పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

25, ఏప్రిల్ 2017, మంగళవారం

మా తమిళనాడు యాత్రా విశేషాలు - చెన్నై బీచ్


వర్షంలో ప్రయాణం చాలా బాగుంది :)

మేము చెన్నైకి వచ్చేటప్పటికే బాగా చీకటి పడిపోయింది.బీచ్ కి వెళ్ళాము.గాంధీ బీచ్,మెరీనా బీచ్ రెండు పక్కనే ఉన్నాయి.చీకట్లో సముద్రం చాలా భయంగా అనిపించింది.ఎక్కడా ఖాళీ లేకుండా పిల్లలు,పెద్దలు బీచ్ అంతా సందడి చేస్తున్నారు.కార్ పార్కింగ్ కి కూడా ప్లేస్ దొరకటం కష్టమయ్యేంత జనం ఉన్నారు.చీకటి పడేసరికి చుట్టుపక్కల ఏమీ చూడటం కుదరలేదు.బీచ్ లో మాత్రం రకరకాల street food స్టాల్స్ ఉన్నాయి.ఇక్కడ మాకు నచ్చినవి బజ్జీ స్టాల్స్.

cyclist 
మెరీనా బీచ్
 
బీచ్ లో జనాలు

బజ్జీలు వేసే వాళ్ళు స్టాల్స్ ని మిరపకాయ దండలతో డెకరేట్ చేసి చుట్టూ  ప్లాస్టిక్ స్టూల్స్  వేసి ఉంచుతారు.అక్కడే కూర్చుని అప్పటికప్పుడు చేసిచ్చే బజ్జీలు తింటుంటారు.  

బజ్జీ స్టాల్ 

బజ్జీలు తింటున్న జనాలు 

మిరపకాయ,బంగాళాదుంప,అరటికాయ,ఉల్లిపాయ,వంకాయ,కాప్సికమ్ నాన్ వెజ్ ఇలా కాదేదీ బజ్జీ కనర్హం అన్నట్లు బజ్జీలు వేస్తున్నారు.వీటిని Bajji Platter అంటారు. తమిళనాడులో  పండగలకి ముఖ్యంగా  దీపావళి పండగకి తప్పకుండా చేసుకుంటారట.

మేము బజ్జీలు తిన్న స్టాల్. 
చాలా బాగా బజ్జీలు చేసిన అమ్మాయితో మా అమ్మ. 

చెన్నై బీచ్ బజ్జీ /  Bajji Platter

తమిళనాడులో మొక్కజొన్న కండెల్ని కూడా 
ఇలా దీపావళి టపాసుల రేంజ్ లో కాల్చుతున్నారు :)

Spicy Chat 

ఛాట్ -- బాగానే ఉంది. 

పిల్లల షాపింగ్ 

గుంటూరు వచ్చే దారిలో ప్రకాశం జిల్లా ఉలవపాడు మామిడికాయలు చాలా బాగుంటాయి.ఈకాయలు తిన్న తర్వాత  మార్కెట్లో కాయలు తినాలనిపించదు.రోడ్డుకి రెండువైపులా మామిడికాయలు కుప్పలుగా పోసి ,ఎంత రాత్రయినా మేలుకుని ఉండి  అమ్ముతుంటారు.మేము ఇక్కడికి వచ్చేసరికి అర్ధరాత్రి దాటింది.మేము చెన్నైలో బయల్దేరేముందే చెప్పటంతో మా డ్రైవర్ గుర్తుంచుకుని మరీ కారు ఆపాడు.

ప్రకాశం జిల్లా ఉలవపాడు మామిడికాయలు. 

ఇవీ మా తమిళనాడు యాత్రా విశేషాలు.9th may - 15th may 2016 వరకు తమిళనాడులో చాలావరకు మేము చూడాలనుకున్న ఆలయాలన్నీ చూసేశాము.మే నెల ఎండలు కూడా ఇబ్బంది అనిపించలేదు.కుంభకోణం చూడాలనుకున్నాము కానీ టైమ్ సరిపోలేదు.పైగా వర్షాలు అసలే చెన్నై వర్షాలని నమ్మలేము కూడా,సరే ఇప్పటికి ఇంతవరకు చూశాము కదా చాల్లే అనుకున్నాము.సంవత్సరం కావస్తున్నా ఇప్పటికీ ఆ ఫోటోలు చూసుకున్నా,అప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చినా చాలా సంతోషంగా అనిపించేలా మా యాత్ర జరగటం భగవంతుడి దయ.మా అందరికీ ఎంతో ఇష్టమైన ఈ విశేషాలన్నీ గుర్తుండటానికి ఇలా నా బ్లాగ్ లో దాచుకుంటున్నాను.



22, ఏప్రిల్ 2017, శనివారం

మా తమిళనాడు యాత్రా విశేషాలు - మేల్ మరువత్తూర్ ఆదిపరాశక్తి


ఆది పరాశక్తి సిద్ధార్ పీఠం 

చెన్నె వెళ్ళే దారిలో మేల్ మరువత్తూర్ ఆదిపరాశక్తి దర్శనానికి వెళ్ళాము.తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో చెన్నై నుండి 92 km దూరంలో ఉన్న ఈ దేవాలయాన్ని ఆదిపరాశక్తి సిద్ధార్ పీఠం(Adhiparasakthi Siddhar Peetam) అంటారు.బంగారు అడిగళారు(Bangaru Adigalar) అనే గురువును ఇక్కడ అమ్మవారి రూపంగా భావించి పూజిస్తారు.అమ్మశక్తి ఆయన ద్వారా భక్తులతో మాట్లాడుతుందని,కోరికలు తీరుస్తుందని ఇక్కడ నమ్మకం.ఈ ఆలయం చాలా పెద్దది.విశాలమైన ఆవరణలో ఉంది.ఆలయమంతా గురూజీ,అమ్మవారి పెద్ద పెద్ద కటౌట్లు ఉంటాయి.ఇక్కడ ఫోటోలు అస్సలు తియ్యనివ్వరు.మగవాళ్ళు సాంప్రదాయ దుస్తుల్లో లేకపోతే  లోపలికి వెళ్లనివ్వరు.ఈ పోస్ట్ లో పెట్టిన ఫొటోలన్నీ టెంపుల్ website లోవి.

నవరాత్రి ఉత్సవాలు 

స్థలపురాణం
1960 కాలంలో ఇప్పుడు గర్భగుడి ఉన్న ప్రదేశంలో వేపచెట్టు ఉండేది.ఆ వేపచెట్టుకు స్వభావ విరుద్ధంగా తియ్యటి పాలు వచ్చేవి.స్థానికులు వింతగా ఆ పాలను రుచి చూసేవారు.తర్వాత కాలంలో ఆచెట్టు పాలను స్వీకరించిన వారికి అనారోగ్యాలు తొలగిపోవటం గమనించి,అది మహిమ కలిగిన చెట్టుగా గుర్తించి దానిని కాపాడేవాళ్లు.1966లో వచ్చిన వరదలకు చెట్టు కూలిపోయి, చెట్టుకింద భూమిలో స్వయంభువుగా వెలసిన శిల కనిపించగా దేవతగా భావించి చిన్న ఆలయం కట్టి పూజలు చేసేవాళ్ళు.November 25,1977లో ఇప్పుడున్న అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు.గర్భగుడిలో సహస్రదళపద్మం మీద కూర్చున్న అమ్మవారి విగ్రహం కనులపండుగగా అనిపిస్తుంది.అందమైన అలంకరణలో కుడిచేతిలో కలువమొగ్గతో,ఎడమ చేయి అభయముద్రతో  ఉన్న అమ్మకి   గర్భగుడిలో ఆడవాళ్ళే పూజలు చేస్తున్నారు.

గర్భగుడిలో భక్తులు 

అమ్మవారు కొలువున్న గర్భగుడిలోకి వెళ్లేముందు,మండపంలో పెద్ద త్రిశూలం అలంకరించి ఉంటుంది.ఆ ప్రదేశాన్ని ఓంశక్తి స్టేజ్ అంటారు.ఆ త్రిశూలంచుట్టూ ప్రదక్షిణ చేసి,గర్భగుడిలోకి వెళ్ళాలి.

ఆలయ మండపంలో  త్రిశూలం

ఆలయంలో ఎక్కడ చూసినా భక్తులు ఎర్రటి వస్త్రధారణలో ఉంటారు.ఇక్కడ కనకదుర్గమ్మ భక్తులలాగానే అక్కడ కూడా అమ్మ దీక్ష తీసుకుంటారు. అమ్మదీక్షలో ఉన్న భక్తులు ఆలయం ముందున్న విశాలమైన మండపంలోనే ఉండటానికి,అన్నదానంతో  పాటు, ఆలయ పరిసరాల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి.శక్తి పీఠం ఆధ్వర్యంలో ఉచిత విద్య,వైద్యం ఇంకా చాలారకాల ఛారిటబుల్ ట్రస్టులున్నాయట.అమ్మవారి శక్తి పీఠాలు వేర్వేరు ప్రదేశాల్లో, మనదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఉన్నాయి.అన్నిచోట్లా యజ్ఞాలు,పూజలు జరుగుతాయి. బంగారు అడిగళారు స్వామీజీ(అమ్మ) పుట్టినరోజును పెద్ద వేడుకగా చేస్తారు.


ఆలయంలో భక్తులు 

చైత్రపౌర్ణమికి అమ్మవారి సన్నిధిలో భారీ స్థాయిలో యజ్ఞ,యాగాలు జరుగుతాయి.రకరకాల ఆకారాల్లో నిర్మించిన హోమగుండాల్లో భక్తులు హోమాలు చేస్తారు.కులమత వర్గ విబేధాలు లేకుండా అందరికీ ఈ ఆలయంలో ప్రవేశం ఉంటుంది.అందరూ పూజలు చేసుకోవచ్చు.తెల్లవారుఝాము 3గంటలకు అమ్మవారి అభిషేకంతో గర్భగుడిని తెరుస్తారు.ఆలయ దర్శన వేళలు  3:00 am to 1:00 pm and 3:00 pm to 8:00 pm.పండగరోజుల్లో దర్శనానికి ఎలాంటి విరామం ఉండదు. 

అందంగా అలంకరించిన హోమగుండం 

మా చిన్నప్పుడు జెమినీ టీవీలో మేల్ మరువత్తూర్ అమ్మ గురించి ప్రతిరోజూ ఉదయం ప్రోగ్రామ్స్ వస్తూ ఉండేవి.మా అమ్మ అప్పటినుండి అమ్మవారిని చూడాలి అనుకునేది.ఇప్పటికి ఆ కోరిక తీరింది.అమ్మవారి  సాయంకాల దర్శనం ప్రశాంతంగా జరిగింది.పన్నీరు కలిపిన చందనం,కుంకుమ ప్రసాదంగా ఇస్తారు.ఇక్కడ ఎక్కువసేపు ఉండలేదు, దర్శనం  చేసుకుని వెంటనే చెన్నై బయలుదేరాము.

అమ్మవారి ఆలయప్రవేశ ద్వారం 
చిత్రంలో వ్యాసకర్త - మా తమ్ముడి మాట :)


20, ఏప్రిల్ 2017, గురువారం

మా తమిళనాడు యాత్రా విశేషాలు - శ్రీ గర్భరక్షాంబికా అమ్మ,తిరుకరుకవుర్


ఓం శ్రీ మాత్రే నమః
అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ, దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ, కృపాబ్ధి ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.

శ్రీ గర్భరక్షాంబికా అమ్మ - Garbha-Raksha-Ambigai ( savior of fetus)


తంజావూర్ బృహదీశ్వరాలయం నుండి అక్కడికి చాలా దగ్గర్లో 40 min (23.4 km) ఉన్న గర్భరక్షాంబికా అమ్మవారి దేవాలయానికి వెళ్ళాము.తమిళనాడు టూర్ అనుకున్నప్పుడు మేము చూడాల్సిన కొన్ని ప్రదేశాలు ముందుగానే అనుకున్నాము కానీ గర్భరక్షాంబికా ఆలయం గురించి  తెలియకపోయినా అమ్మ దర్శనభాగ్యం అనుకోకుండా కలిగింది.మేము చెన్నై వెళ్ళటానికి సరిగ్గా వారం ముందు ఈనాడు Sunday Magazine లో అమ్మవారి గురించి,ఆ క్షేత్ర మహిమ గురించి అక్కడికి వెళ్లిన వాళ్ళు రాశారు.అది చదివాక గర్భరక్షాంబికా అమ్మని ఖచ్చితంగా చూడాలి అనుకున్నాము.పిల్లలు లేని వారికి సంతానభాగ్యాన్ని కలిగించటం,సంతాన రక్షచేయటం ఇక్కడ అమ్మవారి విశిష్టత.ఇక్కడ అమ్మవారు  శ్రీ గర్భరక్షాంబికాదేవి గా,శివయ్య ముల్లైవన నాథర్ గా కొలువయ్యారు. 

శ్రీ గర్భరక్షాంబికా సమేత శ్రీ ముల్లైవన నాథర్ ఆలయం - తిరుకరుకవుర్ 
Shri Garbharakshambika Sameta Shri Mullaivana Nathar temple


గర్భరక్షాంబికా ఆలయం తమిళనాడులోని  తంజావూర్ జిల్లా  పాపనాశం తాలూకా  తిరుకరుకవుర్ గ్రామంలో ఉంది.కావేరీనది ఉపనది అయిన వెట్టార్‌ నది ఒడ్డున,కుంభకోణం,తంజావూర్ మధ్య ఉన్న ఈ గ్రామంలోని గర్భరక్షాంబికా అమ్మవారి ఆలయం వేయి సంవత్సరాల పురాతనమైంది. రాజరాజ చోళ - 985 and 1014 AD పేరు మీద తొమ్మిదవ శతాబ్దంలో వేయించిన శిలాఫలకాలు ఇక్కడ కనిపిస్తాయి.ప్రశాంతమైన వాతావరణంలో,ఐదు అంతస్థుల రాజగోపురంతో ఉన్న ప్రవేశ ద్వారం నుండి లోపలి వెళ్తాము.క్షేత్రం యొక్క మహిమను అప్పార్, సుందరార్ మరియు సంబంధార్ అనే ముగ్గురు నాయనార్లు తమ పద్యములలో కీర్తించారు.

దేవాలయ ప్రధాన గోపురం 
ఆలయ ప్రవేశ ద్వారం 
ఆలయ ప్రధాన మండపం 


ఆలయం దగ్గరికి వెళ్ళగానే ముందుగా పెద్ద కోనేరు కనిపిస్తుంది.ఈ కోనేరును పాలకుండం KsheeraKundam (Milk Pond) అంటారు.అమ్మవారి భక్తులైన నిధ్రువర్,వేదికైల బిడ్డ నైధ్రువన్ కోసం కామధేనువు ఇచ్చిన పాలతో ఈ కోనేరు  ఏర్పడిందని స్థలపురాణం.

Ksheera Kundam (Milk Pond) 
కోనేరులో అమ్మవారు 

స్థలపురాణం
శివభక్తుడైన నిధ్రువర్ మహర్షి ఆయన భార్య వేదికైలు సంతానం కోసం శివపార్వతులను ప్రార్ధించగా అమ్మ కరుణించి వేదికై గర్భందాల్చుతుంది.ఆమె మూడవ త్రైమాసికంలో ఉన్నప్పుడు,నిధ్రువర్ మహర్షి  ఆశ్రమంలో లేని సమయంలో ఊర్ధ్వపాదుడు అనే మహర్షి ఆశ్రమానికి వస్తారు.అప్పటికే ఇంటిపనులలో అలసిపోయిన వేదికై విశ్రాంతి తీసుకుంటూ మహర్షిని గమనించక అతిథిమర్యాదలు చేయలేకపోతుంది.దాంతో ఆగ్రహించిన  ఊర్ధ్వపాదుడు,వేదికై గర్భంధరించి ఉందని తెలియక ఆమెను శపిస్తారు.ఆ శాపఫలితంగా ఆమె వింతవ్యాధితో బాధపడుతూ,గర్భంలో ఉన్న శిశువుకు ప్రమాదకర పరిస్థితి వస్తుంది.వెంటనే ఆమె ఎంతో వేదనతో పార్వతీమాతను ప్రార్ధించగా అమ్మవారు వెంటనే ప్రత్యక్షమయ్యి ఆ గర్భస్థ పిండమును ఒక కుంభంలో(పాత్ర) ఉంచి రక్షించి, పిల్లవాడ్ని చేసి మునిదంపతులకు అందిస్తుంది.ఆ బిడ్డకి  నైధ్రువన్ అని పేరు పెడతారు.పుట్టిన ఈ శిశువుకి కామధేనువు తన పాలిచ్చి ఆకలి తీరుస్తుంది. నిధ్రువర్ మహర్షి అమ్మ దయకు ఎంతో సంతోషించి శివపార్వతులు అక్కడే ఉండి అమ్మని వేడుకున్న భక్తులను ఎప్పటికీ కాపాడి, కరుణించాలని ప్రార్ధించగా,మహర్షి కోరిక ప్రకారం అమ్మవారు ఇక్కడ గర్భారక్షాంబికగా,శివయ్య ముల్లైవననాథర్ గా కొలువయ్యారు.

స్థలపురాణం ఆలయంలోని గోడలపైన చిత్రాలతో ఉంటుంది 

సంతానం కోసం శివపార్వతులని పూజిస్తున్న మహర్షి దంపతులు 

గర్భందాల్చిన వేదికైని  ఊర్ధ్వపాదుడు శపించుట 

మునిశాపం కారణంగా ఆపదలో ఉన్న గర్భస్థ పిండాన్ని 
కుండలో పెట్టి కాపాడుతున్న  పార్వతీమాత 

కాపాడిన బిడ్డకి  నైధ్రువన్ అని పేరు పెట్టి 
దంపతులకు అందించిన శివ పార్వతులు 

నైధ్రువన్ కు పాలిచ్చిన కామధేనువు 

అమ్మలకే అమ్మ, జగమంతా నిండిపోయిన శక్తి స్వరూపం ఆదిపరాశక్తి  పార్వతీమాత ఇక్కడ మాతృత్వాన్ని కాపాడే అమ్మగా,గర్భరక్షాంబికాదేవిగా కొలువై ఉంది.సకల జీవరాశిని తన బిడ్డలుగా కాపాడే అమ్మని సంతానం కోసం,వాళ్ళ క్షేమం కోసం వేడుకుంటే చాలు కోరుకున్న కోరిక తీర్చి,గర్భం ధరించి,సుఖప్రసవం అయ్యేదాకా వెన్నంటి కాపాడుతుందని భక్తుల విశ్వాసం.గర్భాలయంలో అమ్మవారి నిలువెత్తు విగ్రహం అందమైన కంచిపట్టు చీరలు, నగలు,పువ్వుల అలంకరణలో నవ్వుతూ  మనవైపు చూస్తున్నట్లే అనిపిస్తుంది.అమ్మవారిని  గర్భగుడికి చాలా దగ్గర నుండి దర్శించుకోవచ్చు.ఇక్కడ సంతానం కోసం మాత్రమే కాదు,పెళ్ళికాని ఆడపిల్లలు కూడా అమ్మని మొక్కుకుంటే త్వరగా పెళ్ళి జరుగుతుందని నమ్మకం.
అమ్మ ప్రసాదించే వరాలు 

గర్భధారణ కోసం,సుఖ ప్రసవం కోసం ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు.పిల్లల కోసం వచ్చిన దంపతులకు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి,నెయ్యి,కుంకుమ ప్రసాదంగా ఇస్తారు.గర్భవతుల సుఖప్రసవం కోసం పూజ చేసి ఆముదం ప్రసాదంగా ఇస్తారు.అమ్మ దయవలన సంతానం కలిగిన దంపతులు పుట్టిన పిల్లలతో ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆలయంలో ఉన్న బంగారు ఉయ్యాలలో బిడ్డని ఉంచి,ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. తులాభారంతో మొక్కులు తీర్చుకుంటారు.
ఆలయం లోపలి ప్రాంగణం 

ఇక్కడ శివయ్య  ముల్లైవన నాథర్ గా కొలువై ఉన్నారు.ముల్లైవన నాథర్ అంటే మల్లెల వనంలో కొలువైన శివుడు. తెలుగులో మల్లికార్జున స్వామి అని అర్ధమట.ఇప్పుడు ఆలయం ఉన్న ప్రాంతం ఒకప్పుడు మల్లెలవనం కాగా,ఆ మల్లెలవనంలో స్వయంభువుగా మల్లెతీగలతో కప్పబడిన శివలింగం కనిపించిందట.అందుకే  శివలింగంమీద ఇప్పటికీ మల్లెతీగ గుర్తు ఉంటుంది.పుట్టమన్నుతో ఏర్పడిన స్వయంభూలింగం కావడం వలన ఇక్కడి శివుణ్ణి నీటితో అభిషేకించరు.పునుగు,సుగంధ తైలాలతో మాత్రమే అభిషేకాలు చేస్తారు.దీనినే Punugu sattam pooja అంటారు.ఇక్కడ స్వామిని పూజిస్తే చర్మవ్యాధులు,దీర్ఘకాలం నుండి తగ్గని  వ్యాధులు కూడా నివారించబడతాయని నమ్మకం. ప్రతి సంవత్సరం తమిళ ఫాల్గుణ మాసంలో(March-April)పౌర్ణమినాడు చంద్ర కిరణాలు శివలింగము మీద పడటం ఇక్కడ మహిమ.ఆలయంలో స్వయంభూ వినాయకుడు,నందీశ్వరుడు,సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉన్నారు.వైశాఖమాస ఉత్సవాలు,నవరాత్రి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి.కనకదుర్గమ్మ ఆలయంలో లాగా ఇక్కడ తెప్పోత్సవం కూడా జరుగుతుంది.ఆలయ వేళలు ఉదయం 5.30am to 12.30pm సాయంత్రం 4.00pm to 8.00pm.


అమ్మని దర్శించుకున్నవాళ్ళకి ఎంతమందికో సంతాన భాగ్యం కలిగిందని,మన దేశంలోనే కాదు విదేశాల నుండి కూడా ఇక్కడికి భక్తులు వస్తారని,మొక్కుకుంటే ఖచ్చితంగా కోరిక తీరుతుందని,ఆ అమ్మ దయవలనే మా గ్రామం అంతా పిల్లాపాపలతో, సుఖసంతోషాలతో ఉన్నామని ఆలయం ముందే ఉన్న ఇంట్లో పూజాసామగ్రి అమ్మే వాళ్ళు చాలా భక్తితో చెప్తారు.అమ్మ ఆలయానికి  వచ్చినవాళ్ళు తెలియని వాళ్లకి, అవసరమున్న వాళ్లకి ఈ ఆలయం గురించి చెప్తే మంచిదట.నిజమే.. నమ్మి వేడుకుంటే చాలు,కరుణించి  వరమిచ్చి,అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగల అమ్మ గురించి తెలియచెప్పటం కూడా పుణ్యమే కదా..అమ్మదయ ఉంటె అన్నీ ఉన్నట్లే

తమిళనాడు ఆలయాల్లో గర్భగుడి ముందు ఇలాంటి దీపాలు తప్పకుండా వెలిగిస్తారు. 

తమిళనాడులో పెద్దసమస్య ,ఏ గుడికి వెళ్లినా బోర్డులన్నీ తమిళంలోనే ఉంటాయి.ఆలయంలో దేవతల పేర్లు,పూజల వివరాలు,ఆలయ  విశేషాలు,ఇలా ఎక్కడ చూసినా తమిళం తప్ప వేరే భాష కనిపించదు.కనీసం ఇంగ్లీష్  అయినా ఉంటే తెలుసుకోవచ్చు కానీ ఎక్కడో చాలా అరుదుగా ఇంగ్లీష్ బోర్డులు కనిపించాయి. 

అమ్మవారి ఆలయంలో తమిళం బోర్డు. 

ఇవీ తిరుకరుకవుర్ శ్రీ గర్భరక్షాంబికా అమ్మ ఆలయ విశేషాలు.శివయ్య, అమ్మవారి దర్శనం అయ్యాక కాసేపు ఆలయంలో కూర్చుని,మళ్ళీ అమ్మ దర్శనభాగ్యం కలగాలని కోరుకుంటూ బయటికి వచ్చాము.తంజావూర్ లో మొదలైన వర్షం ఇక్కడ కూడా వదల్లేదు.ఇంక చెన్నై వెళ్ళి అటునుండి గుంటూరు ప్రయాణం ప్లాన్ చేసి బయలుదేరాము.


5, ఏప్రిల్ 2017, బుధవారం

శ్రీరామనవమి శుభాకాంక్షలు


 రామచంద్రుడితడు రఘువీరుడు 


1, ఏప్రిల్ 2017, శనివారం

మా తమిళనాడు యాత్రా విశేషాలు - బృహదీశ్వరాలయం - తంజావూరు

శ్రీరంగం నుండి రాత్రికి తంజావూర్ వచ్చి అక్కడే స్టే చేసి,తెల్లవారుఝామునే ఆలయానికి బయలుదేరాము. అప్పటిదాకా విపరీతమైన మే నెల ఎండలలో మాడిపోయిన మాకు ఆరోజు చిరుజల్లులతో చల్లటి వాతావరణం చాలా సంతోషంగా అనిపించింది.వర్షం మరీ పెద్దది కాదు కాబట్టి వర్షంలోనే ఆలయానికి వెళ్ళాము. 2010కి 1000 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బృహదీశ్వరాలయం ఎన్నో అద్భుతాలకు,విశేషాలకు నిలయం. పేరుకి తగినట్లు పెద్ద కోటగోడలలాంటి ప్రాకారాలు,విశాలమైన పెద్ద ఆవరణ,పెద్ద నంది,అత్యంత పెద్దదైన ఆలయ శిఖరం ఎంతచూసినా ఆశ్చర్యంగా అనిపించేంత  పెద్ద శివయ్య, ఎటు చూసినా  అందమైన శిల్పకళ అంతా అద్భుతం.

ఆలయ ప్రధాన ప్రవేశద్వారం 


రెండవ ప్రాకారం 

చెన్నైకి 314 కి.మీ,తిరుచురాపల్లికి 56 కి.మీ  దూరంలో తంజావూరు జిల్లా,తంజావూర్ పట్టణంలో భారతదేశంలో అతిపెద్ద ఆలయంగా ప్రసిద్ధి చెందిన తంజావూరు బృహదీశ్వరాలయం ఉంది.దీనిని బిగ్ టెంపుల్, పెరియకోవిల్, పెరుఉదయార్ కోవిల్,రాజరాజేశ్వరం అని కూడా అంటారు.ఈ ఆలయంలోని శివుడు శ్రీరాజరాజేశ్వరుడు, అమ్మవారు శ్రీ బృహన్నాయకీ దేవిగా కొలువయ్యారు.అతిపురాతనమైన ఈ ఆలయాన్ని మహాశివభక్తుడైన చోళరాజు రాజరాజచోళుడు 10 వ శతాబ్దం,1003-1010 A.D లో నిర్మించాడు.1987 లో Great Living Chola Temple గా యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ఆలయం గుర్తింపు పొందింది. ఆలయ లోపలి ప్రాంగణం  500 అడుగుల పొడవు,250 అడుగుల వెడల్పుతో,బయటి ప్రాకారాలు మొత్తంతో కలిపి 793 అడుగుల పొడవు,393 అడుగుల వెడల్పుతో ఉంటుంది.

ఆలయం లోపలి  ప్రాంగణం 


216 అడుగుల ఎత్తుతో  పదమూడు అంతస్తులున్న ఈ ఆలయ శిఖరం/విమానగోపురం మీద 80 టన్నుల బరువున్న గ్రానైట్  (కుంభం) శిఖరాగ్రాన్ని నిర్మించారు.ఇంత బరువున్న ఈనిర్మాణాన్ని పైకి చేర్చటానికి ఈ ఆలయం నుండి  నాలుగు మైళ్ళ దూరం నుండి ఏటవాలుగా ఒక రాతివంతెన కట్టి దాని పైనుండి ఏనుగులతో రాతిని ఈ శిఖరంపైకి చేర్చారని తెలుస్తుంది.ఈ ఆలయ నిర్మాణం గురించి అన్నీ ఊహలే నిజంగా ఈ ఆలయ నిర్మాణం ఎలా జరిగింది అనేది  ఇప్పటికీ మిస్టరీ అనే చెప్తారు. ఆలయ ప్రధాన విమాన గోపురం మీద తమిళనాడు రాష్ట్ర  నృత్యమైన భరతనాట్యం  108 ముద్రలు,భంగిమల శిల్పాలు చెక్కి ఉంటాయి.

ప్రధాన ఆలయ గోపురం 


ఆలయం ద్రావిడ నిర్మాణ శైలిలో పూర్తి గ్రానైట్ రాయితో నిర్మించారు.ఆలయం చుట్టుపక్కల 60 కి.,మీ లోపల ఎక్కడా కూడా గ్రానైట్ కొండలు  లేవట.దూరంగా ఎక్కడో చెక్కించిన రాతి నిర్మాణాలను ఇక్కడికి ఏనుగులతో తెప్పించి ఆలయాన్ని నిర్మించారని తెలుస్తుంది.అందుకే ఈ ఆలయ ప్రాంతంలో ఎక్కడా రాతి ముక్కలు, కానీ, రాతిని  చెక్కిన గుర్తులు కానీ కనిపించవు.చెక్కిన రాళ్ళను ఒకదానిపై ఒకటి పేర్చుతూ ఆలయాన్ని నిర్మించారు.రాయిని ,రాయిని  అతికించటానికి మధ్యలో  సున్నంలాంటివేమీ వాడకపోవటం విశేషం.అన్నిరకాల టెక్నాలజీలు అందుబాటులో ఉన్న ఈరోజుల్లో కట్టిన నిర్మాణాలకంటే అలాంటివేమీ లేకుండా 1000 సంవత్సరాల క్రితం అంత అద్భుతమైన నిర్మాణం ఎలా సాధ్యమయ్యిందా అనిపిస్తుంది.

ఆలయ ప్రాకారం లోపలి నుండి 

చుట్టూ ప్రాకారాల మధ్యలో ఆలయం ఉంటుంది.ప్రాకారాలను దాటి,లోపలికి వెళ్ళగానే ముందుగా విశాలమైన ఆవరణలోని నందిమండపంలో బృహహదీశ్వరునికి తగినట్లు 25 టన్నుల బరువున్న ఏకశిలతో నిర్మించిన 19 అడుగుల పొడవు,8 అడుగుల వెడల్పు ,12 అడుగుల ఎత్తుతో నందీశ్వరుడు దర్శనమిస్తాడు.  భారతదేశంలోని అతిపెద్ద నంది విగ్రహాల్లో మొదటిది లేపాక్షి నంది,రెండవది ఈ నంది.

నందిమండపం బయటి నుండి 
నందిమండపం లోపలి నుండి
నందిమండపంలో అందమైన  చిత్రకళ

నందీశ్వరుని దర్శించుకుని,నందిమండపం ముందున్న ధ్వజ స్తంభం దాటి ముందుకి వెళ్ళగానే ఆరు అడుగులు ఎత్తుండే పునాది మీద ఆలయం కనపడుతుంది.ఆలయాన్ని సుమారు వందగజాల పొడవు,యాభై గజాల వెడల్పుతో నిర్మించారు.ఆలయ శిఖరం  మొత్తం చూడాలంటే పూర్తిగా తల పైకెత్తి చూడాల్సిందే. ప్రవేశద్వారం దగ్గరనుండి గర్భాలయం వరకు విశాలమైన మండపాలు వరసగా ఉంటాయి.అన్ని మండపాల్లో అద్భుతమైన శిల్పకళ కనిపిస్తుంది.

ఆలయ ధ్వజస్థంభం 
ప్రధాన ఆలయం 

గర్భాలయంలో నల్లరాతితో పదహారడుగుల ఎత్తు,ఇరవై ఒక్క అడుగుల వెడల్పుతో,శివలింగం మీద నాగపడగలతో చూడటానికి రెండు కళ్ళు సరిపోవేమో అనిపించేంత పెద్దగా బృహదీశ్వరుడనే పేరుకు తగినట్లుగా శ్రీరాజరాజేశ్వరుడు దర్శనమిస్తాడు.నర్మదా నదీగర్భం నుండి వెలికితీసిన రాయితో రాజరాజచోళుడు స్వయంగా తానే  దగ్గరుండి శిల్పులతో ఈ శివలింగాన్ని చెక్కించి,ఏనుగులతో మోయించి తెచ్చారట.స్వామికి అభిషేకం చేయాలంటే పక్కనే ఎత్తుగా ఉన్న మెట్లపైకి ఎక్కి చేయాలి.మేము వెళ్ళినప్పుడు జనం చాలా తక్కువగా ఉండటంతో మేము చాలాసేపు ఉండి,స్వామి దర్శనం చేసుకున్నాము.తమిళనాడు ఆలయాల్లో పూజారులు డబ్బు ఎక్కువ అడగరు.10 రూపాయలు కానుక ఇచ్చినా గోత్రనామాలతో పూజచేసి,విబూధీ,కుంకుమ ప్రసాదంగా ఇస్తారు.

శ్రీ బృహదీశ్వరుడు 
జటాజూట ధారి శివా  చంద్రమౌళీ నిటాలాక్ష నీవే సదా మాకు రక్ష
శ్రీ బృహదీశ్వరుడు,శ్రీ బృహన్నాయకి అమ్మవారు 

గర్భగుడి నుండి బయటికి 

గర్భగుడి నుండి బయటికి రాగానే ప్రధాన ఆలయం వెనక భాగంలో విఘ్నేశ్వరుడు,నటరాజమూర్తుల ఆలయాలు, బృహన్నాయకి అమ్మవారి ఆలయం,కుమారస్వామి ఆలయం,చండికేశ్వర ఆలయం ఉంటాయి.అన్ని ఆలయాల్లో, ప్రధానాలయం గోపురం మీద ఎంతచూసినా తరగనంత,ఏమున్నాయో కూడా తెలియనన్ని శిల్పాలు ఉంటాయి.పెద్ద ద్వారపాలకుల విగ్రహాలు ప్రతి ఆలయ ప్రవేశద్వారాలకి రెండువైపులా కనిపిస్తాయి.ఆలయప్రాంగణం మొత్తం నడవటానికి ఇబ్బంది లేకుండా నీట్ గా బండరాళ్లు పరిచి ఉంటాయి.పచ్చగడ్డితో లాన్స్,పార్కులు ఉంటాయి. చిరు జల్లులలో తడిసిన ఆలయం చాలా అందంగా అద్భుతంగా ఉంది.మేము ఆలయం మొత్తం  తిరిగి చూడటానికి, దర్శనాలు చేసుకోవటానికి వర్షం ఏమాత్రం ఆటంకం కలిగించకపోగా,చల్లగా జల్లుల్లో ఆలయంలో తిరగటం మర్చిపోలేని  అనుభూతి.ఆరోజు తమిళనాడు ఎలక్షన్ కూడా కావటంతో మాతో  పాటూ చాలా కొద్దిమంది  మాత్రమే ఉన్నారు.ఉదయాన్నే ప్రశాంతమైన,చల్లని వాతావరణంలో అక్కడ ఎంత సమయం ఉన్నా ఇక బయటికి  వెళదాం అనిపించలేదు. 

కుమారస్వామి ఆలయం 

ద్వారపాలకులు 

ప్రతిచోటా అందమైన,అద్భుతమైన శిల్పకళ

ఐరావత ద్వారాలు 

ఆలయాల వివరాలు 

ఆలయం ప్రాంగణం మొత్తం చాలా శివలింగాలు ఉన్నాయి. 
దాదాపు 252 శివలింగాలు ప్రతిష్టించబడినట్లు అంచనా. 

ఆలయ ప్రాంగణంలో ప్రసాదాల స్టాల్. మేము కూడా ప్రసాదాలు కొన్నాము. 
చల్లటి ఉదయం ఇక్కడ వేడిగా పులిహోర,రవ్వకేసరి  చాలా బాగుంది 

ఆలయంలో మా అమ్మ  

మా తమ్ముడు

అమ్మ,నేను 

బృహదీశ్వరాలయం ఎంత అద్భుతంగా ఉందో,మేము వెళ్లినరోజు జల్లులతో వాతావరణం కూడా అంతే ఆహ్లాదంగా ఉంది అక్కడే చాలాసేపు ఉన్న,బయటికి రావాలనిపించలేదు.తప్పదు కాబట్టి మళ్ళీ మళ్ళీ తిరిగి ఆ అద్భుతాన్ని చూస్తూ బయటికి వచ్చేశాము.మేము తంజావూర్ వెళ్లినరోజే తమిళనాడులో ఎలెక్షన్స్ జరుగుతున్నాయి.వర్షంలో కూడా వెళ్లి ఓట్ వేయటం కనిపించింది.ఇప్పుడు ఈ ఫ్లెక్సీ చూస్తే అనిపిస్తుంది.తమిళనాడులో ఇంత రాజకీయ కల్లోలం జరుగుతుందని మనం ఆరోజున అనుకున్నామా  అని..

ఆలయం బయట ఎలక్షన్ ఫ్లెక్సీ 

ఎలక్షన్స్ కారణంగా Thanjavur Art Gallery and Museum క్లోజ్ చేసి ఉంది.తప్పకుండా చూద్దాం అనుకున్నాము కానీ కుదరలేదు.


ఆలయం ముందున్న తంజావూర్ ఆర్ట్స్ షాపులోకి వెళ్ళాము.నిజంగా అక్కడి బొమ్మలు, తంజావూర్ పెయింటింగ్స్ అన్నీ చాలా అందంగా,కళాత్మకంగా  ఉన్నాయి.వీటిని ఆన్ లైన్ లో కూడా కొనుక్కోవచ్చు.

తంజావూర్ Arts 





రాజులకే రాజైన ఆ రాజరాజేశ్వరుని కోసం రాజరాజ చోళుడు నిర్మించిన బృహదీశ్వరాలయం నిజంగా అద్భుతం.దక్షిణభారత శిల్ప సౌందర్యానికి ప్రతీక.ఈ ఆలయంలో అన్ని ఆలయాల్లాగా రకరకాల రంగులు వేయకపోవడం వలన అప్పటి పురాతన వైభవాన్ని అలాగే నిలిపి ఉంచినట్లు అనిపిస్తుంది.బృహదీశ్వరాలయ దర్శనం చాలా సంతోషంగా,ఎప్పటికీ గుర్తుండే మంచి జ్ఞాపకంగా అనిపిస్తుంది.

PRIDE OF INDIA - Thanjavur Big Temple



Related Posts Plugin for WordPress, Blogger...