ఓం శ్రీ మాత్రే నమః
అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ, దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ, కృపాబ్ధి ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.
శ్రీ గర్భరక్షాంబికా అమ్మ - Garbha-Raksha-Ambigai ( savior of fetus)
తంజావూర్ బృహదీశ్వరాలయం నుండి అక్కడికి చాలా దగ్గర్లో 40 min (23.4 km) ఉన్న గర్భరక్షాంబికా అమ్మవారి దేవాలయానికి వెళ్ళాము.తమిళనాడు టూర్ అనుకున్నప్పుడు మేము చూడాల్సిన కొన్ని ప్రదేశాలు ముందుగానే అనుకున్నాము కానీ గర్భరక్షాంబికా ఆలయం గురించి తెలియకపోయినా అమ్మ దర్శనభాగ్యం అనుకోకుండా కలిగింది.మేము చెన్నై వెళ్ళటానికి సరిగ్గా వారం ముందు ఈనాడు Sunday Magazine లో అమ్మవారి గురించి,ఆ క్షేత్ర మహిమ గురించి అక్కడికి వెళ్లిన వాళ్ళు రాశారు.అది చదివాక గర్భరక్షాంబికా అమ్మని ఖచ్చితంగా చూడాలి అనుకున్నాము.పిల్లలు లేని వారికి సంతానభాగ్యాన్ని కలిగించటం,సంతాన రక్షచేయటం ఇక్కడ అమ్మవారి విశిష్టత.ఇక్కడ అమ్మవారు శ్రీ గర్భరక్షాంబికాదేవి గా,శివయ్య ముల్లైవన నాథర్ గా కొలువయ్యారు.
శ్రీ గర్భరక్షాంబికా సమేత శ్రీ ముల్లైవన నాథర్ ఆలయం - తిరుకరుకవుర్
Shri Garbharakshambika Sameta Shri Mullaivana Nathar temple
గర్భరక్షాంబికా ఆలయం తమిళనాడులోని తంజావూర్ జిల్లా పాపనాశం తాలూకా తిరుకరుకవుర్ గ్రామంలో ఉంది.కావేరీనది ఉపనది అయిన వెట్టార్ నది ఒడ్డున,కుంభకోణం,తంజావూర్ మధ్య ఉన్న ఈ గ్రామంలోని గర్భరక్షాంబికా అమ్మవారి ఆలయం వేయి సంవత్సరాల పురాతనమైంది. రాజరాజ చోళ - 985 and 1014
AD పేరు మీద తొమ్మిదవ శతాబ్దంలో వేయించిన శిలాఫలకాలు ఇక్కడ కనిపిస్తాయి.ప్రశాంతమైన వాతావరణంలో,ఐదు అంతస్థుల రాజగోపురంతో ఉన్న ప్రవేశ ద్వారం నుండి లోపలి వెళ్తాము.క్షేత్రం యొక్క మహిమను అప్పార్, సుందరార్ మరియు సంబంధార్ అనే ముగ్గురు నాయనార్లు తమ పద్యములలో కీర్తించారు.
దేవాలయ ప్రధాన గోపురం
ఆలయ ప్రవేశ ద్వారం
ఆలయ ప్రధాన మండపం
ఆలయం దగ్గరికి వెళ్ళగానే ముందుగా పెద్ద కోనేరు కనిపిస్తుంది.ఈ కోనేరును పాలకుండం KsheeraKundam (Milk Pond) అంటారు.అమ్మవారి భక్తులైన నిధ్రువర్,వేదికైల బిడ్డ నైధ్రువన్ కోసం కామధేనువు ఇచ్చిన పాలతో ఈ కోనేరు ఏర్పడిందని స్థలపురాణం.
Ksheera Kundam (Milk Pond)
కోనేరులో అమ్మవారు
స్థలపురాణం
శివభక్తుడైన నిధ్రువర్ మహర్షి ఆయన భార్య వేదికైలు సంతానం కోసం శివపార్వతులను ప్రార్ధించగా అమ్మ కరుణించి వేదికై గర్భందాల్చుతుంది.ఆమె మూడవ త్రైమాసికంలో ఉన్నప్పుడు,నిధ్రువర్ మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో ఊర్ధ్వపాదుడు అనే మహర్షి ఆశ్రమానికి వస్తారు.అప్పటికే ఇంటిపనులలో అలసిపోయిన వేదికై విశ్రాంతి తీసుకుంటూ మహర్షిని గమనించక అతిథిమర్యాదలు చేయలేకపోతుంది.దాంతో ఆగ్రహించిన ఊర్ధ్వపాదుడు,వేదికై గర్భంధరించి ఉందని తెలియక ఆమెను శపిస్తారు.ఆ శాపఫలితంగా ఆమె వింతవ్యాధితో బాధపడుతూ,గర్భంలో ఉన్న శిశువుకు ప్రమాదకర పరిస్థితి వస్తుంది.వెంటనే ఆమె ఎంతో వేదనతో పార్వతీమాతను ప్రార్ధించగా అమ్మవారు వెంటనే ప్రత్యక్షమయ్యి ఆ గర్భస్థ పిండమును ఒక కుంభంలో(పాత్ర) ఉంచి రక్షించి, పిల్లవాడ్ని చేసి మునిదంపతులకు అందిస్తుంది.
ఆ బిడ్డకి నైధ్రువన్ అని పేరు పెడతారు.పుట్టిన ఈ శిశువుకి కామధేనువు తన పాలిచ్చి ఆకలి తీరుస్తుంది. నిధ్రువర్ మహర్షి అమ్మ దయకు ఎంతో సంతోషించి శివపార్వతులు అక్కడే ఉండి అమ్మని వేడుకున్న భక్తులను ఎప్పటికీ కాపాడి, కరుణించాలని ప్రార్ధించగా,మహర్షి కోరిక ప్రకారం అమ్మవారు ఇక్కడ గర్భారక్షాంబికగా,శివయ్య ముల్లైవననాథర్ గా కొలువయ్యారు.
స్థలపురాణం ఆలయంలోని గోడలపైన చిత్రాలతో ఉంటుంది
సంతానం కోసం శివపార్వతులని పూజిస్తున్న మహర్షి దంపతులు
గర్భందాల్చిన వేదికైని ఊర్ధ్వపాదుడు శపించుట
మునిశాపం కారణంగా ఆపదలో ఉన్న గర్భస్థ పిండాన్ని
కుండలో పెట్టి కాపాడుతున్న పార్వతీమాత
కాపాడిన బిడ్డకి నైధ్రువన్ అని పేరు పెట్టి
దంపతులకు అందించిన శివ పార్వతులు
నైధ్రువన్ కు పాలిచ్చిన కామధేనువు
అమ్మలకే అమ్మ, జగమంతా నిండిపోయిన శక్తి స్వరూపం ఆదిపరాశక్తి పార్వతీమాత ఇక్కడ మాతృత్వాన్ని కాపాడే అమ్మగా,గర్భరక్షాంబికాదేవిగా కొలువై ఉంది.సకల జీవరాశిని తన బిడ్డలుగా కాపాడే అమ్మని సంతానం కోసం,వాళ్ళ క్షేమం కోసం వేడుకుంటే చాలు కోరుకున్న కోరిక తీర్చి,గర్భం ధరించి,సుఖప్రసవం అయ్యేదాకా వెన్నంటి కాపాడుతుందని భక్తుల విశ్వాసం.గర్భాలయంలో అమ్మవారి నిలువెత్తు విగ్రహం అందమైన కంచిపట్టు చీరలు, నగలు,పువ్వుల అలంకరణలో నవ్వుతూ మనవైపు చూస్తున్నట్లే అనిపిస్తుంది.అమ్మవారిని గర్భగుడికి చాలా దగ్గర నుండి దర్శించుకోవచ్చు.ఇక్కడ సంతానం కోసం మాత్రమే కాదు,పెళ్ళికాని ఆడపిల్లలు కూడా అమ్మని మొక్కుకుంటే త్వరగా పెళ్ళి జరుగుతుందని నమ్మకం.
అమ్మ ప్రసాదించే వరాలు
గర్భధారణ కోసం,సుఖ ప్రసవం కోసం ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు.పిల్లల కోసం వచ్చిన దంపతులకు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి,నెయ్యి,కుంకుమ ప్రసాదంగా ఇస్తారు.గర్భవతుల సుఖప్రసవం కోసం పూజ చేసి ఆముదం ప్రసాదంగా ఇస్తారు.అమ్మ దయవలన సంతానం కలిగిన దంపతులు పుట్టిన పిల్లలతో ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆలయంలో ఉన్న బంగారు ఉయ్యాలలో బిడ్డని ఉంచి,ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. తులాభారంతో మొక్కులు తీర్చుకుంటారు.
ఆలయం లోపలి ప్రాంగణం
ఇక్కడ శివయ్య ముల్లైవన నాథర్ గా కొలువై ఉన్నారు.ముల్లైవన నాథర్ అంటే మల్లెల వనంలో కొలువైన శివుడు. తెలుగులో మల్లికార్జున స్వామి అని అర్ధమట.ఇప్పుడు ఆలయం ఉన్న ప్రాంతం ఒకప్పుడు మల్లెలవనం కాగా,ఆ మల్లెలవనంలో స్వయంభువుగా మల్లెతీగలతో కప్పబడిన శివలింగం కనిపించిందట.అందుకే శివలింగంమీద ఇప్పటికీ మల్లెతీగ గుర్తు ఉంటుంది.పుట్టమన్నుతో ఏర్పడిన స్వయంభూలింగం కావడం వలన ఇక్కడి శివుణ్ణి నీటితో అభిషేకించరు.పునుగు,సుగంధ తైలాలతో మాత్రమే అభిషేకాలు చేస్తారు.దీనినే Punugu sattam pooja అంటారు.ఇక్కడ స్వామిని పూజిస్తే చర్మవ్యాధులు,దీర్ఘకాలం నుండి తగ్గని వ్యాధులు కూడా నివారించబడతాయని నమ్మకం. ప్రతి సంవత్సరం తమిళ ఫాల్గుణ మాసంలో(March-April)పౌర్ణమినాడు చంద్ర కిరణాలు శివలింగము మీద పడటం ఇక్కడ మహిమ.ఆలయంలో స్వయంభూ వినాయకుడు,నందీశ్వరుడు,సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉన్నారు.వైశాఖమాస ఉత్సవాలు,నవరాత్రి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి.కనకదుర్గమ్మ ఆలయంలో లాగా ఇక్కడ తెప్పోత్సవం కూడా జరుగుతుంది.ఆలయ వేళలు ఉదయం 5.30am to 12.30pm సాయంత్రం
4.00pm to 8.00pm.
అమ్మని దర్శించుకున్నవాళ్ళకి ఎంతమందికో సంతాన భాగ్యం కలిగిందని,మన దేశంలోనే కాదు విదేశాల నుండి కూడా ఇక్కడికి భక్తులు వస్తారని,మొక్కుకుంటే ఖచ్చితంగా కోరిక తీరుతుందని,ఆ అమ్మ దయవలనే మా గ్రామం అంతా పిల్లాపాపలతో, సుఖసంతోషాలతో ఉన్నామని ఆలయం ముందే ఉన్న ఇంట్లో పూజాసామగ్రి అమ్మే వాళ్ళు చాలా భక్తితో చెప్తారు.అమ్మ ఆలయానికి వచ్చినవాళ్ళు తెలియని వాళ్లకి, అవసరమున్న వాళ్లకి ఈ ఆలయం గురించి చెప్తే మంచిదట.నిజమే.. నమ్మి వేడుకుంటే చాలు,కరుణించి వరమిచ్చి,అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగల అమ్మ గురించి తెలియచెప్పటం కూడా పుణ్యమే కదా..అమ్మదయ ఉంటె అన్నీ ఉన్నట్లే
తమిళనాడు ఆలయాల్లో గర్భగుడి ముందు ఇలాంటి దీపాలు తప్పకుండా వెలిగిస్తారు.
తమిళనాడులో పెద్దసమస్య ,ఏ గుడికి వెళ్లినా బోర్డులన్నీ తమిళంలోనే ఉంటాయి.ఆలయంలో దేవతల పేర్లు,పూజల వివరాలు,ఆలయ విశేషాలు,ఇలా ఎక్కడ చూసినా తమిళం తప్ప వేరే భాష కనిపించదు.కనీసం ఇంగ్లీష్ అయినా ఉంటే తెలుసుకోవచ్చు కానీ ఎక్కడో చాలా అరుదుగా ఇంగ్లీష్ బోర్డులు కనిపించాయి.
అమ్మవారి ఆలయంలో తమిళం బోర్డు.
ఇవీ తిరుకరుకవుర్ శ్రీ గర్భరక్షాంబికా అమ్మ ఆలయ విశేషాలు.శివయ్య, అమ్మవారి దర్శనం అయ్యాక కాసేపు ఆలయంలో కూర్చుని,మళ్ళీ అమ్మ దర్శనభాగ్యం కలగాలని కోరుకుంటూ బయటికి వచ్చాము.తంజావూర్ లో మొదలైన వర్షం ఇక్కడ కూడా వదల్లేదు.ఇంక చెన్నై వెళ్ళి అటునుండి గుంటూరు ప్రయాణం ప్లాన్ చేసి బయలుదేరాము.