పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

15, జులై 2018, ఆదివారం

శ్రీశైలం జంగిల్ సఫారీ / Srisailam Wildlife Sanctuary Jungle Safari



2018 కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే అంటే జనవరిలో మాకు శ్రీశైల మల్లన్న దర్శనం చేసుకునే అదృష్టం కలిగింది. ముందు రోజూ రాత్రే వెళ్లి అక్కడ వుండి, ఉదయాన్నే పూజలు,దర్శనాలు అయ్యాక ఖాళీ  టైమ్ ఉండటంతో మా తమ్ముడు జంగిల్ సఫారీ కొత్తగా పెట్టారు వెళదాం అనటంతో  సరేనని వెళ్ళాము. శ్రీశైలం నుండి సున్నిపెంట వెళ్లే దారిలో మెయిన్ రోడ్ కి పక్కనే చుట్టూ వెదురుపొదల మధ్యలో చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది ఈ జంగిల్ సఫారీ.చుట్టూ కోతుల గుంపులు,ఎంట్రన్స్ లోనే పెద్దపులి బొమ్మలతో అడవిలోకి వచ్చేశామనే ఫీలింగ్ కలుగుతుంది.

 సఫారీ ఎంట్రన్స్ 


 చుట్టూ నిశ్శబ్దం,పక్షుల అరుపులు తప్ప ఇంకేమీ వినిపించవు.అక్కడ స్టాఫ్ రోజంతా ఆ నిశ్శబ్దంతోనే గడుపుతారు.. మనం ఒక్కరోజు వెళ్లి రావటానికి బాగానే ఉంటుంది కానీ రోజంతా అక్కడ ఉండటమంటే  గొప్పే అనిపించింది.స్టాఫ్ వెళ్లిన వాళ్లకి జీప్స్ అలాట్ చేయటం,ఏ టైమ్ కి ఎవరు వెళ్లారు లాంటి డిటైల్స్ నోట్ చేస్తుంటారు.ఇక్కడ గిరిజన ఉత్పత్తులు అమ్మే స్టాల్,అడవి జంతువుల విశేషాలతో ఒక మ్యూజియం కూడా వున్నాయి.

స్టాఫ్ తో మా అమ్మ

ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జీపుల్లో అడవిలోకి తీసుకెళ్తారు.డ్రైవర్ తో పాటు,ఒక గైడ్ కూడా మనతో పాటు జీపులో వస్తారు.1 1/2 గంటన్నర సేపు అడవిలోకి తిప్పి బయటికి తీసుకు వస్తారు. పెద్దపులి కనిపిస్తుందేమో చూద్దాం అనుకున్నాం కానీ నిజంగా రాకూడదనే కోరుకున్నాం :). ఓపెన్ టాప్ జీప్ లో కూర్చుని చుట్టూ రకరకాల చెట్లు,గడ్డి పొదలు చూస్తూ వెళ్ళటం చాలా బాగుంది. రోడ్డు కూడా చాలా చిన్నగా, రాళ్లు,మట్టితో  ప్రమాదంగానే అనిపిస్తుంది.కోతులు,కొండముచ్చులు,కొన్ని రకాల చిన్న పక్షులు,ఒక జింక కనిపించాయి.ఎక్కడో జూలో కాకుండా వాటి ప్రపంచంలో  హాయిగా స్వేచ్ఛగా తిరుగున్న జంతువుల్ని  చూడటం చాలాబాగుంది.

సఫారీకి తీసుకెళ్లే జీప్,డ్రైవర్
అడవిలో దారి

అడవిలో అంతా  జంతువుల నీళ్ల కోసం సిమెంట్ తో సాసర్స్ లాగా కట్టారు.వేసవి కాలంలో వాటిలో నీళ్లు నింపుతారట.గంట అడవిలో ప్రయాణం తర్వాత ఒక చెరువు దగ్గరికి జీప్ తీసుకెళ్లి ఆపారు.అక్కడంతా బురద,జంతువుల పాదముద్రలు,విపరీతమైన నిశ్శబ్దం మధ్యలో పక్షుల అరుపులు చాలా వింతగా,కొంచెం భయంగా కూడా అనిపిస్తుంది.అక్కడ గైడ్ మాకు ఈ చెరువు దగ్గరికి పులి కూడా నీళ్లు తాగటానికి వస్తుంది అంటూ పులి పాదముద్రను కూడా చూపించాడు.కాసేపు అక్కడ ఉండి,తిరిగి జీప్ లో వేరే దారిలో బయటికి వచ్చేశాము. 

 జంతువులు నీళ్లు తాగే చెరువు 
 పులి పాదముద్ర 

ఎప్పుడూ శ్రీశైలం వెళ్తూ ఘాట్ రోడ్ లో అడవిని చూస్తూ బయటికే ఇలా వుంది ఇంకా లోపలి వెళ్తే ఎలా ఉంటుందో అనుకునే మా సరదా ఈ జంగిల్ సఫారీతో తీరిపోయింది.నిజంగా చాలా అద్భుతంగా,ఎప్పటికీ గుర్తుండేలా వుంది మా "జంగిల్ సఫారీ" అనుభవం

మరికొన్ని ఫోటోలు,విశేషాలు ఈ వీడియోలో చూడొచ్చు.



జంగిల్ సఫారీ



Related Posts Plugin for WordPress, Blogger...