కొత్త సంవత్సరం కొత్త కొత్తగా ...వచ్చేసింది చిన్న చిన్నగా
పాతపడిపోతుంది కూడా.. కొత్త సంవత్సరం ప్రతి సంవత్సరం వచ్చేదే అయినా ఎప్పుడూ ప్రత్యేకమే, ప్రతిసారీ పండగే. పాత సంవత్సరం వెళ్ళిపోతూ, కొత్త సంవత్సరం వస్తుంది అనగానే ఎంతో ఉత్సాహం, ఎన్నో వేడుకలు ... కొత్త సంవత్సర సంబరాల్లో నాకు బాగా నచ్చేవిషయం రాబోయే సంవత్సరం మంచి చేయాలని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోవటం, మనకు,మన వాళ్లకు ఈ సంవత్సరం ఆనందంగా,శుభంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకోవడం చాలా బావుంటుంది. ఒక గతం గడిచిపోయింది, అది కలిగించిన బాధలను, ధుఃఖాలను ఇక్కడే మర్చిపోయి, కొత్త తలపులతో, సరికొత్త ఆశలతో అందమైన భవిష్యత్తు కోసం నూతన సంవత్సరాన్ని ఆనందంగా ఆహ్వానించాం ...
కొత్తసంవత్సరం లో నాకు ఎక్కువగా నచ్చేది కొత్త డైరీలు,గ్రీటింగులు మనం మన వాళ్లకి ఇచ్చినా,మనవాళ్ళ నుండి మనం అందుకున్నా చాలా సంతోషంగా అనిపించే వాటిలో ఈ డైరీలు,గ్రీటింగులు ఫస్ట్ ప్లేస్ లో వుంటాయి.న్యూ ఇయర్ వస్తుందనగానే షాపింగ్ లిస్టులోకి ఈ డైరీలు కూడా చేరిపోతాయి. నాకు మాత్రం ప్రతి సంవత్సరం మా తమ్ముడు ఇచ్చే డైరీ,కొత్త పెన్ తోనే సంవత్సరం మొదలవుతుంది.. ఆస్వాదించిన అనుభూతులను, బాధపెట్టిన చేదు జ్ఞాపకాలను, గడిచిపోయిన కాలాన్ని పదిలంగా దాస్తూ ,రాబోయే కాలానికి ఆహ్వానంగా మంచి డైరీని అందుకోవటం సంతోషంగా అనిపిస్తుంది.కొత్త డైరీ చూడగానే చిన్నప్పుడు స్కూల్ రీఓపెన్ కాగానే కొత్తపుస్తకాలు కొనుక్కుని,జాగ్రత్తగా అట్టలు వేసుకుని, కొన్నాళ్ళ పాటు భద్రంగా దాచుకునే రోజులు గుర్తొస్తాయి.
ఇంకా కొత్త సంవత్సరంలో కొత్తగా ఇంట్లో చేరేవాటిలో కేలండర్లు కూడా ముఖ్యమైనవే..ఏ షాప్ కి వెళ్ళినా వాళ్ళ షాప్ పేరుతో ప్రింట్ చేయించి ఇచ్చే కాలెండర్లు,అలాగే ఈనాడు,సాక్షి,స్వాతి వాళ్ళు ఇచ్చే కాలెండర్లు ఇంట్లో ఎక్కడ చూసినా దర్శనమిస్తుంటాయి.ఒకప్పుడైతే కేలండర్లను గోడలకు తగిలించే వాళ్ళు కానీ ఇప్పుడలా కాదు..అవసరమైనప్పుడు తిథిలు, ముహూర్తాలు, పంచాంగం చూడటం కోసం బుక్ రాక్ లో నుండి వెతికి తెచ్చుకోవటమే..
ఇలా కొత్త సంవత్సరంతో పాటూ చాలా కొత్త కొత్త వస్తువులు,విషయాలు జీవితంలోకి చేరుతుంటాయి.. కాలంతో పాటూ పాతపడుతుంటాయి..ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా కొన్ని కొత్త వస్తువులు,కొత్త పనులు,కొత్త బంధాలు,బాధ్యతలు కొత్త సంతోషాలు,కొత్త సమస్యలు,సవాళ్లు ఇలా జీవితం కొత్త కొత్తగా సాగిపోతుంది...
ఈ సంవత్సరం నా చిన్నిప్రపంచంలో నాకు నచ్చిన కొన్ని కొత్త విశేషాలు...
ఈ కొత్త సంవత్సరం లో సంక్రాంతి అయిపోగానే శ్రీశైలం వెళ్ళటం చాలా సంతోషంగా అనిపించింది. శ్రీశైలం వెళ్ళగానే సాయంత్రం దర్శనం, ఉదయం పూజలు అన్నీ బాగా జరిగాయి.
శ్రీశైలం లో స్వామివారికి,అమ్మవారికి చేయించిన
అభిషేకం,కుంకుమ పూజ ప్రసాదాలు..
అక్షరాలై నిలవబోయే అనుభవాలు
కొత్త డైరీలు
కాలప్రవాహంలో రోజుల్ని దాటుకుంటూ
ముందుకు సాగిపోయే కాలెండర్లు
శ్రీశైలం శిఖరం దగ్గర ఉండే "రాజా షాపింగ్ సెంటర్" మాకు చాలా నచ్చే షాప్.ఇక్కడ అన్ని రకాల హెర్బల్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. పెర్ఫ్యూమ్స్,సోప్స్ ,బ్యూటీ ప్రొడక్ట్స్,మంచి మ్యూజిక్ కలెక్షన్ సి డి లు,పిల్లల ఇంపోర్టెడ్ ఆట వస్తువులు ఇలా ఇక్కడ షాపింగ్ మాకు చాలా ఇష్టం, ఈసారి తీసుకున్న వాటిలో
వెరైటీ సోప్ బాక్స్ ల్లో ఉన్న బాత్ సోప్స్,
చామ్ రాజ్ టీ బాక్స్ కొత్తగా అనిపించాయి..
మా బృందావనం లో ఈ కొత్త సంవత్సరం కొత్తగా
పూచిన పువ్వులు,కాయలు..