పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

6, మార్చి 2017, సోమవారం

మా తమిళనాడు యాత్రా విశేషాలు - భూలోక వైకుంఠం శ్రీరంగం


ఘన మునీంద్రులకు  అగమ్యమైయున్న నిను  
యీ ధరమీద పలుమారు దర్శింపగలిగే 
సంతతమును  వర్ణింపగలిగే  
చాలదా మా జన్మము


జంబుకేశ్వరం నుండి శ్రీరంగనాధుని దర్శనానికి వచ్చాము.తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలోఉభయకావేరీ నదుల మధ్య(కావేరీనది,దాని ఉపనది కొల్లిదం)ద్వీపంలో శ్రీరంగక్షేత్రం ఉంటుంది.108 ప్రధాన విష్ణుదేవాలయాల్లో(దివ్యదేశాలు) మొట్టమొదటి,అత్యంత ప్రధానమైన,భూలోక వైకుంఠంగా, భోగమండపంగా ప్రసిద్ధిచెందిన శ్రీరంగంలో రంగనాయకి అమ్మవారితో శ్రీరంగనాథస్వామి కొలువై ఉన్నారు.అతి పురాతనమైన, పూజలందుకుంటున్నవైష్ణవ దేవాలయాల్లో ఇది ఒకటి. దాదాపు 156 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు కిలోమీటర్లు పొడవైన ప్రాకారంతో ప్రపంచంలోనే పెద్ద దేవాలయం.ఆలయంలోకి ప్రవేశించే ప్రధాన రాజగోపురం (రాయల్‌ టెంపుల్‌ టవర్‌)236 అడుగుల ఎత్తు ఉంటుంది.తమిళనాడులో ఏ ఆలయాలు చూసినా ఇంతింత ఎత్తైనగోపురాలు ఎలా నిర్మించారో,ఎంతమందితో ఈ అద్భుతాలు సాధ్యమయ్యాయో కదా  అనిపిస్తుంది.శ్రీరంగం రాజగోపురం మరీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద రాజ గోపురం అని చెప్తారు.

రాజగోపురం 

స్థలపురాణం 
బ్రహ్మదేవుడు తాను పూజించే శ్రీ రంగనాధస్వామి విగ్రహాన్ని సూర్యవంశ ఇక్ష్వాకు మహారాజుకు ఇచ్చాడు.ఇక్ష్వాకు మహారాజు తర్వాత శ్రీరాముని దాకా తరతరాలుగా స్వామిని పూజిస్తూ ఉండేవారు.రావణసంహారం తర్వాత శ్రీరామ పట్టాభిషేకానికి లంక నుండి వచ్చిన విభీషణుణునికి రాముడు రంగనాథస్వామి విగ్రహాన్ని ఇస్తూ దారిలో ఎక్కడా కింద పెట్టొద్దని చెప్పాడట.అలాగే విభీషణుడు విగ్రహాన్ని తన చేతులలోనే ఉంచుకుని లంకకి బయల్దేరాడు.శ్రీరంగం దగ్గరికి రాగానే విగ్రహం విభీషనుడు మోయలేనంత బరువు పెరిగిపోయిందట.బరువు మోయలేక విభీషణుడు విగ్రహాన్ని నీలమీదకి దించగానే అక్కడే శ్రీరంగనాథుడు ప్రతిష్టితమయ్యాడు.విషయం తెలిసిన ఆ ప్రాంత పాలకుడు ధర్మచోళుడు విభీషణుని ఓదార్చి స్వామివారు ఇక్కడే ఉండటానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఇక్కడే ఆలయాన్ని నిర్మిద్దామని ఆలయాన్ని నిర్మించాడని స్థలపురాణం.

రంగ రంగ రంగపతి రంగనాధా .. నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాధా.. 
 

ఇప్పటిదాకా మేము వెళ్లిన ఆలయాల్లో జనం చాలా తక్కువ ఉన్నారు ఇక్కడ మాత్రం పెద్ద క్యూలు ఉన్నాయి. మామూలు రోజుల్లోనే జనాలు ఇంత క్యూలల్లో ఉన్నారంటే ఇక ఉత్సవాలప్పుడు పరిస్థితి ఏంటో అనిపించింది.50 రూపాయల క్యూ, 250 రూపాయల శీఘ్రదర్శనం క్యూ ఉన్నాయి.దేవాలయ గర్భాలయంలో విష్ణుమూర్తి ఆదిశేషుడిపై ఒక పక్కకి తిరిగి శయనించిన భంగిమలో,అమ్మవార్లతో కలిసి  దర్శనమిస్తుంటాడు.ఆదిశేషునిపై శయనించిన్నట్టుగా ఉండే రంగనాథస్వామిని చూడటానికి నిజంగానే రెండు కళ్లు సరిపోవు.సాక్షాత్తు పాలకడలిపై శేషతల్పమున పవళించిన విష్ణుమూర్తి కూడా ఇలాగే ఉంటాడేమో అనిపిస్తుంది.తల అటు,ఇటు తిప్పకుండా ఎదురుగా మాత్రమే చూస్తే స్వామిని మొత్తం చూడలేము.ఎంతసేపు చూసినా స్వామిని సరిగ్గా చూడలేదే అనిపించేలా ఉంది శ్రీరంగనాథుని దివ్యరూపం.

కొలువైతివా... రంగశాయి 
కొలువైన నిను చూడ కలవా కన్నులు వేయి. 

రంగనాథస్వామి కొలువై ఉన్న గర్భగుడి గోపురం విమానం ఆకృతిలో 
పూర్తిగా బంగారు తాపడం తో విభిన్నంగా ఉంటుంది. 

స్వామిని దర్శించుకున్నాక రంగనాయకి అమ్మ (లక్ష్మీదేవి) దర్శనానికి వెళ్ళాము.అమ్మని కనులారా చూడాల్సిందే కానీ,వర్ణించనలవికాదేమో అనిపిస్తుంది.అపూర్వమైన అలంకరణలో అమ్మవారు మెరిసిపోతూ దర్శనమిస్తుంది. "చక్కని తల్లికి చాంగుభళా తన చక్కరమోవికి చాంగుభళా", "క్షీరాబ్ధి కన్యకకు శ్రీమహాలక్ష్మీకిని" అంటూ అమ్మని దర్శించిన ఆనందంలోనే అన్నమయ్య అంత మంచి కీర్తనలు రచించాడేమో అనిపిస్తుంది.ఇక్కడ అమ్మవారికి అలంకరించినన్ని రకాలపూలు ఇంతకుముందు ఎక్కడా చూడలేదేమో అనిపించేంత అందంగా, ఆహ్లాదకరంగా ఉన్నాయి.

క్షీరాబ్ధి కన్యకకు శ్రీమహాలక్ష్మికిని 
నీరజాలయమునకు నీరాజనం

అమ్మవారి ఆలయ మండపంలో అందమైన పూలు 

ఈ ఆలయం మొత్తం ఏడు ప్రాకారాలు, 21 గోపురాలు,24 మండపాలు ఉన్నాయి.అన్ని మండపాల్లో స్వామివారి విశేష సేవలు  జరుగుతాయి.4 ప్రాకారాలు దాటాక చెప్పులు వేసుకోకూడదు ప్రతి ప్రాకారంలో దేవతల విగ్రహాలు ఉంటాయి.శ్రీరంగనాథుని ఆలయ పరిధిలోనే మరికొన్ని సన్నిధానాలు, ఉపసన్నిధానాలున్నాయి (ఉపాలయాలు). అందులో తాయార్‌ సన్నిధి, చక్రథజవార్‌ సన్నిధి,రామానుజార్‌ సన్నిధి, గరుడాల్వార్‌ సన్నిధి, ధన్వంతరి సన్నిధి, హయగ్రీవర్‌ సన్నిధి ఉన్నాయి.మూడవ ప్రాకారమునకు "ఆలినాడన్ తిరువీథి" అనిపేరు.ఈ వీధిలో గరుత్మంతుని సన్నిధిలో 25 అడుగుల ఎత్తైన గరుడాళ్వార్ విగ్రహం ఉంది.ఇంతకు ఎక్కడా చూడనటువంటి ఎత్తయిన గరుడాళ్వార్ ఇక్కడి ప్రత్యేకత.
ప్రాకారాల మీద శిల్పకళ 

ఆలయంలోపల 

ధనుర్మాసము,ధనుశ్శుద్ధ ఏకాదశి నాటి వైకుంఠద్వార దర్శనం కోసం 
వైకుంఠద్వారం కూడా చాలా ప్రత్యేకంగా అందమైన దేవతలశిల్పాల మధ్య ఉంటుంది.
వైకుంఠ ద్వారం 

స్వామివారికి బ్రహ్మోత్సవాలు,మాసోత్సవాలతో పాటు ధనుర్మాసం,వైకుంఠఏకాదశి,ఉగాది,విజయదశమి పర్వదినాల్లోనే కాకుండా ప్రతినిత్యం ఉత్సవమే అన్నట్లు ఎప్పుడూ విశేష పూజలు,సేవలు జరుగుతాయట.ఇక్కడ పోస్ట్ చేసిన ఫోటో స్వామివారికి జరిగే వాహనసేవలు.

నారాయణ నారాయణ  జయ గోపాల హరే గోపాల హరే  
కరుణాపారావార వరుణాలయ గంభీర నారాయణా 
నవ నీరద సంకాశ కృత కలి కల్మష నాశ నారాయణా
స్వామివారికి జరిగే ఉత్సవాలు 

"రంగ రంగ గోపురం" ఆలయం లోపలికి వెళ్ళే  ప్రధాన ద్వారం 

(Vellai) వెల్లై గోపురం - తెల్లని గోపురం - తూర్పు గోపురం 


మండపాల్లో శిల్పకళ

యుద్ధసన్నివేశం- కత్తి మనిషి శరీరంలో దిగినట్లు స్పష్టంగా తెలుస్తున్న శిల్పం. 

కృష్ణలీలలు 

శ్రీరంగం నుండి మా ఇంటికి వచ్చిన శ్రీరంగనాథుడు 

నిజంగా శ్రీరంగం భూలోక  వైకుంఠమే.శ్రీరంగం ఆలయం మొత్తం తిరిగి చూడాలంటే చాలా సమయమే కాదు,ఓపిక కూడా ఉండాలి.మేము మే నెలలో వెళ్లటంతో ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది.ఫ్రూట్స్,ఫ్రూట్ జ్యూస్ స్టాల్స్,కూల్ డ్రింక్స్,హోటల్స్ అన్నీ ఆలయప్రాకారాల్లో కలిసిపోయిన షాప్స్ లోనే అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇబ్బంది అనిపించదు. ఎక్కడా లేని విధంగా శ్రీరంగం ఆలయప్రాకారాల మధ్యలోనే 4 ప్రాకారం దాకా  అన్నిరకాల షాప్స్ ఉంటాయి.స్వామి దర్శనం అయ్యాక బయటికి వచ్చి,అక్కడే హోటల్లో టిఫిన్ తినేసి,శ్రీరంగనాథుని దర్శనం మళ్ళీ కలగాలని కోరుకుంటూ తంజావూర్ బయల్దేరాము.

జగన్మోహనాకారా చతురుడవు పురుషోత్తముడవు  
ఎన్ని మారులు సేవించినా  కన్నులూ తనియవు  
విన్న నీ కథామృతమున  వీనులూ తనియవు


2 కామెంట్‌లు:

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

చాలా విపులంగా సుందరమైన చిత్రాలతో చక్కగా వర్ణించారు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

పోస్ట్ నచ్చినందుకు,మీ వ్యాఖ్యకు Thank you so much
"oddula ravisekhar" గారు..

Related Posts Plugin for WordPress, Blogger...