పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

31, డిసెంబర్ 2016, శనివారం

మా తమిళనాడు యాత్రా విశేషాలు - కన్యాకుమారి



"కలికి పదములు కడలి కడిగిన కళ ఇది"

Cape Comorin, కన్యాకుమారి తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లాలోని ఒక పట్టణము.భారతదేశానికి దక్షిణాన భరతమాత పాదాలను బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రం, హిందూ మహాసముద్రం నిత్యం కడిగే పవిత్ర త్రివేణి సంగమక్షేత్రం కన్యాకుమారి.భారతదేశానికి దక్షిణం వైపున చిట్టచివరి ప్రదేశం.కన్యాకుమారిలో సూర్యోదయానికి చాలా ప్రత్యేకత ఉందికదా,సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు.సూర్యోదయంచాలా బాగుంటుందని,ఖచ్చితంగా చూడమని మేము దిగిన హోటల్ వాళ్ళు కూడా చెప్పారు. ఉదయాన్నే మేమున్న హోటల్ మీద,చుట్టుపక్కల అన్నీ చోట్ల యాత్రికులు డాబాలెక్కి,సముద్రతీరానికి దగ్గరలో అంతా తెల్లవారుఝామునుండే సూర్యోదయం కోసం ఎదురుచూస్తున్నారు.మేము కూడా సూర్యుడి కోసం కాసేపు ఎదురుచూసి,సూర్యుడ్ని చూసేసి వచ్చాము.

మేమున్న హోటల్ కి ఎదురుగానే ఉన్న కన్యాకుమారి ఆలయంలో అమ్మ దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ పార్వతీదేవి కన్యాకుమారి అమ్మవారిగా కొలువయ్యింది.పురాణ కథనాల ప్రకారం అమ్మవారు కన్యాదేవిగా , పరమశివుడిని వివాహం చేసుకునేందుకు అంతా సిద్ధం చేశాక ముహూర్తం సమయానికి కూడా శివుడు రాకపోవటంతో వివాహం ఆగిపోయింది అందుకే అమ్మవారిని కన్యాకుమారిగా పూజిస్తారు.పెళ్ళివిందుకు సిద్ధంచేసిన బోజనాలను సముద్రం ఒడ్డున పారబోశారట. కాలక్రమంలో అవే చిన్న చిన్న రాళ్లుగా, బండలుగా మారిపోయాయని స్థానికుల నమ్మకం. అందుకే ఇప్పటికీ కన్యాకుమారి సముద్రం ఒడ్డున బియ్యాన్ని పోలిన సన్నటి రాళ్లు కనిపిస్తుంటాయని చెబుతుంటారు. గుడిలో జనం తక్కువగానే ఉండటంతో అమ్మ దర్శనం ప్రశాంతంగా చేసుకుని,బయటికి వచ్చేశాము.గుడికి ఎదురుగానే దూరంగా సముద్రంలో కనిపిస్తున్న వివేకానంద రాక్‌ ని చూస్తూ కాసేపు అక్కడే ఉండి,ఇక  వివేకానంద రాక్‌కి బయలుదేరాము.

కన్యాకుమారి అమ్మవారి దేవాలయం 

వివేకానంద రాక్ కి సాయంత్రం 4 గంటల దాకా యాత్రికులకోసం బోట్స్ నడుస్తుంటాయి.ఇక్కడ ferry tickets కోసం ఉన్నంత క్యూ దేవాలయాల్లో కూడా ఉండదేమో అనిపించింది.కానీ ఆ ప్రదేశానికున్న ప్రత్యేకత అలాంటిదేమో.దక్షిణ భారతదేశపు చివరి భూభాగంలో ఉండటమే ఒక అద్భుతమైతే, భారత భూభాగాన్ని దాటి మూడు సముద్రాల సంగమం మధ్యలో ఉన్న చిన్న కొండమీదకి  వెళ్తున్నామనే సంతోషం ముందు ఈ క్యూ పెద్ద సమస్యగా అనిపించదు కూడా.వేగంగా, అలలతో ఉన్న సముద్రంలో  ప్రయాణం నిజంగా అద్భుతం.

Ferry Ticket 

 వివేకానంద రాక్ వెళ్లే బోట్స్   

వివేకానంద రాక్ / Vivekananda Rock Memorialఇక్కడ 1892లో స్వామి వివేకానంద ధ్యానం చేశారు.ఆయన ధ్యానం చేసిన ఈ ప్రదేశంలో స్మారక కేంద్రం నిర్మించారు.ఇక్కడ 12 అడుగుల ఎత్తుతో నిలుచుని ఉన్న వివేకానందుడి నిలువెత్తు కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణ.1970వ సంవత్సరంలో అప్పటి రాష్టప్రతి వి.వి.గిరి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఇక్కడ బుక్ షాప్స్,మెడిటేషన్ హాల్ కూడా ఉన్నాయి.వివేకానందుడి రచనలే కాకుండా ఇక్కడ ఇంకా చాలా మంచి పుస్తకాలున్నాయి.

ఇక్కడ వివేకానందుడే కాదు పార్వతీదేవి కూడా తపస్సు చేసిందట.వివేకానంద స్మారక కేంద్రం ఎదురుగా ఉన్న దేవాలయం పార్వతీదేవి  పరమశివుడిని పెళ్ళి చేసుకోవాలని తపస్సుచేసిన ప్రాంతం,అక్కడ అమ్మవారి పాదముద్రలు ఉంటాయి.నల్లటి పాలరాయి మీద తెల్లటి డిజైన్స్ తో నిర్మించిన వివేకానంద స్మారకమందిరం,అమ్మవారి ఆలయం చాలా అందంగా ఉన్నాయి.

వివేకానంద రాక్‌కు సమీపంలోనే 133 అడుగుల ఎత్తుతో తిరువళ్లువర్‌ విగ్రహం ఉంటుంది.తమిళనాడుకి చెందిన,రెండువేల సంవత్సరాల క్రితం జీవించిన  ప్రముఖ కవి.ఇతని రచన తిరుక్కురళ్ తమిళ సాహిత్యంలో ప్రసిధ్ధి చెందింది.నీతి బోధలతో ఉన్న ఇతని కవిత్వం తమిళప్రజల మనోభావాలను ప్రతిబింబిస్తుందని చెప్తారు.
తిరువళ్ళువర్ విగ్రహాన్ని 2000 సంవత్సరంలో ఆవిష్కరించారు.ఇక్కడికి ఇంతకుముందు యాత్రికులను తీసుకెళ్ళేవాళ్ళట, కానీ ఇప్పుడు వివేకానంద రాక్ దాకానే తీసుకెళ్తున్నారు.బోట్లో నుండి దూరంగా కనిపించే వివేకానంద రాక్,తిరువళ్ళువర్ విగ్రహం దగ్గరయ్యేకొద్దీ ఒక గొప్ప ప్రదేశాన్ని చూస్తున్నామని చాలా సంతోషంగా అనిపిస్తుంది.


సముద్రం మధ్యలో చాలా ప్రశాంతంగా, చుట్టూ ఎంత మంది ఉన్నా నిశ్శబ్దంగా చాలా బాగుంది,కానీ ఎండ ఎక్కువగా ఉంది.ఇక్కడ సాయంత్రం 4 గంటల వరకు మనకిష్టమైనంత సేపు ఉండొచ్చు. మేము కూడా చాలాసేపు అంతా తిరిగి చూశాము,కొన్ని బుక్స్ తీసుకున్నాము,ఎంతసేపున్నా విసుగనిపించలేదు,చుట్టూ నీలిరంగు సముద్రం,మధ్యలో చిన్న రాక్ మీద రకరకాల ప్రదేశాల మనుషులు నిజంగా అద్భుతం. 

వివేకానంద స్మారక మందిరం 


మందిరం లోపలికి 

బుక్స్ 

మెడిటేషన్ హాల్ 

తిరువళ్ళువర్ విగ్రహం 


ఇవీ మా కన్యాకుమారి యాత్ర విశేషాలు.కొన్నిటి గురించి మాటల్లో  చెప్పలేము.
అలాంటిదే కన్యాకుమారి కూడా..మా అందరికీ చాలా నచ్చిన ప్రదేశం.

కన్యాకుమారి నుండి మధురై వెళ్ళేదారిలో wind farms 
దారిపొడవునా రోడ్డుకి రెండువైపులా చాలాదూరం వరకు ఇలాగే కనిపిస్తూ ఉంటాయి.  

రామేశ్వరం నుండి కన్యాకుమారి వెళ్ళేదారిలో తిరునల్వేలి వస్తుంది.ఇక్కడ హల్వా చాలా famous అట.దీన్ని తిరునల్వేలి హల్వా లేదా IruttuKadai halwa అంటారు.online లోకూడా తెప్పించుకుంటారట.తిరునల్వేలి వెళ్ళగానే,మనం కూడా కొనుక్కుందామని  మాతమ్ముడు అక్కడ వాళ్ళని ఈ హల్వా గురించి అడగ్గానే Santhi Sweets లో బాగుంటుందని అడ్రెస్ కూడా చెప్పారు.మేము అక్కడికే వెళ్లి హల్వా కొన్నాము. నిజంగా చాలా బాగుంది Iruttu Kadai halwa♡. 

Tirunelveli Halwa 



6 కామెంట్‌లు:

కుమార్ దేవరింటి చెప్పారు...

నిజమేనండి నేనుకూడా మా కుటుంబం కన్యాకుమారి వెళ్ళాం , వివేకానంద రాక్ మీద ఎంత సేపు ఉన్న విసుగు అనిపించదు , మీరు చెప్పినట్లు మాటల్లో చెప్పలేం , చూస్తేనే ఆ అనుభవం లభిస్తుంది .హల్వా మేము కూడా తిన్నాం , అక్కడే కొబ్బరి ఒలిగలు బలే ఉంటాయి.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

Devarinti hema Kumar గారు.. పోస్ట్ నచ్చి స్పందించినందుకు,మీ కన్యాకుమారి టూర్ విశేషాలు చెప్పినందుకు చాలా థ్యాంక్సండీ.కొబ్బరి ఒలిగలు గురించి మాకు తెలియదండీ.. తెలిస్తే తీసుకునే వాళ్ళం.

Thank you once again..

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మీ తమిళనాడు పర్యటనలో భాగంగా చూసిన కన్యాకుమారి విశేషాలు ఆసక్తికరంగా ఉన్నాయి రాజ్యలక్ష్మి గారు. కన్యాకుమారి సమీపంలోనే సుచీంద్రం, నాగర్ కోయిల్ కూడా ప్రసిద్ధి చెందిన ప్రదేశాలే. ఆ ప్రాంతాలు, రామేశ్వరం, మధురై మేమూ చూశాను. నాకు బాగా నచ్చినది ఆ wind mills. వాటి వల్ల అక్కడ landscape బాగుంటుంది కదా. వాటి దగ్గర ఈపాటికే సినిమా వాళ్ళు పాటలో, ఫైటింగులో చిత్రీకరించకుండా వదిలేసి ఉంటారా ? "బారిస్టరు పార్వతీశం" పుస్తకంలో మద్రాసు నుంచి ట్యుటికొరిన్ (ఇప్పటి తూత్తుకుడి) వెళ్లే రైల్లో ప్రయాణిస్తూ కిటికీలోంచి చూస్తూ "అరవదేశం" (అతని మాటే) కూడా అందమైన ప్రాంతమే సుమా అనుకుంటాడు పార్వతీశం 🙂. ఆ రాష్ట్రంలో తిరుగుతుంటే నిజమే అనిపిస్తుంది. తమిళనాడులో దర్శనీయ స్థలాలు చాలా ఉన్నాయి.

కన్యాకుమారిలో తిరువళ్ళువార్ విగ్రహం వివేకానంద రాక్ పక్కనే పెట్టడం మాత్రం అంత సరైన పని అనిపించలేదు నా మటుకు. వివేకానంద రాక్ ఎప్పటినుంచో అక్కడ ఉన్నది కదా (ఆ స్మారకచిహ్నానికి ముఖ్య కారణం వివేకానందుడు కొంతకాలం అక్కడ ధ్యానం చేసుకుంటూ గడిపాడు కాబట్టి). "తిరుక్కురళ్" మహా గ్రంధం రచించిన తిరువళ్ళువార్ నిస్సందేహంగా గొప్ప వ్యక్తే. తప్పక గౌరవించుకో తగ్గ మహానుభావుడే. అయితే వివేకానంద మెమోరియల్ అల్రెడీ అక్కడ ఉండడం మూలాన తిరువళ్ళువార్ విగ్రహాన్ని వేరే చోట - ఉదాహరణకి రామేశ్వరంలో - పెట్టి ఉండచ్చు తమిళనాడుకి పొడవైన కోస్ట్ లైన్ ఉంది కాబట్టి. అంతకన్నా కూడా వాళ్ళ రాజధాని చెన్నైలోనే సముద్ర తీరంలో స్ధాపించి ఉంటే ఇంకా ఘనంగా ఉండేది. అంత ఎత్తుగా కన్యాకుమారిలో పెట్టడం పోటీగా పెట్టినట్లు అనిపిస్తుంది నా మటుకు (వేరే బలమైన కారణాలేమన్నా ఉన్నాయేమో మరి?). రెండింటి అందం దెబ్బ తిన్నదనిపించింది. అఫ్ కోర్స్ ఇదంతా నా స్వంత అభిప్రాయం లెండి. వాళ్ళ రాష్ట్రం వాళ్ళిష్టం.

మరిన్ని మీ తమిళనాడు యాత్రా విశేషాలు వ్రాయండి.
మీకు మీ కుటుంబానికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Judicial Officer నియామక పోటీ పరీక్షలకి కూడా మీకు all the best.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

విన్నకోట నరసింహరావు  గారు నమస్తే అండీ.. మీ నూతన సంవత్సర శుభాకాంక్షలకు,చక్కని వ్యాఖ్యకు ధన్యవాదాలు.మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

నాగర్ కోయిల్,సుచీంద్రం కూడా వెళ్ళాలనుకున్నాము, కానీ సమయం సరిపోదని మధురై వెళ్ళిపోయాము.మీరన్నట్లు బారిస్టర్ పార్వతీశం గారు చెప్పింది నిజమేనండీ అరవదేశం నిజంగా చాలా బాగుంది :) ఎంత చూసినా ఇంకా చూడాల్సిన గొప్ప ప్రదేశాలు  చాలా ఉన్నాయే అనిపిస్తుంది.

తిరువళ్ళువర్ ని తమిళనాడు వేమనగా చెప్తారట కదండీ. విగ్రహం గురించి ఇంతగా ఆలోచన రాలేదు కానీ మీరన్నట్లు ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టటంలో ఆ  రాష్ట్రం వాళ్ళ ఆలోచన ఏమిటో మరి..

exam రాశానండీ.. waiting for Screening test results. Thank you for your best wishes.

Lalitha చెప్పారు...

మీ కన్యాకుమారి యాత్రా విశేషాలు, ఫోటోలు చాలా బావున్నాయి.
నానీస్ కిచెన్ బ్లాగ్ మీ అమ్మగారు రాస్తారనుకుంటున్నాను. కరెక్టేనా?
Best Wishes for your Judicial Officer-screening test results! Awaiting good news...

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

లలిత గారు కన్యాకుమారి విశేషాలు,ఫోటోలు నచ్చినందుకు,మెచ్చుకున్నందుకు చాలా థ్యాంక్సండీ.
మీరు చెప్పింది కరెక్టేనండీ నానీస్ కిచెన్ బ్లాగ్ మా అమ్మగారిదే :)
Thank you so much for your best wishes.

Related Posts Plugin for WordPress, Blogger...