నుండి మా ప్రయాణం చిదంబరం. తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లాలోని చిదంబరం వెళ్ళేటప్పటికి బాగా చీకటిపడింది.రూమ్స్ తీసుకుని ఉదయాన్నే స్వామి దర్శనానికి వెళ్ళాము .చిదంబరం పట్టణానికి సరిగ్గా మధ్యలో ఆలయం ఉంటుంది.ఈ ప్రదేశంలో ఒకప్పుడు తిల్లయ్ వృక్షాలు ఉండటంతో ఆ ప్రాంతాన్ని తిల్లయ్ వనం అని పిలిచేవారు.అందుకే ఇక్కడ వెలిసిన స్వామిని తిల్లయ్ నటరాజ స్వామి అంటారు.తమిళ సంగం సాహిత్య రచనల ప్రకారం, సనాతన విశ్వకర్మ ల యొక్క వంశస్థుడైన విదువేల్విడుగు పెరుమ్తకన్, ఈ ఆలయం యొక్క పునః సృష్టికి ప్రధాన రూపశిల్పి. ప్రాచీన మరియు పూర్వ-మధ్యస్థ కాలంలో, ప్రత్యేకించి పల్లవ , చోళ రాజుల కాలంలో, ఈ ఆలయంలో పలు నూతన రూపకల్పనలు జరిగాయి.చిదంబరం 907 నుండి 1310 వరకూ చోళరాజుల రాజధాని. వీరచోళరాజ కాలంలో నటరాజ ఆలయం వ్యవస్థీకరించబడినట్లుగా తెలుస్తుంది.
 
ప్రమధులు పాడా ఫణిగణమాడా పార్వతి సయ్యాడా
మౌనివరుల్‌ నిను మనసారా గని
పారవశంబున కొనియాడ
జగముల ఏలికా శివకామ సుందరి నాయకా 
చిదానందస్వరూపుడైన పరమేశ్వరుడి పావన నిలయం,ఆనంద తాండవం చేస్తున్న నటరాజస్వామి దర్శనం కూడా ఆనందదాయకమే.ధగధగలాడే వజ్రాభరణాల వెలుగులో స్వామి దర్శనమిస్తాడు.పంచభూత లింగాల్లో ఆకాశ తత్వానికి ప్రతీకగా స్వామి ఆకాశలింగం.నటరాజస్వామి మనోహరమైన శివగామి/శివకామసుందరీదేవి అమ్మవారితో కలిసి కొలువైన గర్భగుడిలోనే ఒక పక్కన బంగారు తెర వెనకనే చిదంబర రహస్యం ఉంటుంది.ఆలయం అంతా అద్భుతమైన శిల్పకళ,ఎత్తైన గోపురాలు,మందిరాలు ఎటు చూసినా కళాత్మకంగా ఉంటుంది.స్వామి గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో ఒక పక్కన శేషశయన విష్ణుమూర్తి దేవేరులతో కలిసి దర్శనమిస్తాడు.ఇక్కడ ఆషాఢమాసంలో స్వామివారికి ఉత్సవాలు జరుగుతాయి.
అనాది అద్భుత నాయకుడైన అందాల నటరాజ స్వామి 
రమ్య రంగస్థలం
ఆలయం లోపల శివపరివారం
ఆలయగోపురం

ఆలయంలో శిల్పకళ, పైకప్పుమీద వేసిన వర్ణచిత్రాలు అన్నీ అద్భుతమే




నందీశ్వరుడు

















శివదేవునికి,శక్తిదేవికి నృత్యప్రావీణ్యం విషయంలో వివాదం వచ్చి,ఇద్దరూ పోటీపడి తమ సామర్ధ్యాన్ని నిరూపించుకోవటానికి నృత్యం  చేశారట.నృత్యపోటీ ప్రారంభమైన కొద్దిసేపటికి స్వామి తన కాలును ఎత్తి విచిత్రమైన భంగిమని ప్రదర్శించాడట.అయితే శక్తిదేవి స్త్రీ సహజమైన సిగ్గుతో ఆ భంగిమను చేయలేక ఓటమిని అంగీకరించటంతో ఓడిపోయింది కాబట్టి శక్తి తిల్లయ్ స్థల హద్దుల్లో ఉండకూడదని శాసించాడు.ఈ కారణంగా స్వామి ఆలయానికి ఉత్తరంగా  తిల్లై కాళీ అమ్మన్ పేరుతో  అమ్మవారి కోవెల ఉంటుంది. ఈ నృత్య భంగిమలో నిలిచిన స్వామిని ఊర్ధ్వ తాండవమూర్తి అంటారు.

 ఊర్ధ్వ తాండవ మూర్తి 

చిదంబరం నుండి మా ప్రయాణం వైదీశ్వరన్ కోయిల్. ఈ క్షేత్రం చిదంబరానికి దక్షిణంగా 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.ఉత్తర తమిళనాడుకి ఎంతో ప్రముఖమైన ఆలయం.స్వామిని దర్శిస్తే సర్వరోగాలు నయమవుతాయని ఇక్కడ సంపూర్ణ విశ్వాసం.పూర్వం ఒక మునికి కలిగిన అనారోగ్యాన్ని పరమశివుడు వైద్యుని రూపంలో వచ్చి వ్యాధిని నయం చేశాడని స్థలపురాణం.ఇక్కడ స్వామివారు వైదీశ్వరన్, అమ్మవారు బాలాంబల్.అన్ని తమిళనాడు ఆలయాల్లాగానే గోడలమీద,స్థంభాలమీద,గోపురాలు అంతా శిల్ప సౌందర్యమే.. 
ఆలయగోపురం
గర్భగుడి ముందు ద్వారపాలకుడు


సింహం వాహన వినాయకుడు
ఆలయంలో కోనేరు 

 నాడీ జ్యోతిష్యం
 

వైదీశ్వరన్ కోయిల్ ఉన్న ఈ పట్టణం నాడీ  జ్యోతిష్యానికి ప్రసిద్ధి.గుడికి దగ్గర్లోనే చాలా మంది జ్యోతిష్యులు ఉన్నారు.మేము కూడా వెళ్ళి చెప్పించుకున్నాము.అసలే జాతకాలు తెలుసుకోవటమంటే ఆసక్తి,పైగా నాడీ జ్యోతిష్యానికి ప్రసిద్ధిచెందిన దగ్గర చెప్పించుకోవటం అదొక విశేషం:). వైదీశ్వరన్ కోయిల్ శివయ్య,అమ్మవారి దర్శనం చేసుకోవటం ఆనందంగా,నాడీ జ్యోతిష్యం కొంచెం వింతగా,మంచి ప్రదేశాలు చూశామని  సంతోషంగా,అక్కడ టీ టైమ్ కావటంతో మంచి టీ  తాగేసి అమృతఘటేశ్వర స్వామి దర్శనానికి బయలుదేరాము.

 అమృతఘటేశ్వరస్వామి

అమృతఘటేశ్వరస్వామి ఆలయం - తిరుక్కడయూర్ తమిళనాడు రాష్ట్రం,నాగపట్నం జిల్లా,నాగపట్నం కు 41 కిలోమీటర్ల దూరంలో  తిరుక్కడయూర్ లో శ్రీ అమృతఘటేశ్వర స్వామి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది.ఇక్కడ అమ్మవారు అభిరామి అమ్మన్.ఈ క్షేత్రంలో అమృతఘటేశ్వరునికి మార్కండేయుడు తపస్సు చేసి, రోజూ  సొరంగమార్గం ద్వారా జలం తెచ్చి,అభిషేకం చేసేవాడట. అల్పాయుష్కుడైన మార్కండేయుని కోసం యముడు రాగానే శివుడు యముడిని సంహరించి మార్కండేయుడిని చిరంజీవిగా ఆశీర్వదించాడు. సృష్టి ధర్మం కోసం దేవతలు శివుని ప్రార్ధించి యముని తిరిగి పునర్జీవితున్ని చేయమని కోరగా శివుడు దేవతల కోరికని మన్నించి యముడిని పునర్జీవితుడ్ని చేస్తాడు .ఆలయంలో స్వామివారి పాదాలకింద యముడు,పక్కనే ప్రార్థిస్తున్న మార్కండేయుడి విగ్రహాలు ఉంటాయి.ఈ ఆలయంలో షష్టిపూర్తి,ఆయుష్షుహోమాలు చేయించుకుంటారు. 

అమృతఘటేశ్వరస్వామి,అభిరామి అమ్మ.

గర్భగుడిలోంచి  బయటికి వచ్చాక ఎడమ వైపు అమ్మవారి కోవెల ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని "అభిరామి దేవి" అని అంటారు.అభిరామ భట్టారకుడు అనే మహా భక్తునిచే స్తుతింపబడింది కాబట్టి ఇక్కడ అమ్మవారిని  అభిరామి అని అంటారు.పార్వతీ దేవి పరమ భక్తుడైన అభిరామ భట్టారకుడు పార్వతీదేవి ధ్యానంలో ఉండి ఆ దేశాన్ని పాలించే మహారాజు రాకని కూడా పట్టించుకోడు. అందుకు ఆగ్రహించిన మహారాజు అభిరామ భట్టారకుని  ఆ రోజు తిథి ఏమని అడుగగా అమ్మవారి ధ్యానం లో ఉన్న అభిరాముడు అమ్మవారి తేజోరూపమును చూస్తూ ఆరోజు "అమావాస్య" తిథి కాగా "పౌర్ణమి"  అని చెప్తాడు దానికి ఆగ్రహించిన రాజు నువ్వు ఈరోజు చంద్రుడ్ని చూపించకపోతే శిరచ్చేదనం చేస్తానని అన్నాడు.ఈ లోకంలోకి వచ్చిన అభిరామ భట్టారకుడు అమ్మవారిని ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటూ అమ్మవారి పై అష్టోత్తరం చదవడం మెదలు పెడతాడు. ఈ అష్టోత్తరం లో ప్రత్యేకత ఏమిటంటే  మొదటి నామం యొక్క అంత్య అక్షరంతో తరవాత నామం మొదలవుతుంది. అలా ఆశువుగా గానం చేస్తూ ఉండగా అమ్మవారు తన కర్ణాభరణాన్ని ఆకాశంలోకి విసురుతుంది. ఆ కర్ణాభరణం అమావాస్య ఆకాశంలో పూర్ణ చంద్రునిలా మెరిసిపోతుంది.అది చూసిన  మహారాజు అభిరామ భట్టారకుని క్షమించమని వేడుకొని అప్పటి నుండి అమ్మవారి పేరు అభిరామిగా మార్చి అమ్మవారి సేవ చేసుకొని కాలాంతరాన శివ సాన్నిధ్యం చెందుతాడుఆ విధంగా "అభిరామి అంతాది" అనే మహాకావ్య రచన జరిగిన ఆలయం కూడా ఇదేనని స్థలపురాణం.
 
అభిరామి అమ్మవారి ఆలయ గోపురం

అమ్మవారి ఆలయంలో ద్వారపాలకులు

అమృతఘటేశ్వర స్వామి దర్శనం తర్వాత అక్కడికి దగ్గర్లోనే ఉన్న అనంతమంగళం ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్ళాము.నాగపట్నం జిల్లాలోని అనంతమంగళంలో ముక్కంటి హనుమాన్ ఆలయం ఉంది.ఈ ఆలయంలో త్రినేత్ర ఆంజనేయుడు భక్తులకు దర్శనమిస్తాడు.ఎప్పుడూ ఒళ్ళంతా సింధూరం రాసుకుని కనిపించే ఆంజనేయుడు ఇక్కడ వజ్రాభరణాలకవచాలతో ఉండటం విశేషం.ఆంజనేయుడు సింధూరం రాసుకోకముందు జరిగిన చరిత్ర ఇక్కడ మనకి కనిపిస్తుంది. త్రేతాయుగంలో రాముడు రావణుడిని సంహరించిన తర్వాత నారదుడు వచ్చి యుద్ధం ఇంకా పూర్తికాలేదని రావణుడి వారసులు రక్తబిందు,రక్తాక్షుడు పగతో యుద్ధానికి సిద్ధమవుతున్నారని చెప్పాడు.ఆ రాక్షసులని సంహరించటానికి ఆంజనేయుడి సరైనవాడని, బ్రహ్మ,విష్ణు, మహేశ్వరులు,శక్తిమాత ఆంజనేయునికి తమ ఆయుధాలను అందించగా వాటిని పదిచేతులలో ధరించి ఆంజనేయుడు ఆ రాక్షసులను సంహరించిన ప్రదేశం కాబట్టి ఇక అంతా  శుభమే అన్న అర్ధంలో ఆ ప్రదేశానికి అనంతమంగళం అనే పేరు వచ్చింది.అందుకే ఆంజనేయస్వామి ఇక్కడ దశభుజాలతో, ఆయుధాలలో శివుడు ప్రసాదించిన మూడో కన్నుతో దర్శనమిస్తాడు.

 అనంతమంగళం ఆంజనేయస్వామి 

గర్భగుడిలో ముక్కంటి హనుమాన్

ఈ ఆలయానికి ఎదురుగా శ్రీదేవి భూదేవి సమేత
రాజగోపాలస్వామి ఆలయం కూడా ఉంది. 

అనంతమంగళం నుండి రామేశ్వరం వెళ్లే దారిలో మేము వెళ్ళిన velankanni  లేక్ రిసార్ట్ (Velankanni Lake Resort) మాకు చాలా నచ్చింది.ఇది తమిళనాడులో ఉన్న ఒకే ఒక్క Backwater Resort అట. నాగపట్నం జిల్లాలోని మన తెలుగులో వేళాంగిణీ మాత అని పిలిచే velankanni చర్చికి 4 km దూరంలో Karuvelankadai అనే విలేజ్ లో హైవే పక్కనే చాలా ప్రశాంతమైన వాతావరణంలో నీళ్ల మధ్యలో ఉంది.కిందంతా నీళ్ళు, పైకి పిల్లర్స్ మీద కట్టిన ఆ రిసార్ట్ లో పగలయితే ఇంకా బాగుంటుందేమో అనిపించింది.అక్కడే కాటేజెస్,స్పాలు,Multicuisine Restaurant అన్నీ ఉన్నాయి. ఆ రిసార్ట్ కింద ఉన్న నీళ్లలో చేపలు,రొయ్యలు పెంచి అవే వండికూడా పెడతారట.open air Restaurant లో మేము కూడా డిన్నర్ చేశాము.




రిసార్ట్ లో మాతమ్ముడు

పాండిచ్చేరిలో ఆరోవిల్ "Auroville" విలేజ్ :
మహాబలిపురం నుండి చిదంబరం వెళ్లే దారి మధ్యలో పాండిచ్చేరికి 2 గంటల ప్రయాణం.అక్కడికి వచ్చేసరికి చీకటిపడటంతో అక్కడ చూసేదేమీలేదు.కానీ నేను మేము ట్రిప్ కి వెళ్లేముందు తమిళనాడులో చూడాల్సిన ప్రదేశాలు నోట్ చేస్తున్నప్పుడు పాండిచ్చేరి లో "Auroville" అనే ఒక ప్రాంతం గురించి నెట్ లో చదివాను ఆధ్యాత్మికవేత్త శ్రీ అరబిందో శిష్యురాలు మదర్‌ ఆల్ఫాస్సా ఆధ్వర్యంలో 1968 నుండి నిర్మించిన ప్రయోగాత్మక ప్రాంతము ,లేకపోతే  ఒక గ్రామం అనొచ్చేమో.కొంతమంది ఉద్యోగాలు,చదువుల కోసం విదేశాలు వెళ్తుంటారు,కొంతమంది కొత్త ప్రదేశాలు సరదాగా చూడటానికి వెళ్తుంటారు. కానీ ఇక్కడికి వచ్చే విదేశీయులు మాత్రం ప్రశాంతమైన జీవితం గడపటానికి వస్తుంటారట.చాలామంది మంచి వృత్తులు,ఉద్యోగాలు చేస్తూ లక్షలు లక్షలు సంపాదిస్తూ కూడా ప్రశాంతత లేక అప్పుడప్పుడు చేసే యోగాలు,ధ్యానాలు చాలక పూర్తిగా ఉద్యోగాలు, కుటుంబాలు కూడా వదిలేసి ఇక్కడికొచ్చి ఉంటారట.ఇక్కడ వాలంటీర్లుగా పనిచేస్తూ పల్లెలలో ఎలాంటి జీవితాన్ని గడుపుతారో అలా ఉంటారట.అలాగని అక్కడ పూర్తి పల్లెటూరి వాతావరణం ఏమీ ఉండదు.రకరకాల మోడల్స్ లో కాటేజీలు,ఇటాలియన్,ఫ్రెంచ్ ఇంకా చాలా విదేశీ రెస్టారెంట్లు, బేకరీలు,కాఫీ షాపులు,WiFi, అన్నీ సౌకర్యాలు ఉంటాయి. సుమారు 50 దేశాలకు సంబంధించిన మనుషులు ఇక్కడ ఉన్నారట.మానవులంతా ఒక్కటే అని చాటి చెప్తూ (ideal of human unity )ప్రపంచ దేశాల ప్రజలంతా కలిసి,మెలసి (అక్కడికెళ్లి?)ఉండాలన్న సంకల్పంతోనే దీన్ని నిర్మించారట.ఇక్కడ ధ్యాన మందిరాన్ని "మాతృమందిర్" అని పిలుస్తారు.ఈ ధ్యాన మందిరం ఒక గ్లోబ్ ఆకారంలో ఢిల్లీ లోని  లోటస్ టెంపుల్ లాగా ఉంది.ఇదంతా నెట్ లో చదివిన నేను ఆహా ఆ ఆరోవిల్ విలేజ్ ఏంటో నేను చూడాల్సిందే,అంతా కొత్త కాన్సెప్ట్,ఊర్లు తిరుగుతూ ధ్యానాలు,యోగాలు చేపించే గురూజీల కంటే డిఫరెంట్గా ఉంది కదా అందుకే ఖచ్చితంగా వెళదాంరా అని వెళ్లేముందే మా తమ్ముడికి చెప్పాను.

మాతృమందిర్  (photo - Google )

నెట్ లో చదివి నేనేదో మన ఢిల్లీ లో చారిత్రాత్మక స్థలాల్లాగా రోడ్డుమీదకు కనపడే ప్రదేశాల్లాగానో,గుడిలాగానో, ఆశ్రమంలాగానో ఉంటుందిలే Visitor's Centre ఉంటుందట. అక్కడ వివరాలు తెలుసుకోవచ్చనుకుని, చీకటిపడినా అక్కడ కాటేజెస్ ఉంటాయట, అక్కడే ఉండి ఉదయాన్నే చూసి రావచ్చులే అని బయల్దేరాము.పాండిచ్చేరి దాటి సుమారు 1/2 గంట ప్రయాణం చేశాక "Auroville"విలేజ్ వచ్చింది. కానీ ఇంకా లోపలికి వెళ్ళాలని ఉన్న బోర్డులు చూసి లోపలికి వెళ్ళేకొద్దీ పూర్తి ఎర్రమట్టి రోడ్లు,చుట్టూ పెద్ద పెద్ద చెట్లు పూర్తిగా అడవిలోకి వెళ్ళిపోయాం.ఆ అడవిలోనే చెక్క దడుల మధ్యలో వీళ్ళకి సంబంధించిన స్కూల్ కూడా ఉంది.ఇంకా కొంచెం ముందుకెళ్లాక అక్కడ సెక్యూరిటీ వాళ్ళున్నారు.వాళ్ళని అడిగితే సాయంత్రం 4 :30 వరకే లోపలికి  Allow చేస్తారని,ఇప్పుడు వెళ్ళినా ఉపయోగంలేదని, మాతృమందిర్ చూడాలంటే 2 రోజుల ముందే వెళ్లి అక్కడ కాటేజెస్ లో ఉండాలని చెప్పారు.మనకంత వద్దులే అనుకుని ఎంత వీలయితే అంత ఫాస్ట్ గా బయటపడాలని వెనక్కి బయలుదేరాము.కబాలీ సినిమాలో రజనీకాంత్ హీరోయిన్ని వెతికే సీన్ చూస్తుంటే నాకు మేము వెళ్లిన ప్రదేశాలు గుర్తొచ్చాయి.అంతా అలాగే ఉంది.సినిమాలో యానాం ఫ్రెంచ్ కాలనీ అన్నారు కానీ నాకైతే మేము తిరిగిన ఆరోవిల్ విలేజ్ పరిసరాలు గుర్తొచ్చాయి.ఎలాగో సేఫ్ గా బయటపడ్డాము కానీ ఆ చీకటిలో అంత అడవిలోకి వెళ్ళి,ఎంత తప్పు చేశాము అని ఇప్పుడు తలచుకుంటే అనిపిస్తుంది.అందుకే పెద్దలు అంటారు మనసు వెళ్లిన ప్రతి చోటికి మనిషి వెళ్ళకూడదు అని.ఎవరైనా వెళ్లాలంటే పగలు వెళ్లి,పాండిచ్చేరి లో ఆటో, ట్యాక్సీ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళకి పూర్తి వివరాలు తెలుస్తాయని మాకు తర్వాత తెలిసింది.  
  
auroville village లో ఒక బోర్డు 
 

మేము వెళ్ళినప్పుడు తమిళనాడు ఎలెక్షన్స్ జరుగుతుండటంతో వాహనాల్లో డబ్బు తరలిస్తారని ఎక్కడ చూసినా పోలీస్ చెకింగ్స్ జరుగుతున్నాయి.మాకసలే లగేజ్ ఎక్కువ,మా మరిదిగారు ID కార్డ్  చూపించటంతో సరిపోయింది కానీ  లేకపోతే లగేజ్ కార్లోంచి  తీయటానికి,  పెట్టటానికే  టైమ్ అంతా సరిపోయేది..అంతగా ప్రతిచోటా చెకింగ్స్ జరుగుతున్నాయి. తమిళనాడులో ఇంకొక సమస్య భాష.ఎక్కడ గుడికి వెళ్లినా వివరాలు తెలిపే అన్ని బోర్డులు తమిళంలోనే ఉంటాయి.ఒక్కోసారి మనం ఏ గుడికి వెళ్ళామా అని కూడా సందేహం కూడా వస్తుంది.మేము చూసిన చాలా ఆలయాలు GPS హెల్ప్ తో ఎవరినీ అడ్రెస్ అడిగే అవసరం లేకుండా చూసినవే.మధ్యలో మనకి తెలియని ఎన్నో ప్రదేశాలని కూడా వేరే మనిషితో పనిలేకుండా GPS చూపిస్తుంది. ఇవీ మా చిదంబరం యాత్రా విశేషాలు.

 ఎలక్షన్స్ ప్రచారంలో తమిళ అభిమానులు

 Some Thing Special - తమిళనాడు రెడ్ బనానా 

2 కామెంట్‌లు:

Unknown చెప్పారు...


మీ యాత్రావిశేషాలు బాగున్నాయి.పాండిచ్చేరి Auroville గురించి మనవైపు ఇంకా అంతగా తెలియదనుకుంటాను.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

@ Swarna M విశేషాలు నచ్చినందుకు,మెచ్చుకున్నందుకు Thanks అండీ..నిజమే "Auroville" గురించి నేను సొంతగా నెట్లో చూసి తెలుసుకున్నాను.వాళ్లకి "కొంతమంది"లాగా ప్రచారం చేసుకోవటం రాలేదో ఏమో కానీ బయట అంతగా తెలిసినట్లు లేదు మరి.
నాకు తెలియదో ఎవరికీ తెలియదో అనేది నాకు కూడా సరిగ్గా తెలియదు :)

Related Posts Plugin for WordPress, Blogger...