పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

5, ఫిబ్రవరి 2013, మంగళవారం

ఎక్కడికి " e " పరుగు ఎందుకని " e " ఉరుకు...





ఒకప్పుడు కేవలం ఉత్తరాల ద్వారా,ఫోన్ ల ద్వారా అందుబాటులో ఉండే మానవ సంబందాలు ఇప్పుడు నెట్ ప్రపంచం పరిధిలోకి వచ్చేశాయి .. ఎప్పుడూ టీవీయేనా కాస్త అలా నెట్ ప్రపంచం లో కూడా విహరిద్దాం అని గృహిణులు కూడా అనుకునే రోజులు ప్రస్తుతం..మెయిల్స్,మెసెంజర్స్,చాటింగ్ లు అయిపోయి ఇప్పుడు బ్లాగ్స్, ఫేస్ బుక్ ,ట్వీటర్స్, ఆర్కుట్‌, గూగుల్‌ ప్లస్‌ ఇప్పుడు ఇవే సామాజిక సంబంధాలు (సోషల్‌ నెట్‌వర్క్‌)..   

సోషల్‌ నెట్‌వర్క్‌ అంటే కేవలం ఇవే కాదు మన ఆసక్తులను బట్టి వంటలు,క్రాఫ్టు,పెయింటింగ్స్,ఇంటీరియర్ డెకరేషన్,మన ఆసక్తులను షేర్ చేసుకోవటం, కుటుంబ,ఆరోగ్య  సమస్యలను చర్చించటం ఇలా ఏ  విషయాలను నేర్చుకోవాలంటే వాటి గురించి నిపుణులు, మామూలు గృహిణులు కూడా నిర్వహించే సైట్ లు ఎన్నో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి..ఇలా మనకిష్టమైన వారితో పరిచయం చేసుకుని,అభిప్రాయాలను పంచుకునే  వీలుంటుంది... ఆధునిక పరిజ్ఞానాన్ని, "e " పరిచయాలను ఉపయోగించుకుని కెరీర్ లో కూడా మంచి అవకాశాలను యువత అందుకుంటున్నారు .ఇంకా దేశ  విదేశాల్లో ఉండేవారు కూడా ఎక్కడో దూరాన ఉన్నామన్న ఫీలింగ్ లేకుండా "ఈ"సంబంధాలతో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండటం,కొత్త కొత్త పరిచయాలను ఏర్పరచుకోవటం  కూడా సంతోషించదగిన విషయమే..

బ్లాగ్స్ మన అభిప్రాయాలు,ఆలోచనలు పంచుకోవటానికి చక్కని వేదిక అని నాలాగా చాలా మంది బ్లాగ్స్ రాయటం మొదలుపెట్టారు.కానీ ఈ బ్లాగ్స్  కొందరు చేయి తిరిగిన రచయిత్రులు,రచయితలకే తగినదిగా ఈ మధ్య కాలం లో అనుకుంటున్న తర్వాత బ్లాగ్స్ రాయాలి అంటే ఇతర బ్లాగర్ లాగా మనం రాయగలుగుతున్నామా లేదా ?? 
జనాలకి నచ్చుతుందా  లేదా??   అని ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది.

ఈ మధ్య కాలం లో సోషల్‌ నెట్‌వర్క్‌ లలో ఎక్కువ ప్రజాభిమానం పొందింది మాత్రం ఫేస్ బుక్ అని చెప్పొచ్చు. తమ ఇష్టా ఇష్టాలు,మూడ్స్, అభిప్రాయాలు,ఆలోచనలు ఇలా భావవ్యక్తీకరణకు అనువైన వేదికగా  ఫేస్‌బుక్ మారింది. ఫేస్ బుక్ మొదలై నిన్నటికి 9 సంవత్సరాలు పూర్తయిందట. ఇన్నాళ్ళకి నాకు ఫేస్ బుక్ ఉపయోగించాలన్న ఆలోచన వచ్చింది. నాకు ఫేస్ బుక్ అకౌంట్ మా తమ్ముడు 2009 లోనే తీసినా దాన్ని నేను ఎప్పుడూ ఓపెన్ చేయలేదు. కానీ ఈ  మధ్య  కొత్త సంవత్సరం నేను చేసిన కొత్త పనుల్లో ఫేస్ బుక్ ఉపయోగించటం మొదలు పెట్టటం కూడా ఒకటి.. 

ఫేస్ బుక్ ఓపెన్ ఐతే చేసాను కానీ ఇందులో ఫ్రెండ్స్ గా ఎవరిని యాడ్ చేసుకోవాలి,ఏమి పోస్ట్ చేయాలి ఇవన్నీ ఎప్పుడూ సమస్యే.. పైగా నా క్లోజ్ ఫ్రెండ్స్  లో కానీ తెలిసిన వాళ్ళలో కానీ ఫేస్ బుక్ గురించి ఉన్న ఫీలింగ్ ఏంటంటే "ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ అంటే తప్పకుండా తెలిసిన వాళ్ళే అయి ఉంటారు.. ఆ పరిచయం ఎంత వరకైనా ఉండొచ్చు"  అనే మాటలు విని ఉన్నాను. దాంతో నాకు ఎవరిని ఫ్రెండ్స్ గా యాడ్ చేసుకోవాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి. ఫ్రెండ్ రిక్వెస్ట్ లు చాలానే వస్తుంటాయి.వాటిలో కొన్ని ఫేక్ అకౌంట్స్ కూడా ఉంటాయి.అలాగే  మనకెవరో తెలియని వాళ్ళని వాళ్ళు ఎంత గొప్ప వాళ్లైనా ఫ్రెండ్స్ గా యాడ్ చేసుకోలేము .. అలాగని అందరూ మనకు తెలిసిన వాళ్ళే ఉండరు కాబట్టి నా ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ చాలా వరకు తెలిసిన వాళ్ళు, నా బ్లాగ్ ఫ్రెండ్స్, నాకు ఇష్టమైన రచయితలూ, సింగర్స్ ను ఫ్రెండ్స్ గా యాడ్ చేసుకున్నాను...ఇలా రచయితలు,సింగర్స్ లో కూడా ఫేక్ ప్రోఫైల్స్ ఉంటున్నాయన్నది కూడా తెలిసిందే.. అలాగే మన ఇష్టాలకి, అభిరుచులకి దగ్గరగా ఉండే గ్రూప్స్ లో కూడా మంచి ఫ్రెండ్స్ మనకి దొరకవచ్చు... 

ఇదిలా ఉండగా ఈ మధ్య ఫేస్ బుక్ లో కొందరు వ్యక్తులు మహిళల గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. వాళ్ళని తీవ్రంగా వ్యతిరేకించి వాళ్ళతో క్షమాపణలు చెప్పించి,సైబర్ చట్టాల కింద అరెస్ట్ చేయించి,వాళ్లకి తగిన బుద్ధి చెప్పటం లో సఫలీకృతులయ్యారు మహిళలు... కానీ నాకనిపించింది. "ఈ ప్రపంచంలో చాలామంది మనస్సులో వుండే మాటలే ఆ నలుగురి నోటి ద్వారా బయటికి వచ్చాయి" అని..సమాజంలో గౌరవప్రదమైన స్థానం లో ఉన్నవాళ్ళే చాలామంది బయట ఉద్యోగాల కోసం,ఇంకా ఇతరత్రా వ్యాపకాల కోసం తిరిగే మహిళలు, లేదా ఇలా సామాజిక సంబంధాలు కలిగిన మహిళలు అంటే ఏదో తప్పు చేసే వాళ్ళే అన్నట్లుగా చెప్పుకోవటం ఈ రోజుల్లో సర్వ సామాన్యంగా మారిపోయింది..దీనికి కారణం కొంతమంది  ఆడవాళ్ళ  ప్రవర్తన  కావచ్చు,కొందరు ఆడవాళ్ళ ప్రవర్తన వలన కొందరికి కొన్ని నష్టాలు కూడా కలిగి ఉండొచ్చు. కానీ అందరూ అలాంటి వాళ్ళే అని,అందరూ తప్పు చేసే వాళ్ళే అన్నట్లుగా మాట్లాడటం మాత్రం తప్పు.. వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని మాట్లాడితే ఏదో సినిమాలో చిరంజీవి  "నోరా వీపుకి చేటు తేకే" అని అన్నట్లుగా ఉంటుందనేది ఇప్పటికి చాలా విషయాల్లో అర్దమవుతుంది ..

ఏది ఏమైనా చిన్నప్పుడు వక్తృత్వ పోటీల్లో టీవీ,దాని పుట్టు పూర్వోత్తరాలు, దాని వలన కలిగే లాభాలు అలాగే నష్టాలను కంఠతా పట్టి చెప్పినట్లు మన చుట్టూ ఉన్న ప్రపంచంతో ఉన్న " e  " సంబంధాల విషయం లో అయినా ఏ   సంబంధాల విషయంలో అయినా కూడా వాటి   పరిమితులు, లాభ,నష్టాలను ఎప్పుడూ మనసులో ఉంచుకుని, "అతి సర్వత్ర వర్జయేత్"  అన్న విషయం గుర్తుంచుకుని, మన వల్ల  ఇతరుల జీవితాలకు నష్టం కలగకుండా "నొప్పించక తానొవ్వక" అన్నట్లు  మసలుకుంటే  అందరికీ  మంచిదేమో.. మన పరిధులలో మనం ఉంటున్నాం, మన మనసుకు తెలుసు మనం చేసేది మంచా చెడా అనేది అని ఎంత  అనుకున్నా నైతిక విలువలను, ప్రపంచాన్నిదృష్టి లో పెట్టుకుని ప్రవర్తించాల్సిన అవసరం ఆడవాళ్ళైనా, మగవాళ్లైనా అందరికీ  ఉంటుంది...

మాటలకైనా
చేతలకైనా " హద్దులున్నాయి జాగ్రత్త "అన్నది ప్రతి మనిషీ గుర్తుంచుకోవాల్సిన విషయం 




8 కామెంట్‌లు:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

చాలా చక్కని పోస్ట్ రాజీ గారు. ఎంత చక్కగా వ్రాసారో..తెలుసా!?

ప్రతి విషయం చాలా క్లియర్ గా చెప్పారు. ఏదైనా హద్దుల్లో ఉండటం అవసరం అని చెప్పారు. నిజం.

అభినందనలు.

జయ చెప్పారు...

ఏమోనమ్మా! ఈ ఫేస్ బుక్ నాకస్సలు తెలీదు. రాసుకుంటే ఎప్పుడైనా కొంచెం బ్లాగ్, అప్పుడప్పుడూ ఒకటో అరో ప్లస్సూ...అంతే:)

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

వనజవనమాలి గారూ..
ప్రస్తుతం జరుగుతున్న విషయాలను గమనించి నా మనసుకు అనిపించింది చెప్పేశాను :)

ఈ పోస్ట్ నేను రాసిన విధానం బాగున్నందుకు,
మీకు నచ్చినందుకు,మీ అభినందనలకు థాంక్సండీ..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

జయ గారూ..
నాకు కూడా ఫేస్ బుక్ అంతగా తెలీదండీ ..
కానీ మన బ్లాగర్స్ ముఖ్యంగా ముందుగా వనజవనమాలి గారు ఫేస్ బుక్ లో కనిపించారు అంతే యాడ్ చేసుకుని నేను కూడా ఫేస్ బుక్ చూడటం మొదలుపెట్టాను :)

మీ వ్యాఖ్యకు ధన్యవాదములు..

కమనీయం చెప్పారు...




పూర్వం pen friendships అని ఉండేవి.కొన్ని పరవా లేదుగాని .కొన్ని అవాంచనీయ పరిణామాలకి దారితీసేవి.అలాగే face book కూడా.చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది.ముక్కూమొహం తెలియని వాళ్ళతో స్నేహం మంచిదికాదు.



నవజీవన్ చెప్పారు...

చాల మంచి టపా రాసారు. ఒక రకంగా ఫేస్ బుక్ కన్నా బ్లాగింగ్ కొంచెం బెటర్ అని నా ఉద్దేశం. అయినా ఈ నెట్ బంధాల కన్నా ధృడమైనవా అంటే జవాబు చెప్పలేము. ఒక్క అలవాటు గానో, ప్రవృత్తి గానో నేడు బ్లాగింగ్ చేయడం జరుగుతుంది. నాకు ఈ మధ్యన తెలిసిన విషయం ఏమిటంటే కొన్ని దేశాలలో ప్రొఫెషనల్ బ్లాగింగ్ మొదలు అయ్యిందంట. అంటే మన బ్లాగు లో రాసే అంశాలను పత్రికలు వారి పత్రికల్లో ప్రచురించడానికి మన పర్మీషన్ తీసుకొని కొంత పైకం ఇచ్చి ఆ ఆర్టికల్స్ ప్రచురణకు తీసుకున్తున్నరంతా తీసుకుంటున్నారంట. అలాంటిది ఇండియా లో కూడా ఏదో ఒకటి ప్రారంభిస్తే బాగున్ను..!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"కమనీయం" గారూ.
మీ స్పందనకు ధన్యవాదములు..

మీరు చెప్పింది నిజమేనండీ. మనకు ఎవరో పరిచయం లేని వాళ్ళతో స్నేహం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి..

మీ వ్యాఖ్యకు ఆలస్యంగా స్పందిస్తున్నాను మన్నించండి..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"నవజీవన్" గారూ..

మీరు చెప్పింది నిజమే ఈ బ్లాగింగ్ కానీ, ఫేస్ బుక్ కానీ ఏదో హాబీగానే మాత్రమే కానీ ఇదే లోకం కాదు అని నేను కూడా అనుకుంటాను.
అలాగే మీరు చెప్పిన ప్రొఫెషనల్ బ్లాగింగ్ ఇండియా లో కూడా వస్తే బాగుంటుంది కొందరు చక్కని రచనలు చేసె బ్లాగర్లకు ఉపయోగపడుతుంది కదా...

టపా నచ్చినందుకు,మీ స్పందనకు ధన్యవాదములు...

మీ వ్యాఖ్యకు ఆలస్యంగా స్పందిస్తున్నాను మన్నించండి..

Related Posts Plugin for WordPress, Blogger...