పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

17, నవంబర్ 2018, శనివారం

శ్రీ చింతల రామలింగేశ్వర స్వామి ఆలయం (రామప్ప గుడి) - మాచర్ల - గుంటూరు జిల్లా



ఆలయంలో 2016 లో ఏర్పాటుచేసిన శివపార్వతుల విగ్రహాలు


మా మాచర్లలోని రామప్పగుడి - శ్రీ గంగా పర్వతవర్ధినీ సమేత, శ్రీ చింతల రామలింగేశ్వర స్వామి ఆలయం చిన్నప్పటి  జ్ఞాపకం.చిన్నప్పుడు కార్తీకమాసం,శివరాత్రి ఇలా పండగరోజుల్లో మాత్రమే ఈ ఆలయం ప్రస్తావన వచ్చేది. ఎందుకంటే ఆ గుడి ఊరికి చాలా దూరంగా ఉండేది.రవాణా సౌకర్యాలు అంతగా ఉండేవి కాదు.అయినా కార్తీకమాసం వనభోజనాలకు,పూజలకు తప్పకుండా ఈ గుడికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు గుడి దగ్గర కూడా ఇళ్ళు,మంచి రోడ్లు,ఆటోలు అన్ని సౌకర్యాలు వచ్చేసాయి.

ఈ గుడి చాలా పురాతనమైనది.జమదగ్ని మహర్షి,రేణుకా మాతల కుమారుడు పరశురాముడు ప్రతిష్టించిన ఆలయంగా చెప్తారు.పరశురాముడు విష్ణుమూర్తి దశావతారాల్లో ఆరవ అవతారం.హైహేయ వంశస్థుడైన కార్తవీర్యార్జున చక్రవర్తి శాపవశాత్తూ చేతులు లేకుండా జన్మించి,దత్తాత్రేయుని పూజించి వేయి చేతులు వరంగా పొందుతాడు.ఒకరోజు వేటకోసం అడవికి వచ్చిన కార్తవీర్యార్జునుడు  జమదగ్ని మహర్షి ఆశ్రమానికి సేదతీరటానికి రాగా జమదగ్ని మహర్షి రాజుకి,ఆయన పరివారానికి పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం పెడతాడు. అది చూసిన కార్తవీర్యార్జునుడు ఓక సాధారణ మహర్షికి ఇదంతా ఎలా సాధ్యపడిందని అడగగా, తన దగ్గరున్న కామధేనువు జాతి గోమాత వలనే అని చెప్తాడు.

అప్పుడు కార్తవీర్యార్జునుడు ఆ గోవును తనకిమ్మని అడగగా మహర్షి నిరాకరిస్తాడు.అందుకో కోపించిన చక్రవరి బలవంతంగా ఆవును తీసుకెళ్ళిపోతాడు.విషయం తెలుసుకున్న పరశురాముడు కార్తవీర్యార్జునుని వేయిచేతులు ఖండించి,సంహరించి గోమాతను తీసుకువస్తాడు.జమదగ్ని మహర్షి పరశురాముడిని మందలించి తపస్సు చేసుకోమ్మని పంపిస్తాడు.పరశురాముడు తండ్రిని చంపినందుకు కక్ష పెంచుకున్న కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని మహర్షిని చంపివెళ్ళిపోతారు.తల్లి దుఃఖం చూసిన పరశురాముడు 21 సార్లు భూ ప్రదక్షిణ చేసి, కార్తవీర్యార్జునుని కుమారులతో పాటు అధర్మపరులై ప్రజలను హింసిస్తున్న క్షత్రియ రాజుల్ని  సంహరిస్తాడు. యుద్ధాల్లో  గెలిచిన భూమిని కశ్యప మహర్షికి దానంగా ఇచ్చేసి, పాప ప్రక్షాళన కోసం తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోతాడు

ఆ తపస్సులో భాగంగా శివుడ్ని పూజించి 108 స్వయంభూ శివలింగాలను ప్రతిష్టించినట్లు, అందులో ఒకటి మాచర్ల లోని ఈ రామప్ప గుడి అనేది స్థలపురాణం.రామప్పగుడిని దక్షిణ కాశీగా పిలుస్తారు.ఇక్కడ స్వామిని దర్శిస్తే కాశీలో విశ్వనాధుడ్ని దర్శించినట్లుగా భక్తులు భావిస్తారు.ఇక్కడ స్వామికి స్వయంగా మనమే అభిషేకాలు చేయొచ్చు,స్పర్శదర్శనం చేసుకోవచ్చు.మేము ఈ కార్తీక మాసంలో మొదటి సోమవారం ఈ గుడికి వెళ్ళాము.ఆలయంలో స్వామివారికి అభిషేకాలు,అమ్మవారికి కుంకుమపూజ,రుద్రహోమం, ప్రతిరోజూ భక్తులకు అన్నదానం,సహస్ర దీపాల సేవ అన్ని చాలా బాగా జరుగుతున్నాయి.


మా రామప్పగుడిని ఈ వీడియోలో చూడొచ్చు 
 



Related Posts Plugin for WordPress, Blogger...