ధనుర్మాసం మొదలయ్యింది.విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది ధనుర్మాసం.
ఈధనుర్మాసం నెలరోజులు వెంకటేశ్వరస్వామికి సేవలో గోదాదేవి పాడిన 30 పాశురాలను పాడతారు
విష్ణు పూజకి ప్రాధాన్యమైన ఈ నెలలో పూజలకే కాకుండా ఎన్నో సరదాలు,సందళ్ళు కూడా వుంటాయి.
ధనుర్మాసం మొదలవగానే ప్రతి ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులు కనిపిస్తాయి.
తూర్పు తెలవారకముందే ఎంతో శ్రమతో ఇంతులు తీర్చిదిద్దిన రంగవల్లులు స్వాగతం పలుకుతాయి.
ఎంత చదువుకున్నా,కాలం మారినా మన రంగవల్లుల సంప్రదాయాన్నిమాత్రం మర్చిపోలేము.
ధనుర్మాసం మొదలవగానే ఇంటి ముందు మంచి ముగ్గు వేయాలన్న కోరిక ప్రతి అమ్మాయికి కలుగుతుందేమో...
dec 16 నుండి సంక్రాంతి పండగ దాకా ముగ్గులు వేయటం ఆనవాయితీ దీన్నే నెలపట్టడం అంటారు.
నాకు కూడా ఈ నెలరోజులు ఇంటి ముందు ముగ్గు వేయటం చాలా సరదా..చిన్నప్పటినుండి అమ్మ,పెద్దమ్మలు వేసే ముగ్గులు పుస్తకంలో వేసుకున్నవాటితో పాటూ,కొన్ని సంవత్సరాలుగా పేపర్ లొ వచ్చే ముగ్గుల్ని కూడా దాచిపెట్టటం అలవాటయ్యింది.. అలా నా ముగ్గుల పుస్తకం నాకు ఇష్టమైనవాటిల్లో ఒకటి.
ఈ నెలలో మాత్రమే కనిపించే మరొకరు హరిదాసు.ప్రతి ఇంటికీ హరిదాసు జరీ పట్టుపంచెతో, తలపాగా చుట్టి, మెడలోబంతి పూల హారంతో , పట్టు వుత్తరీయముతో ,నుదుట హరి నామంతో,తుంబుర ఒక చేత్తో చిడతలుమరో చేత్తో పట్టుకుని తుంబుర మీటుతూ,పసుపు కుంకుమలతో,పూలతోనూ అలంకరించి గుమ్మడికాయ ఆకారంలో వుండే ఇత్తడి లేదా రాగి పాత్రను తలపై పెట్టుకుని హరినామస్మరణ చేస్తూ వచ్చే హరిదాసుకి భిక్ష వేయడానికిచిన్నప్పుడు పిల్లలమంతా పోటీ పడే వాళ్లము.
కృష్ణార్పణం అంటూ భిక్ష స్వీకరించే హరిదాసు ఆగమనం ధనుర్మాసంలో మొదలై సంక్రాంతితో ముగుస్తుంది.
గంగిరెద్దులు ధనుర్మాసంలో మరో ముఖమైన అతిథులు.రంగురంగుల బట్టలతో అలకరంచిన గంగిరెద్దులను ఆడిస్తూ,సన్నాయి ఊదుతూ ఇంటి ముందుకు వచ్చే గంగిరెద్దుల వాళ్ళని చూడటం చాలా సరదాగా వుండేది.
ఇంటి వాళ్ళు ఇచ్చే పాత బట్టలు,బియ్యం తీసుకుని అమ్మగారికి దండం పెట్టు,అయ్యగారికి దండం పెట్టు అంటూ దీవించి వెళ్తారు.
ధనుర్మాసం తీసుకువచ్చే సంబరాలలో ఇవి కొన్నిమాత్రమే ఇంకా చెప్పుకోవాల్సినవి చాలానే వున్నాయి.
ప్రస్తుతానికి ముగ్గులతో బిజీ,ముగ్గులు నేర్చుకోవటం,అందరికన్నామంచి ముగ్గు వేయాలని పోటీపడటం,
ఈ సందడి అంతా ఈ ఒక్క నెలలోనే కదా.
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి