నిన్న "వనజవనమాలి" గారు "మాంగల్యం తంతునానేనా" మంత్రం ఒక అలకారప్రాయంగా మారిపోయిందని, చిన్న విషయాలకే విడాకుల దాకా పోతున్న మన వివాహ వ్యవస్థను గురించి చక్కని పోస్ట్ రాశారు.. అది చదివిన తర్వాత నాకు కూడా ఈ మధ్యే ఎదురయిన ఒక సమస్యను
ఇక్కడ చెప్పాలనిపించింది
వివాహ బంధం పవిత్రమైన ఒక ప్రమాణం .. " నిన్ను నేను ఎప్పటికీ నీడలా కాపాడతానని భర్త,నీ వెంట నడిచి నీ అడుగులో అడుగవుతాను " అని
భార్య ఒకరికొకరు చేసుకునే బాసలే పెళ్ళికి ఆరంభం..
కానీ ఆ పెళ్ళే ఒక అబద్ధం తో మొదలైతే అప్పుడు పరిస్థితి ఏమిటి??
ఇది ఈ మధ్యే జరుగుతున్న ఓక కేస్ కి సంబంధించిన వివరాలు :
ఈ కేస్ లో జంటకి 2008 లో ఎంగేజ్ మెంట్ అయ్యింది.ఎంగేజ్ మెంట్ రోజు అతని తల్లిదండ్రులు, బంధువులు అందరూ వచ్చి దగ్గరుండి జరిపించారు.. తర్వాత లగ్న పత్రిక రోజున ఒప్పుకున్న కట్నం లో కొంత ఇచ్చి లగ్నపత్రిక రాసుకున్నారు.ఆ లగ్నపత్రిక రాసుకునే రోజు పెళ్ళికొడుకు తండ్రి మీరిచ్చిన కట్నం మాకు సరిపోదు పెళ్లి ఖర్చుల కోసం మరో లక్ష రూపాయలు ఇవ్వమని అడిగారు.దానికి అమ్మాయి తరపు వాళ్ళు మేము ఇవ్వలేము ఇప్పటికి ఒప్పుకున్న వరకు మాత్రమే ఇస్తామని అన్నారు.అప్పుడు పెళ్ళికొడుకు తండ్రి అంత గతిలేని వాళ్ళు ఎందుకు మీకు ఈ సంబంధం అంటూ తిట్టి అవమానకరంగా మాట్లాడారు... పెద్దలు సర్దిచెప్పి లగ్నపత్రిక రాయించుకున్నారు.
పెళ్లిరోజు నాటికి అమ్మాయి వాళ్ళు ఎంత ఎదురుచూసినా,ఫోన్ లు చేసినా ఇదిగో వస్తున్నాము అదిగో వస్తున్నాము అంటూ మాట్లాడుతూనే తీరా పెళ్ళి సమయం మించి పోయిన తర్వాత పెళ్ళికొడుకు ఒక్కడే వచ్చి,మీరు మా నాన అడిగిన డబ్బులు ఇస్తామని ఒప్పుకోకుండా గొడవపడ్డారు అందుకనే మా వాళ్లకి ఈ పెళ్లి ఇష్టం లేక రాలేదు. మీకు అభ్యంతరం లేకపోతె నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నా జాబ్ నాకుంది మీ అమ్మాయిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని పెద్దమనుషులను అడిగాడు. బంధువులందరూ వచ్చి ఉన్నారు. ఎలాగూ పెళ్ళికొడుకు మంచి వ్యక్తిలాగానే ఉన్నాడు.. మంచి ఉద్యోగం చేస్తున్నాడు. సమస్య ఏముందిలే అని పెద్దమనుషులు నచ్చచెప్పటం తో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ పెళ్లి జరిగిపోయింది.
ఎన్నిసార్లు వీళ్ళిద్దరూ అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడాలని ప్రయత్నించినా వాళ్ళు మాట్లాడలేదు... రెండు నెలలు భార్యా,భర్త ఇద్దరూ అబ్బాయి పని చేస్తున్న దగ్గర కలిసి ఉన్నారు.రెండు నెలల తర్వాత అబ్బాయి వాళ్ళ అన్నయ్య వీళ్ళ ఇంటికి వచ్చాడు. పెళ్లి జరిగిన కొన్నాళ్ళ వరకు తన తల్లిదండ్రులు మాట్లాడటం లేదు, తన దగ్గరికి రావటం లేదు అన్న బాధలో వున్న భర్త తన అన్నయ్య రాకతో సంతోషించాడు అలాగే ఈ అమ్మాయి కూడా.. ఇక అప్పటి నుండి ఆ అబ్బాయి తల్లిదండ్రులు, అక్కలు,అమ్మమ్మతాతయ్య,పిన్ని ఇలా అందరూ ఆ అబ్బాయికి ఫోన్ లు చేసి మాట్లాడటం మొదలు పెట్టారు. కానీ ఈ అమ్మాయికి మాత్రం అత్తింటి వారు ఎవరూ ఫోన్ చేయరు,మాట్లాడరు.. కోడలిగా వాళ్ళు అంగీకరించలేదు. దీనికి తోడూ భర్త లో కూడా ఈ అమ్మాయి వలన నావాళ్ళు నాకు దూరమయ్యారు అన్న ఆలోచన మొదలయ్యింది.
అతని బంధువులు ఎవరు ఫోన్ చేసినా,ముఖ్యంగా వాళ్ళ అన్నయ్య ఫోన్ చేసి చెప్పే మాట "నువ్వు జాగ్రత్త ఆ అమ్మాయి నీ డబ్బు కోసం ఆస్తి కోసం మేము రాకపోయినా నిన్ను పెళ్లి చేసుకుంది. వాళ్ళు గతిలేని వాళ్ళు " ఆ అమ్మాయి, తన తరపు వాళ్ళు నిన్ను ఏమైనా చేస్తారు వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళకు, వాళ్ళను నీ ఇంటికి రానివ్వకు అని చెప్పేవాళ్ళు. ఇవే ,మాటలను అతను భార్యను అంటూ నీ వాళ్ళు రావద్దు అంటూ,నువ్వు నా డబ్బు కోసమే మా వాళ్ళు రాకపోయినా నన్ను పెళ్లి చేసుకున్నావు అనటం, మా వాళ్ళు నీ వల్లనే నాకు దూరమయ్యారు లేకపోతె వాళ్లకి నేనంటే చాలా ప్రేమ అంటూ ఈ అమ్మాయిని,తన తరపు వాళ్ళని అనుక్షణం మాటలతో హింసించేవాడు. కొన్నాళ్ళకి నేను మా అన్నయ్య దగ్గర ఉండి జాబ్ చేస్తాను అక్కడే ఉందాము అనటం మొదలు పెట్టాడు. ఇలా గొడవలు పడుతూ ఈ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ నాన్న ల దగ్గర కూర్చుని ఈ అమ్మాయిని అక్కడికి రమ్మన్నాడు సరేనని ఆ అమ్మాయి అత్తగారింటికి వెళ్ళింది.
అక్కడికి వెళ్ళిన అమ్మాయిని తన వాళ్ళ ముందే ఇష్టమొచ్చినట్లు తిట్టి,కొట్టి నాకు మరో 10 లక్షలు కట్నం తీసుకుని వస్తేనే రా అంటూ అందరూ కలిసి బయటికి గెంటేసారు.. ఇదేమని వాళ్ళ పెద్దల్ని అమ్మాయి పెద్దలు అడిగితె "మీతో మాకు సంబందం లేదు మేము పెళ్ళికి రాలేదు" ఇదే వాళ్ళ సమాధానం.ఇలా రెండు సంవత్సరాల పాటూ ఈ అమ్మాయిని పుట్టింట్లోనే వదిలేసి అతను ఎక్కడ ఉన్నాడో చెప్పకుండా అతను, అతని తరపు బంధువులు ఆ అమ్మాయిని పట్టించుకోకుండా వదిలేసారు. పోలీస్ కేస్ పెట్టినా ప్రయోజనం లేదు, పెళ్ళికి వాళ్ళు ఎవరూ రాలేదు కాబట్టి వాళ్ళను మేము అరెస్ట్ చేయము అతనెక్కడో వాళ్లకి తెలియదట అని పోలీసుల సమాధానం.
అప్పుడు ఆ అమ్మాయి తన భర్త ఆచూకీ కోసం హ్యూమన్ రైట్స్ కమిషన్ ను ఆశ్రయించింది. అప్పుడు 498 కేస్ నమోదు చేసారు పోలీసులు. తమ్ముడ్ని ప్రోత్సహించి గొడవలు పెట్టి ,అతన్ని దాచిపెట్టిన అభియోగం కింద ఎంక్వైరీ కి వచ్చిన అతని అన్న చెప్పిన సమాధానం మా తమ్ముడు గత పది సంవత్సరాలుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ ట్రీట్మెంట్ కోసం నేనే నా తమ్ముడిని హాస్పిటల్ లో ఉంచాను ఆ అమ్మాయి కి మేము కావాలనే చెప్పలేదు అని చెప్పాడు.
ఇప్పటికి అతని అన్నని, నాన్నని అరెస్ట్ చేసిన పోలీసులు అసలు నిందితుడు భర్తని మాత్రం మొన్నటిదాకా మానసిక వ్యాధి కోసం ట్రీట్ మెంట్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో తెలియదు అని కేస్ పెండింగ్ లో పెట్టారు...
చట్టం ,న్యాయం ఆ అమ్మాయికి పరిష్కారం కల్పించే సంగతి ఎలా ఉన్నా నైతికంగా ఆలోచిస్తే ఈ విషయంలో తప్పు ఎవరిది ??
కొడుకు గత పది సంవత్సరాలుగా పిచ్చివాడు అని తెలిసి కూడా ఎంగేజ్ మెంట్ చేసి, కట్నం తీసుకుని, పెళ్ళికి రాకుండా తప్పుకోవటం మోసం కాదా ??
పెళ్లి జరిగిన క్షణం నుండీ అతనికి నెగటివ్ ఫెలింగ్స్ కలుగచేసి భార్యా,భర్త విడిపోవటానికి కారణమైన అతని కుటుంబ సభ్యులు పెళ్ళికి రాలేదు కాబట్టి వాళ్ళు ఈ నేరంలో భాగస్వాములు కారా ???
పిచ్చివాడైన కొడుక్కి ఎంగేజ్ మెంట్ ఎందుకు చేసారంటే అతని తండ్రి సమాధానం "ఎంగేజ్ మెంట్ కి రాకపోతే నా కొడుకు మమ్మల్ని చంపుతాను అన్నాడు అందుకే వచ్చాము" అని.. పిచ్చి కొడుకు చంపుతాను అంటే తీసుకెళ్ళి పిచ్చి హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ ఇప్పించాలి కానీ ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తారా??
మేము పెళ్ళికి రాలేదు కదా అప్పుడైనా మానుకోకుండా మీరు పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారు అని అబ్బాయి తల్లిదండ్రుల వాదన.. పెళ్లిరోజు దాక వస్తామని మోసం చేసి,చివరి క్షణం లో రాకుండా మానేస్తే ఆ పెళ్లి ఆగిపోతే
ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి ??
కొడుకును దగ్గర పెట్టుకుని అతని అవసరాలను అన్నిటినీ చూసుకునే తండ్రి కోడలిని మాత్రం నీతో మాకు సంబంధం లేదు, మా ఇంటికి రావద్దు అనటం న్యాయమేనా??
పెళ్లి సమయంలో మా వాళ్ళు రాకపోయినా పర్వాలేదు మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటానని మాటిచ్చి, తర్వాత నీ వల్ల నా కుటుంబం నాకు దూరమయ్యింది వాళ్ళే నాకు ముఖ్యం అంటూ వాళ్ళతో కలిసి పిచ్చి నాటకం ఆడుతున్న ఆ భర్త నుండి, ఈ సమస్య నుండి అమ్మాయికి దొరికే పరిష్కారం ఏమిటి??
అసలు ఈ విషయంలో ఎవరు బాధితులు ?? ఎవరు నిందితులు ??
బ్లాగర్లు ఈ విషయం లో మీ అభిప్రాయాలను తెలియచేస్తారని ఆశిస్తాను...
16 కామెంట్లు:
అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయి బెదిరించాడని నిశ్చితార్థం చేసిన వాళ్లు, వాళ్లను ఇద్దరిని ఎలా విడదీయాలనుకున్నారు ??మరి ఆ అమ్మాయి జీవితం గురించి ఏం ఆలోచించారని అనుకోవాలి?
డబ్బు జబ్బు చేసింది అందరికీ!
వృత్తి రీత్యా మీరు ఎన్నో కేసులని చూసి ఉంటారు. న్యాయ స్థానంలో సాక్ష్యాల ఆధారం తోనే తీర్పులు వెలువడుతుంటాయి. వివాహం చేసుకునేటప్పుడు అతను బాగానే ఉన్నాడు తర్వాత తర్వాత ఆటను చెప్పుడు మాటల వల్ల మారిపోయాడు. మానశిక స్థితి సరిగా లేకపోవడం అనేది ఒక నాటకం.
కొంతమంది ఇంతే! చట్టం కళ్ళు కప్పి న్యాయ స్థానాలని ఏమార్చి.. అలా తప్పించుకుంటారు. నా దృష్టిలో ఇంకా ఆమె ఆ వివాహం పునరుద్దిన్చుకోవాలనుకోవడం అవివేకం. ఆమెకి న్యాయం జరగడం కూడా అసాధ్యం.కొన్ని జీవితాలు అంతే!
కొన్ని జీవితాలు అంతే!
కాదండి...కొన్ని జీవితాలింతే అని సరిపెట్టుకోలెము ఎందుకంటే అమ్మయి జీవితం ఇలా అయితె దాని వల్ల ఆమె వెనకాల ఉన్న వారి జీవితాలు కూడా చిందర-వందర అవుతాయి!మరొ చెల్లి కి మంచి సంబంధాలు కుదరవు అన్నయ్యె ఉంటె అతనికి పెల్లి కుదరదు ఎందుకంటె సమాజం తప్పెవరిదొ చూడదు కాని శిక్ష మాత్రం వెస్తుంది (గుడ్డిగా),సమాజం చెడ్డది కాకపొవచ్చు కాని ఒక పిరికిది,ఈ ఒక్క అమ్మాయి జీవితం మరొ కొన్ని జీవితాల్ని ప్రభావితం చేస్తుంది.
కొన్ని జీవితాలింతే అని సరిపెట్టుకోలెకే సమాజం లొ ఇంకా ఒక రకమైన సంఘర్షణ జరుగుతోంది,సమీప భవిష్యత్తులొ పరిష్కారం దొరకాలని మనస్పూర్థిగా కొరుకుంటున్నా!
నటించె పెళ్ళి కొడుకులు-పెళ్ళి కూతుర్లు కసాయి కంటే కూడా ఘోరం,వారు తమ స్వార్థం కోసం ఒక కుటుంబాన్ని కొన్ని జీవితాల్ని బలితీసుకుంటారు!(కొన్ని కలలని నాశనంచేస్తారు).
"Chinni" గారూ.. మంచి,మానవత్వం ఉన్న మనుషులైతే ఎదుటి వాళ్ళ జీవితాలను గురించి ఆలోచిస్తారండీ కానీ ఇలాంటివాళ్ళకి ఎవరేమైపోయినా కూడా వాళ్ళ స్వార్ధమే ముఖ్యం..
మీ స్పందనకు ధన్యవాదములు..
"kastephale" గారూ.
నిజమేనండీ డబ్బు కన్నా ఏదీ గొప్ప కాదు ప్రస్తుతం..
అలాగే ఇక్కడ డబ్బు ఒక్కటే కాదు మా మాట కాదని పెళ్ళి చేసుకుని,ఏమి సాధిస్తుందో చూడాలి అనుకున్న పెద్దల పంతం కూడా తోడయ్యింది..
మీ స్పందనకు ధన్యవాదములు..
"వనజవనమాలి" గారూ..
మీరు చెప్పింది నిజమండీ పిచ్చి అనేది ఒక నాటకం.. అతనికి,అతని కుటుంబసభ్యులకి
ఇది ఒక ఆట. కాలేజ్ లో ఒక అమ్మాయిని, మొదటి పెళ్ళిలో భార్యని ఇప్పుడు ఈ అమ్మాయిని వరుసగా ఇబ్బందులు పెడుతూ పిచ్చిని అడ్డంపెట్టుకుని తప్పించుకుంటున్న కుటుంబం అది..
వివాహం పునరుద్ధరించుకునే విషయం భర్త గురించి పూర్తిగా తెలియకముందు ఆ అమ్మాయి కూడా అతన్ని కావాలనుకుంది కానీ అతని నాటకాలు అన్నీ తెలిసిన తర్వాత అతన్ని మళ్ళీ భర్తగా అనుకునే అవకాశం లేదు.
మీరన్నట్లు కొన్ని జీవితాలు అంతే అని వీళ్ళని వదిలేస్తే మరెన్నో జీవితాలను వీళ్ళు ఇలాగే నాశనం చేయరన్న నమ్మకం లేదు.. అందుకే వాళ్ళు చేసిన తప్పుకి తగిన శిక్ష పడాలని దానికి తగిన ప్రయత్నం చేయాలని నేను అనుకుంటున్నాను..
మీ స్పందనకు ధన్యవాదములు..
"Narsimha" గారూ..
మీ వ్యాఖ్య నా మనసులో వున్న మాట ఒక్కటే నండీ.. ఏదో జరిగిపోయిందిలే అని వదిలేసే చిన్న సమస్య కాదు కదండీ ఇది. దీని వలన కొన్ని కుటుంబాలే బాధపడాల్సి వస్తుంది..
"సమాజం చెడ్డది కాకపొవచ్చు కాని ఒక పిరికిది"
చాలా బాగా చెప్పారండీ సమాజంలో ప్రతి ఒక్కరికి ఏది తప్పు,ఒప్పు అని తెలుసు కానీ బయటపడి మాట్లాడటానికి భయం..
మీరన్నట్లు ఇలాంటి మనుషులు,సంఘటనలు కొందరి జీవితాలనే కాదు కొన్ని కలలని నాశనంచేస్తారు.. ఎప్పటికీ తీరిపోని నష్టాన్ని కలుగచేస్తారు..
""సమీప భవిష్యత్తులొ పరిష్కారం దొరకాలని మనస్పూర్థిగా కొరుకుంటున్నా""
మంచి మనసుతో మీరన్నట్లు ఈ సమస్యకు మంచి పరిష్కారం దొరకాలని నేను కూడా కోరుకుంటున్నాను..
మీ స్పందనకు ధన్యవాదములు..
అబ్బాయి,అబ్బాయి తల్లితండ్రులు,అమ్మాయి తల్లితండ్రులు అందరూ భాద్యులేనండీ
అమ్మాయి జీవితం మాత్రం చిక్కు ప్రశ్న
సమాధానం త్వరలో లభించాలని ఆశిస్తాను.
ఆ అమ్మాయి ఇక తనకాళ్ళ మీద నిలబడే ప్రయత్నం మొదలుపెడితే మిగిలిన విషయాలకు కాలం సమధానం చెబుతుందేమోనండీ.
" ధాత్రి "గారూ..
ఏ సమస్యనైనా పరిష్కరించటంలో కాలం కంటే పెద్ద మేధావి ఎవరూ లేరని నేను కూడా నమ్ముతానండీ..
ప్రస్తుత పరిష్తితులకి కారణమని ఎవరినో నిందిస్తూ,తను బాధ పడుతూ, తనవారిని బాధ పెట్టటం కంటే మీరు చెప్పినట్లు ధైర్యంగా తన జీవితాన్ని ఇక ముందు ఎలా ఉండాలో నిర్ణయించుకునే శక్తిని,అవకాశాన్ని భగవంతుడు
ఆ అమ్మాయికి ఇవ్వాలని కోరుకుంటాను...
మీ స్పందనకు ధన్యవాదములు..
మానసిక సమస్య మొత్తం కుటుంబానికే ఉన్నట్లుందే...
"జ్యోతిర్మయి" గారూ..
మంచి మాట చెప్పారండీ ఈ సమస్య గురించి ఆ అమ్మాయితో మాట్లాడిన ఫామిలీ కౌన్సిలర్ కూడా ఇదే మాట అన్నారు.. భర్త కంటే ముందు అతని కుటుంబ సభ్యులకి పిచ్చా అని..
మీ స్పందనకు ధన్యవాదములు..
meeru oka lawyer ai undi anno kasulu choosi enthaga spanada pondam chala greate. oka manavathavam kaligina manishiga meeru chala spadana chestunaru. kani kali prabhavam valana elaga garuguthuu vantai. edi oka example
meeru chala baga alochana chestunaru kani kali taluka prabhavam mariyu jatakamlo kala kujadoshim enka akkuvaga prabhavam chooptunai.
" surya " గారూ..
మీ స్పందనకు చాలా థాంక్సండీ...
ఒక లాయర్ గానే కాదు ప్రతి మనిషీ జీవితంలో ఇలాంటివి చూస్తూనే ఉన్నారు.. భర్తల మీద భార్యలు పెట్టే వేధింపుల కేసుల్లో చాలా వరకు మోసపూరితంగానే వుంటున్నాయని అందరూ అనుకుంటున్న ప్రస్తుత కాలంలో ఈ కేస్ కొంచెం బాధ కలిగేలా అనిపించింది.. అందుకే స్పందించాను..
నా పోస్ట్ కి స్పందించి,ఎంతో ఓపికగా సమస్యను చదివి మీరందరూ మీ అభిప్రాయాలను తెలియచేసినందుకు చాలా సంతోషంగా అనిపించింది.
ఇంక మీరన్నట్లు జాతక ప్రభావం నేను కూడా నమ్ముతాను.. అలాగే విధిని కూడా..
మీ స్పందనకు ధన్యవాదములు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి