2012 యుగాంతం ప్రపంచం అంతా అంతమైపోతుంది.. ఇంక ఈ భూమి మీద మనుగడ లేదు అని అందరూ భయపడ్డారు.కొందరు బాధ పడ్డారు.కొంతమంది చూద్దాంలే అంత తేలికగా యుగాంతం అవుతుందా అనుకున్నారు.కొందరు ఉంటే ఎంత పొతే ఎంతలే అని వేదాంతం చెప్పారు.కానీ ప్రస్తుత సమాజాన్ని,పరిస్థితులను చూస్తుంటే నాకనిపిస్తుంది 2012 యుగాంతం మనుషులకా? మనుషుల్లోని మానవత్వానికా ?? అని..
ఆడవాళ్ళ మీద అత్యాచారాలు,హత్యలు,ప్రేమోన్మాదుల దాడులు
భార్యను బయటికి గెంటేస్తున్న భర్తలు, భర్త ఇంటిముందు భార్యల మౌన దీక్షలు.
భార్య మీద అనుమానంతో పిల్లలకు DNA టెస్టులు చేయించమనే తండ్రులు
భర్త మీద కోపంతో క్షణికావేశంలో కడుపున పెట్టుకుని కాపాడాల్సిన పిల్లలను కడతేర్చే మాతృమూర్తులు
కీచకావతారం ఎత్తుతున్న గురుదేవులు
బడిలో బాలికకూ,విశ్వవిద్యాలయంలో మహిళలకు తప్పని లైంగిక వేధింపులు
బతికుండగానే కన్నతల్లిదండ్రులను స్మశానానికి చేరుస్తున్న సుపుత్రులు,పుత్రికలు
తమ కడుపున పుట్టిన పిల్లలే తమని వేధిస్తున్నారంటూ కాపాడమని HRC ని ఆశ్రయిస్తున్న పండుటాకులు.
ప్రజారక్షణే మీ కర్తవ్యం కదా మమ్మల్నిరక్షించమని వచ్చిన మహిళను కోరిక తీర్చమనే రక్షక భటులు
తన కింద పనిచేసే మహిళా ఉద్యోగితో అక్రమసంబంధం పెట్టుకుని ఆమెను వంచించే న్యాయమూర్తులు.
ఇలాంటివన్నీ గత కొన్ని సంవత్సరాలుగా " FIR " " CRIME REPORT " అంటూ టీవీల్లో యాంకర్లు
మహా సీరియస్ గా వీటి గురించి చెప్తూ ఉంటారు...వాటిని చూస్తూ,వింటూ ఇదేముందిలే ఇలాంటివి రోజూ జరుగుతూనే వున్నాయి అనుకోవటం,వాటిలో నిజానిజాలు ఎంత? ఎవరిది తప్పు ? అని మనమే నిర్ణయించేసుకోవటం కాసేపటి తర్వాత ఆ విషయాలు మర్చిపోవటం.. వదిలేయటం.. ఇలా మనమందరం ఈ దారుణాలను,అమానుష సంఘటనలను సమాజంలో భాగంగా చాలా తేలికగా తీసుకునే స్థాయికి వచ్చాము...
ఇలాంటి సమయంలో రాజధానిలో జరిగిన సామూహిక అత్యాచారం సంఘటన ఇంతకుముందు కేసుల్లాగానే విచారణ,పరిష్కారం అంటూ సంవత్సరాలు పడుతుందిలే అనుకున్నాము.. కానీ ఈ అత్యాచారం విషయంలో ప్రజల్లో,మహిళా సంఘాల్లో,ముఖ్యంగా యువతరంలో కలిగిన స్పందన అనూహ్యం, ప్రశంసనీయం. వారిలో చెలరేగిన ఆవేశం,దోషులకు ఉరిశిక్షపడాలనే ఆవేదన ప్రభుత్వాన్ని,పాలకులను ఆలోచనలో పడేలా చేసింది.వీరి దీక్షకు మధ్యవయస్కులు, సాదారణ పౌరులు కూడా మద్దతు పలకటం సమాజంలో మిగిలి ఉన్న మానవత్వానికి నిదర్శనం అని చెప్పొచ్చు.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతను చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగా హింసాత్మక చర్యలకు కూడా ప్రభుత్వం వెనుకంజ వేయకపోవటం శోచనీయం...
అమ్మాయిల మీద దాడులు జరిగినప్పుడు అసలు అమ్మాయిల వస్త్రధారణ సరిగా లేదు అందుకే
మగవాళ్ళు పశువుల్లా ప్రవర్తిస్తున్నారు అంటాడు ఒక అధికారి.
అసలు ఆడవాళ్ళకి అర్ధరాత్రి తిరిగే సాతంత్ర్యం,హక్కు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నిస్తాడు మరో నాయకుడు ..
అర్ధరాత్రి బాయ్ ఫ్రెండ్ తో తిరిగే ఆడపిల్లలు ఇలాంటివి జరుగుతాయని తెలియదా అంటారు పెద్దవాళ్ళు.
అసలు ఆడవాళ్ళదే తప్పు ఎక్కడ ఎలా ఉండాలి?ఎక్కడికి ఎప్పుడు వెళ్ళాలి? అని తెలుసుకోవాలి అంటారు సాంప్రదాయవాదులు.( ఇది కొంతవరకు నిజమే)
చట్టం,న్యాయం తన పని తాను చేసుకుపోతుంది అంటారు మేధావులు..
సరే వీళ్ళ మాటలే నిజమని ఒప్పుకుంటే సినిమాలు,సినిమాల్లో చెడుని చూసి పెడత్రోవ పట్టే యువత
అంత తేలికగా సినిమాలను చూసి ప్రభావితం అయ్యేటట్లయితే సినిమాల్లో మంచిని చూసి నేర్చుకోవచ్చు
కదా మంచి వస్త్రధారణ,ప్రవర్తన ఉన్న మహిళల మీద దాడులు జరగట్లేదా?బయట తిరిగే స్వాతంత్ర్యం
లేకపోతె పోనీ ఆఫీసుల్లో స్వేచ్చగా పనిచేసుకునే పరిస్థితులు ఉన్నాయా??కార్యాలయాల్లో,కాలేజీల్లో ప్రయాణాల్లో,కనీసం ఇంట్లో ఇలా ఇంకెన్నో చోట్ల చెప్పుకోలేని ఇబ్బందులకు గురయ్యి మౌనంగా బాధపడే
మహిళలు ఎందరో లేరా?
వీటన్నిటికీ కారణం నేరస్తుల్లో చట్టం,న్యాయం మమ్మల్ని ఏమి చేస్తాయిలే అన్న తెగింపు, ఎన్ని తప్పులు
చేసినా చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని తప్పించుకో గలము అనే లెక్కలేనితనం..దీనికి పరిష్కారం లైంగిక నేరాల చట్టాలను సవరించి, మరింత పటిష్టం చేయటం,ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేసి వేగవంతంగా విచారణ పూర్తి చేయటం,ప్రలోభాలకు లొంగకుండా తీర్పును వెలువరించి,శిక్షను అమలుచేయటం ప్రస్తుత కర్తవ్యం. .అని అందరి అభిప్రాయం .
అలాగే ప్రభుత్వం, పాలకులు మహిళలలోని లోపాలను ఎత్తిచూపి మీ వల్లనే ఇలా జరుగుతున్నాయంటూ
తప్పును ఆపాదించి,నిందించకుండా మీ ప్రయత్నం లో భాగంగా సరైన శాసనాలను,చట్టాలను చెయ్యాలి.
మహిళలకు రక్షణ కల్పించాలి..ఆపదలో ఉన్నామని ఆశ్రయించిన వాళ్లకు సత్వర సహాయం అందించే రక్షణ యంత్రాంగాన్ని సక్రమంగా అమలు చేయాలి. మనుషుల్లో సాటి మనిషిని మనిషిగా గౌరవించే సహృదయం,మానవత్వం, నైతికవిలువలు, మంచి.చెడుల విచక్షణా జ్ఞానం పెంపొందాలి.
ఈ సమస్య తీరిపోతే ఇంకే సమస్య రాదన్న నమ్మకం లేకపోయినా, ఉరిశిక్ష,లేక ఇంకే కఠిన శిక్ష పడితేనో
ఇంకో నేరస్తుడెవడూ ఇలాంటి నేరం చేయడన్న నమ్మకం లేకపోయినా మంచి మనస్సుల్లో మొదలైన
ఈ ఉద్యమం రాజకీయరంగు పులుముకోకుండా అనుకున్న లక్ష్యం సాధించాలని కోరుకుంటూ,
సభ్యసమాజం తలదించుకునే ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదని, తాను ఎలాంటి తప్పు
చేయకపోయినా దారుణమైన శిక్ష అనుభవిస్తున్న బాధితురాలికి సరైన న్యాయం జరగాలని
సాటి మనుషులుగా ఆకాంక్షించటం మానవత్వం ఉన్న ప్రతి మనిషి కర్తవ్యం...
6 కామెంట్లు:
చాలా బాగా చెప్పారు. రాజీ గారు..
మీ ఆవేదన అందరి ఆవేదన కూడా.. ఆరోగ్యకర సమాజం కోసం నడుం బిగించాల్సిన భాద్యత అందరిది కూడా.
"వనజవనమాలి" గారు..
నేను చెప్పింది నచ్చినందుకు,మీ స్పందనకు థాంక్సండీ..
మీరు చెప్పింది నిజమే "ఆరోగ్యకర సమాజం కోసం నడుం బిగించాల్సిన భాద్యత అందరిది కూడా"
సినిమాల ప్రభావాన్ని తీసిపారేయకండి. సినిమాల్లో చూపే మంచి నుండి ప్రేరణ పొందేవాళ్లూ ఉన్నారు. 'కర్తవ్యం', 'శంకరాభరణం' వంటి సినిమాలు ఉదాహరణ. కాకపోతే చెడు కలిగించినంత సంచలనం మంచి కలిగించదు కాబట్టి ఆ తరహా వార్తలకి ప్రచారం పెద్దగా ఉండదంతే.
"అబ్రకదబ్ర" గారూ..
"చెడు కలిగించినంత సంచలనం మంచి కలిగించదు"
మీరు చెప్పింది నిజమేనండీ..
సినిమా ప్రభావితం చేయగలిగినదే,చేస్తుంది కూడా
కాకపోతే అందులో మంచిని ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుంది కదా అన్నది నా ఆలోచన..
మీ వ్యాఖ్యకు ధన్యవాదములు..
రాజీ, ఇదంతా కూడా చెట్టు ముందా విత్తు ముందా అన్నట్లే ఉంటుంది. ఎంత కాలం గడిచినా ఒకరినొకరు తప్పు పట్టుకోటమే గాని, రావాల్సిన మార్పు మాత్రం రావట్లేదు.ఇన్నాళ్ళు లేని చైతన్యం ఢిల్లీ సంఘటన తరువాత కొంచెంగా మొదలయ్యిందనే అనిపిస్తోంది. అయినప్పటికీ ఎన్ని చోట్లో ఘోరాలు జరిగిపోతూనే ఉన్నాయి. మొగ కాని ఆడ గాని అందరూ చెడ్డవాళ్ళు కాదు కదా! కాని, ఆడవాళ్ళ సమస్యలు మాత్రం విపరీతంగా పెరిగి పోతూనే ఉన్నాయి. ఈ ఆధునిక కాలంలో స్త్రీ సున్నితత్వం వదిలి మహంకాళి అవ్వటమే మంచిదేమో అనిపిస్తుంది.
"జయ" గారూ..
నిజమేనండీ ఇలాంటి విషయాల్లో ఒకరినొకరు తప్పు పట్టుకోవటం,నిందించుకోవటం తప్ప ఫలితమేమీ ఉండటం లేదు.ఢిల్లీ సంఘటన తర్వాత వచ్చిన చైతన్యం నిజంగా మంచి విషయం కాకపోతే ఈ చైతన్యం కూడా ఎన్నాళ్ళు ఉంటుందో..
ఏ ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాల్సిందే..
మంచి సమాజానికి కావాల్సింది మంచి ఆడ,మంచి మగ కాదు మంచి మనుషులేమో అనిపిస్తుంది.
మీ స్పందనకు ధన్యవాదములు..!
కామెంట్‌ను పోస్ట్ చేయండి