ఆనాటి క్రిష్ణుడు ఆడి పాడిన బృందావనం ఎంత మనోహరంగా వుంటుందో మా ఇంట్లో మా వంశీ క్రిష్ణుడు అంటే మా తమ్ముడు ఎంతో ఆసక్తిగా పెంచిన పూలతోట కూడా అంత మనోహరంగా వుంటుంది.
మా అమ్మ మేము చిన్నప్పుడు మాకంటూ సొంత ఇల్లు కావాలని ఎంతో కోరుకునేదట.ఒక రోజు అమ్మ కలలో అమ్మ పూజ చేసుకునే అమ్మవారు కనపడి నీకు 2 సొంత ఇళ్ళు ఇస్తాను నీ ఇంటి ముందు సన్నజాజి పూల చెట్లు పెంచి ఆ పూలతో నాకు పూజ చేయమని చెప్పిందట
ఈ కల వచ్చిన నెలలోనే మేము స్థలం కొనటం,ఇల్లు కట్టించటం అంతా జరిగిపోయింది.
అమ్మ మా ఇంట్లో ముందుగా నాటిన మొక్క సన్నజాజి.
ఇంట్లో స్థలం తక్కువ కాబట్టి అన్నీ కుండీలు తెచ్చి,ఆ కుండీలలో మొక్కలు నాటే మట్టి మమ్మల్ని స్కూల్ కి తీసుకెళ్ళే రిక్షా అబ్బాయికి డబ్బులిచ్చి తెప్పించేది అమ్మ.
వర్షం పడగానే కడియం, ఇంకా ఎక్కడెక్కడినుంచో సైకిల్ మీద అమ్మటానికి వచ్చే పూల మొక్కలని కొని మొక్కలు నాటటం అమ్మకి వర్షాకాలం లో వుండే పెద్ద పని.
అలా మొదలైన మొక్కలు పెంచే ఆసక్తి మా అమ్మతో పాటు మా తమ్ముడికి వచ్చింది.వాడు పెరిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా పూల మొక్కలు తెచ్చి వాటిని ఎంతో జాగ్రత్తగా పెంచుతాడు.
మొక్కలు,చెట్లతో బంధాన్ని పెంచుకున్న వ్యక్తి కుటుంబ బంధాలకు విలువ ఇస్తాడు.
ఈ మాట మా తమ్ముడి విషయం లో అక్షర సత్యం.
ఇక నాకు, మా చెల్లికి పూచిన పూలని పెట్టుకోవటం కంటే వాటిని చూసి ఆనందించటం అంటేనే ఇష్టం.
మనం నాటిన మొక్క ఎదుగుతున్న తీరు చూసినా,వాటికి పూసిన పూల అందాలు చూసినా కలిగే ఆహ్లాదకర భావన అనుభవిస్తే కానీ తెలియదు.
ఇంట్లో స్థలం తక్కువగా వున్నా కుండీలలో ,వున్న చిన్న నేలలోనే పెరిగిన మా పూలతోట ఎంతో ఆహ్లాదకరంగా,
నయన మనోహరంగా వుంటుంది.
ఇదే నా చిన్ని ప్రపంచం లో మా ఇంటి బృందావనం .
ఒక కొమ్మకి పూచిన పువ్వులం అనురాగం మనదేలే
రాజి
2 కామెంట్‌లు:
చాలా అందంగా ఉందండీ మీ అందాల బృందావనం! :-)
ధన్యవాదాలు మధురవాణి గారూ :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి