పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

22, ఏప్రిల్ 2017, శనివారం

మా తమిళనాడు యాత్రా విశేషాలు - మేల్ మరువత్తూర్ ఆదిపరాశక్తి


ఆది పరాశక్తి సిద్ధార్ పీఠం 

చెన్నె వెళ్ళే దారిలో మేల్ మరువత్తూర్ ఆదిపరాశక్తి దర్శనానికి వెళ్ళాము.తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో చెన్నై నుండి 92 km దూరంలో ఉన్న ఈ దేవాలయాన్ని ఆదిపరాశక్తి సిద్ధార్ పీఠం(Adhiparasakthi Siddhar Peetam) అంటారు.బంగారు అడిగళారు(Bangaru Adigalar) అనే గురువును ఇక్కడ అమ్మవారి రూపంగా భావించి పూజిస్తారు.అమ్మశక్తి ఆయన ద్వారా భక్తులతో మాట్లాడుతుందని,కోరికలు తీరుస్తుందని ఇక్కడ నమ్మకం.ఈ ఆలయం చాలా పెద్దది.విశాలమైన ఆవరణలో ఉంది.ఆలయమంతా గురూజీ,అమ్మవారి పెద్ద పెద్ద కటౌట్లు ఉంటాయి.ఇక్కడ ఫోటోలు అస్సలు తియ్యనివ్వరు.మగవాళ్ళు సాంప్రదాయ దుస్తుల్లో లేకపోతే  లోపలికి వెళ్లనివ్వరు.ఈ పోస్ట్ లో పెట్టిన ఫొటోలన్నీ టెంపుల్ website లోవి.

నవరాత్రి ఉత్సవాలు 

స్థలపురాణం
1960 కాలంలో ఇప్పుడు గర్భగుడి ఉన్న ప్రదేశంలో వేపచెట్టు ఉండేది.ఆ వేపచెట్టుకు స్వభావ విరుద్ధంగా తియ్యటి పాలు వచ్చేవి.స్థానికులు వింతగా ఆ పాలను రుచి చూసేవారు.తర్వాత కాలంలో ఆచెట్టు పాలను స్వీకరించిన వారికి అనారోగ్యాలు తొలగిపోవటం గమనించి,అది మహిమ కలిగిన చెట్టుగా గుర్తించి దానిని కాపాడేవాళ్లు.1966లో వచ్చిన వరదలకు చెట్టు కూలిపోయి, చెట్టుకింద భూమిలో స్వయంభువుగా వెలసిన శిల కనిపించగా దేవతగా భావించి చిన్న ఆలయం కట్టి పూజలు చేసేవాళ్ళు.November 25,1977లో ఇప్పుడున్న అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు.గర్భగుడిలో సహస్రదళపద్మం మీద కూర్చున్న అమ్మవారి విగ్రహం కనులపండుగగా అనిపిస్తుంది.అందమైన అలంకరణలో కుడిచేతిలో కలువమొగ్గతో,ఎడమ చేయి అభయముద్రతో  ఉన్న అమ్మకి   గర్భగుడిలో ఆడవాళ్ళే పూజలు చేస్తున్నారు.

గర్భగుడిలో భక్తులు 

అమ్మవారు కొలువున్న గర్భగుడిలోకి వెళ్లేముందు,మండపంలో పెద్ద త్రిశూలం అలంకరించి ఉంటుంది.ఆ ప్రదేశాన్ని ఓంశక్తి స్టేజ్ అంటారు.ఆ త్రిశూలంచుట్టూ ప్రదక్షిణ చేసి,గర్భగుడిలోకి వెళ్ళాలి.

ఆలయ మండపంలో  త్రిశూలం

ఆలయంలో ఎక్కడ చూసినా భక్తులు ఎర్రటి వస్త్రధారణలో ఉంటారు.ఇక్కడ కనకదుర్గమ్మ భక్తులలాగానే అక్కడ కూడా అమ్మ దీక్ష తీసుకుంటారు. అమ్మదీక్షలో ఉన్న భక్తులు ఆలయం ముందున్న విశాలమైన మండపంలోనే ఉండటానికి,అన్నదానంతో  పాటు, ఆలయ పరిసరాల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి.శక్తి పీఠం ఆధ్వర్యంలో ఉచిత విద్య,వైద్యం ఇంకా చాలారకాల ఛారిటబుల్ ట్రస్టులున్నాయట.అమ్మవారి శక్తి పీఠాలు వేర్వేరు ప్రదేశాల్లో, మనదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఉన్నాయి.అన్నిచోట్లా యజ్ఞాలు,పూజలు జరుగుతాయి. బంగారు అడిగళారు స్వామీజీ(అమ్మ) పుట్టినరోజును పెద్ద వేడుకగా చేస్తారు.


ఆలయంలో భక్తులు 

చైత్రపౌర్ణమికి అమ్మవారి సన్నిధిలో భారీ స్థాయిలో యజ్ఞ,యాగాలు జరుగుతాయి.రకరకాల ఆకారాల్లో నిర్మించిన హోమగుండాల్లో భక్తులు హోమాలు చేస్తారు.కులమత వర్గ విబేధాలు లేకుండా అందరికీ ఈ ఆలయంలో ప్రవేశం ఉంటుంది.అందరూ పూజలు చేసుకోవచ్చు.తెల్లవారుఝాము 3గంటలకు అమ్మవారి అభిషేకంతో గర్భగుడిని తెరుస్తారు.ఆలయ దర్శన వేళలు  3:00 am to 1:00 pm and 3:00 pm to 8:00 pm.పండగరోజుల్లో దర్శనానికి ఎలాంటి విరామం ఉండదు. 

అందంగా అలంకరించిన హోమగుండం 

మా చిన్నప్పుడు జెమినీ టీవీలో మేల్ మరువత్తూర్ అమ్మ గురించి ప్రతిరోజూ ఉదయం ప్రోగ్రామ్స్ వస్తూ ఉండేవి.మా అమ్మ అప్పటినుండి అమ్మవారిని చూడాలి అనుకునేది.ఇప్పటికి ఆ కోరిక తీరింది.అమ్మవారి  సాయంకాల దర్శనం ప్రశాంతంగా జరిగింది.పన్నీరు కలిపిన చందనం,కుంకుమ ప్రసాదంగా ఇస్తారు.ఇక్కడ ఎక్కువసేపు ఉండలేదు, దర్శనం  చేసుకుని వెంటనే చెన్నై బయలుదేరాము.

అమ్మవారి ఆలయప్రవేశ ద్వారం 
చిత్రంలో వ్యాసకర్త - మా తమ్ముడి మాట :)


Related Posts Plugin for WordPress, Blogger...