పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

31, డిసెంబర్ 2014, బుధవారం

కమ్మని కలలకు ఆహ్వానం ..




2014 కొన్ని చిన్న చిన్న సమస్యలతో పాటూ వాటిని అధిగమించగల ధైర్యాన్ని,సంతోషాన్ని కూడా ఇచ్చింది. 

కొత్త ప్రదేశాలు,బాధ్యతలు,మనుషులు,పరిచయాలు,స్నేహాలు, 
ఇలా సంతోషంగా ఉన్నప్పుడు కాలం తెలియదు అంటారు కదా..!
అలాగే వేగంగా,హాయిగా వెళ్ళిపోతుంది 2014.

నాకంటూ కొన్ని చిన్న విజయాలను కూడా అందించిన 2014 
నాకు చాలా ప్రియమైనదిగా గుర్తుండిపోతుంది కూడా.. 

రాబోయే 2015 మరింత ప్రియమైనదిగా ఉండాలని కోరుకుంటూ 
2014 కి వీడ్కోలు చెప్తు

కమ్మని కలలకు ఆహ్వానం 
చక్కని చెలిమికి శ్రీకారం 
పలికిన పాటకు నా ప్రాణం 
అంకితం అన్నది నా హృదయం 

Happpy New Year  .. Happpy New Year  


 


THANK YOU 2014 -- WELCOME 2015



29, డిసెంబర్ 2014, సోమవారం

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 14




ఏమి చేయాలో అర్ధం కాలేదు ఇప్పుడు పంతాలు,పట్టుదలలకి పొతే ఎలా? ఎవరో ఒకరి ద్వారా పని చేయించుకోకపోతే నాకే నష్టం. పైగా నాన్న ఎంత కష్టపడితే ఆ చైన్ వచ్చింది? నాన ఎంత డాక్టర్ అయితే మాత్రం డబ్బులు ఊరికే వస్తాయా? నేను నా ఆలోచనతో బాధపడుతూ ఉండగానే అందరూ వాళ్ళ పాటికి వాళ్ళు రెడీ అయ్యి కొత్తగా రిలీజ్ అయిన "ప్రేయసి రావే" సినిమాకి బయల్దేరారు.పెద్ద మాధవ్ వచ్చి ఏంటి మాధవ్ సినిమాకి వస్తావా అన్నాడు. నాకు ఒళ్ళు మండిపోయింది అసలే చైన్ పోయిందని నేనేడుస్తుంటే సినిమాకి పోవాలంట సినిమాకి.!అయినా ఎవడి నొప్పివాడికే బాధ కానీ పక్కవాడికి ఏముంటుంది?


ఇంతలో హేమంత్ వచ్చి సరే మాధవ్ మేము వచ్చేదాకా ఆలోచించుకో నువ్వు వెళ్దామంటే మేము సినిమా నుండి రాగానే మా పిన్ని వాళ్ళింటికి తీసుకెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు.నాకు ఇంక తిండి కూడా తినబుద్ధి కాలేదు.మా నాన్నమ్మ ఎప్పుడూ ఒక మాట అనేది.తప్పని పరిస్థితుల్లో వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడంట.ఇప్పుడు నాకు కూడా వాళ్ళ హెల్ప్ తీసుకోక తప్పదు అనుకుని కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి సిద్ధపడ్డాను. 


సాయంత్రం హేమంత్ వస్తూనే వెళ్దామా మాధవ్ అనగానే సరే పద అని ఇద్దరం బయల్దేరి వెళ్ళాము.వెళ్తున్నానే కానీ కావ్య ఎదురైతే నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూనే ఉన్నాను. ఆ దేవుడు నా మొర విన్నట్లు కావ్య తన చెల్లి,తమ్ముడితో కలిసి సినిమాకి వెళ్లిందట.మేము వెళ్ళగానే ఆంటీ మాధవ్ బాగున్నావా అని పలకరించి టీ ఇచ్చారు. అది తాగేలోపే హేమంత్ విషయం అంతా చెప్పగానే ఆంటీ తన ఫ్రెండ్,CI గారి భార్యకి ఫోన్ చేసింది. అటునుంచి ఆవిడ వెంటనే నేను మా వారితో ఇవాళ చెప్తాను వాళ్ళని రేపు స్టేషన్ కి వెళ్ళమనండి అన్నారట. 


మాధవ్ రేపు స్టేషన్ కి వెళ్తే CI గారు ఆ పనమ్మాయిని పిలిపించి మాట్లాడుతారు.కేస్ పెట్టే పనిలేకుండానే పని అయ్యేలా చేస్తారులే అంది ఆంటీ .నాకు చాలా సంతోషంగా అనిపించింది. అప్పటిదాకా కదిపితే కన్నీళ్లు అన్నట్లుంది నా పరిస్థితి కానీ ఇప్పుడు హమ్మయ్య సమస్య ఒక కొలిక్కి వచ్చింది అనుకున్నాను. ఇంతలో ఆంటీ మాధవ్ మాకు తెలిసినావిడ ఇలా ఎవరివన్నా వస్తువులు పోయినా,ఇంట్లో మనుషులు కానీ పశువులు కానీ కనపడకపోయినా పూజలో కూర్చుని అవి ఎక్కడ ఉన్నాయి,దొరుకుతాయా లేదా అని చెప్తుంది. ఆవిడ దగ్గరికి వెళ్దామా అంది. 


నాకేమి మాట్లాడాలో అర్ధం కాలేదు.అసలే నేను వివేకానంద శిష్యుడిని. ఇలాంటి మూఢనమ్మకాలని ప్రోత్సహించను.కానీ ఇప్పుడేమి చేస్తాం వాళ్ళ సాయం కోరి వచ్చాము కదా తప్పదు అనుకున్నా.. నా మనసులో కూడా ఏమో వెళ్తే ఒకవేళ ఏదన్నా తెలుస్తుందేమో అనే ఆశ కలిగింది.అందుకే అంటారేమో ఏదైనా తనదాకా వస్తే కానీ తెలియదు అని.సరే వెళ్దాం అనుకుని  నేను,ఆంటీ హేమంత్ బయల్దేరి వెళ్ళాము. 

వాళ్ళ ఇల్లు ఆంటీ వాళ్లకి పక్క లైన్ లో ఉంది.మేము వెళ్ళేటప్పటికి అక్కడ జాతకాలు చెప్పే ఆవిడ పూజలో కూర్చుని వుంది.నేనింకా ఎంత పెద్దావిదో అనుకున్నాను.కానీ 25 సంవత్సరాలకి మించని వయసుతో పెద్ద బొట్టు పెట్టుకుని,ఎర్రచీరలో ఎదురుగా అమ్మవారి ఫోటోకి నిమ్మకాయలదండ వేసి ధూపం వేస్తూ పూజ చేస్తుంది.ఆంటీ ఆమె దగ్గరికి వెళ్లి నన్ను చూపించి విషయం చెప్పగానే నన్ను వచ్చి ఎదురుగా కూర్చోమని చెప్పి,కాసేపు కళ్ళు మూసుకుని ప్రార్ధించి .. చైన్ గురించి నీ అనుమానం నిజమే నీ గొలుసు పనమ్మాయె తీసింది కానీ అది నీకింక దొరకదు ఆశ వదులుకో.అలాగే నీ జీవితంలో అందని దానికోసం ఆశపడి చాలా కష్టాలుపడాల్సి వస్తుంది జాగ్రత్త అంది.

నాకేమి మాట్లాడాలో అర్ధం కాలేదు.చాలా బాధ అనిపించింది.అందుకే నేను ఇలాంటివి నమ్మను అనవసరంగా వచ్చాను అనుకుంటూ ఇంకేమీ మాట్లాడకుండా బయటికి వచ్చాను.పాపం ఆంటీ,హేమంత్ కూడా బాధపడ్డారు.రెండో రోజు కాలేజ్ నుండి మధ్యానమే వచ్చి హేమంత్ ని తీసుకుని C I తో మాట్లాడటానికి పొలీస్ స్టేషన్ కి వెళ్ళాము.మేము వెళ్ళేటప్పటికి ఎవరినో వెర్రి కేకలు పెడుతూ వార్నింగ్స్ ఇస్తున్నాడు C I .నాకు అక్కడికి వెళ్ళటమే ఇష్టం లేదు కానీ ఏమి చేస్తాం తప్పని స్థితి. 


అప్పటిదాకా ఆగ్రహంగా ఊగిపోతున్న ఆయన హేమంత్ వెళ్లి ఫలానా అని పరిచయం చేసుకోగానే నవ్వుతూ..ఆ ఆ నిన్న చెప్పారు మీకు పనిమనిషి మీద డౌట్ అంట కదా పిలిపిద్దాం మరి ఏమంటుందో? అంటూ కానిస్టేబుల్ ని పిలిచి మేము చెప్పిన పనమ్మాయి అడ్రెస్ కి పంపాడు. ఒక్క అరగంటలో పనమ్మాయి,ఆమె భర్త స్టేషన్ కి వచ్చారు.అక్కడ మమ్మల్ని చూస్తూనే కొంచెం అనుమానంగా మొహం పెట్టిన వాళ్ళిద్దరూ గొలుసు గురించి C I అడగ్గానే రాముడా దేముడా మేము అల్లాంటి వాళ్ళం కాదు సామీ. ఏదో కులానికి,కూటికి తక్కువోల్లమే గానీ ఇట్టాంటి పాడు పనులు మేమెందుకు చేస్తాం అంటూ ఏడుపు లంకించుకున్నారు. 


వాళ్ళ నాటకం అర్ధం అయిన C I సరే అయితే మీఇష్టం వాళ్ళు మీమీద దొంగతనం కేసు పెడతారంట అనగానే వాళ్ళు వెంటనే పెట్టండయ్యా నేను కూడా పెడతాను నేను కులం తక్కువదాన్నని తిట్టి,హింసించటానికే మీరంతా ఇలా దొంగకేసు పెట్టారని అని ఏడుస్తూ.. మేమేదో వాళ్ళని కులం పేరుతో దూషించినట్లుగా సీన్ క్రియేట్ చేయటానికి సిద్దపడ్డారు.ఆ దెబ్బతో C I గారికి కూడా మాటల్లేవు ఆయనెక్కడ ఇరుక్కుంటాడో అని.పైకి మాత్రం బింకంగా మీరు నిజం చెప్పకపోతే మాకు తెలుసు ఎలా కనిపెట్టాలో తర్వాత పిలుస్తాం రండి అంటూ వాళ్ళని అక్కడి నుండి పంపేశాడు. 

వాళ్ళు వెళ్ళిన తర్వాత చూశావుగా హేమంత్, వాళ్ళు అంతా ప్రీ ప్లాన్డ్ గా ఉన్నారు.ఇప్పటికి ఇలా ఎన్ని చోట్ల చేశారో.. మనం వాళ్ళమీద కంప్లైంట్ రాసి FIR చేస్తేనే మంచిది.లేకపోతే వాళ్ళు మాట వినరు అంటూ ఇంక తనేమి చేయలేనని ఇన్ డైరెక్ట్ గా చెప్పేశాడు .ఏమి చేద్దాము మాధవ్ అన్నాడు హేమంత్..నేనేమీ మాట్లాడలేకపోతున్నాను.కేస్ పెట్టటం ఇష్టంలేదు.ఉన్న ఒక్క ఆశా పోయింది.గొలుసు దొరుకుతుందన్ననమ్మకంపోయింది.ఇంకా ఏమి మిగిలింది మాట్లాడటానికి అనుకుని ఏమీ మాట్లాడకుండా బయటికి వచ్చేశాను.ఏంటి మాధవ్ అలా వచ్చేశావు నీకసలు ఏమీ తెలియదు.పాపం అంకుల్ మనకోసం ఇంత చేశాడు కనీసం థ్యాంక్స్ అయినా చెప్పాలి కదా అంటున్న హేమంత్ ని చూస్తుంటే పిచ్చి కోపం వచ్చింది నాకు. 

ఇంతకీ గొలుసు దొరకలేదు పాడూ లేదు.నాకు మాట్లాడటమే ఇష్టం లేని
కావ్య ఇంటికి తీసుకెళ్ళాడు.మూఢనమ్మకాలని నమ్మని నన్ను ఆ పూజలు చేసే ఇంటికి తీసుకెళ్ళాడు.పోలీసులంటే మంచి అభిప్రాయంలేని, ఇష్టపడని నన్ను దొంగలు,జులాయిలు తిరిగే పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చాడు.ఇంకా ఏమి మాట్లాడాలి వీడితో అనుకుని ఆవేశంగా రూమ్ కి వచ్చేశాను.అనవసరంగా నన్ను నేను వసుదేవుడిలాగా ఊహించుకుని ఈ గాడిదలందరి (అంతే మరి హెల్ప్ చేస్తే దేవుళ్ళు లేకపోతె గాడిదలే ) కాళ్ళు పట్టుకోవటం ఎందుకు? అదేదో గొలుసు పోయిందని ఒక్కమాట మా పెద్దలకి చెప్పి,  తప్పయిందని వాళ్ళ కాళ్ళే పట్టుకుంటే సరిపోతుంది కదా అన్న నిర్ణయానికి వచ్చిన తర్వాత నా మనసు శాంతించింది... 

గొలుసుదొంగ  పనిమనిషి పని మానేసిన తర్వాత కొత్త పనిమనిషిని ఈసారి అన్ని ఎంక్వైరీలు చేసి మరీ పనిలో పెట్టారు. పనిమనిషి లేక ఒక వారం అన్నిటికీ ఇబ్బంది పడ్డ మా రూమ్ మేట్స్ కి అది కూడా నా తప్పులాగే అనిపించింది.వీడు  చైన్ తెచ్చుకోవటమేంటి,అది పోవటమేంటి మనకి ఈ తిండి తిప్పలేంటి అంటూ నాలుగు రోజులు హోటల్లో తిని కనీసం నా చైన్ పోయిందన్న బాధ కూడా లేకుండా నా గురించి మాట్లాడుకున్నారు చాటున.  పోయిన చైన్ పోగా మాటలు కూడా పడాల్సి వచ్చింది ఇంటా బయటా .. అలా నా గొలుసు సరదా మూన్నాళ్ళ ముచ్చట అయ్యింది... 


25, డిసెంబర్ 2014, గురువారం

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 13



హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజులయ్యింది కదా కధ  చెప్పి ... 

ఫంక్షన్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మావాళ్ళు మా కజిన్ భార్య (వదిన) గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్ధం కాలేదు కానీ అక్కడ పరిస్థితులేవో తేడాగా ఉన్నాయనిపించింది.అయినా నాకెందుకులే పెద్దవాళ్ళ విషయాలు అని ఆలోచించటం మానేశాను.నాకు అప్పుడే తెలిసిన ఒక కొత్త న్యూస్ ఏంటంటే అన్నయ్యకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిన సంబంధం అందరికీ నచ్చిందట.నాకు చాలా హ్యాపీ అనిపించింది. అయితే త్వరలో పెళ్ళికి రావచ్చన్నమాట.

దసరా సెలవలు,పండగ హడావుడి,అయిపోగానే మళ్ళీ కాలేజ్ కి వచ్చేశాను. వచ్చేటప్పుడు నాన్నకి చెప్పి వెళ్దామని ఊరికి వెళ్లాను. నాన అవసరమైన డబ్బుతో పాటూ నా చేతికి ఒక గోల్డ్ చైన్ ఇచ్చాడు. నాకేమీ అర్ధం కాలేదు.  అమాయకంగా చూస్తూ ఏంటి నాన్నా ఇది అనగానే నాన్న  నీకే మాధవ్ వేసుకో.. పండక్కి నీకోసం చేయించా అన్నాడు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. అనుకోని గిఫ్ట్ అందుకోవటం ఎవరికైనా సంతోషమే కదా. అప్పటిదాకా అన్నకే కార్ కొన్నాడు కానీ నాకేమీ ఇవ్వడు నాన్నఅని నాన్న గురించి తప్పుగా ఆలోచించినందుకు నా మనసు అపరాధభావంతో  రగిలిపోయింది.

సరేనని కాలేజ్ కి బయల్దేరగానే నాన్నమ్మ జాగ్రత్త నాయనా అంది ..  ఆహా నాగురించి నాన్నమ్మ కి ఎంత జాగ్రత్త అనుకునేలోపే గొలుసు గురించి చెప్తుండా పిల్లకాయలు దొబ్బెయగల్రు జాగ్రత్తగా పెట్టెలో పెట్టుకో తియ్యంగానే  అంది.అంటే జాగ్రత్త నా గురించి కాదా అనుకుని పెద్దది కదా జాగ్రత్త చెప్తుందిలే ఎంతైనా మా నాన్నమ్మ కదా అలా తప్పుగా అనుకోకూడదు అనుకుని నాన్నకి,నాన్నమ్మ కి చెప్పి,వాళ్ళ ఆశీస్సులు తీసుకుని కాలేజ్ కి నా ప్రయాణం మొదలయ్యింది. 

రూమ్  కి వెళ్ళగానే మరొక సర్ ప్రైజ్ మా రూమ్ లోకి కొత్తగా మరో సభ్యుడు వచ్చి చేరాడు. అతని పేరు కూడా మాధవరావ్ అట. ఒకరిని పిలిస్తే ఇద్దరం పలికే ప్రమాదం ఉండటంతో నేను కొంచెం పొట్టిగా,అతను  కొంచెం పొడుగ్గా ఉన్నాడని నన్ను చిన్న మాధవ్ అతన్ని పెద్ద మాధవ్ అని పిలిచే నిర్ణయం జరిగింది.అదేంటో నన్ను చిన్నపిల్లోడని ఎవరన్నా నాకేమీ బాధ అనిపించదు ఎందుకంటే మా ఇంట్లో కూడా మా పెద్దలందరిలో నేనే చిన్న పిల్లోడిని కదా అందుకని . 

ఆరోజుకి  రెస్ట్ తీసుకుని తెల్లారగానే మా నాన ఇచ్చిన చైన్, మా అన్న కొన్న కొత్త బట్టలు వేసుకుని మరీ హుషారుగా కాలేజ్ కి బయల్దేరాను..కాలేజ్ ఎప్పటిలాగే మొదలయ్యింది. కావ్య కోసం నా కళ్ళు వెతికాయి కానీ కనపడలేదు.కనపడకపోతే పోనీ.. అయినా తనతో నాకెందుకు నన్ను అంత  అవమనించాక కావ్య ఏమన్నా మా పెద్దలా ఎంత అవమానించినా దులిపేసుకుని పోవటానికి. ఇంట్లో వాళ్ళు ఎంత అవమానం చేసినా భరిస్తాం వాళ్ళు మన దేవుళ్ళు కాబట్టి.. కానీ బయటి వాళ్లకి ఏమి హక్కు ఉంది అనుకుని అప్పటికి కావ్య విషయం మర్చిపోయాను. 

కాసేపటికే ఫ్రెండ్స్ తో క్లాస్ కి వచ్చిన కావ్య నన్ను చూడగానే పలకరింపుగా నవ్వింది.ఆమె నవ్వగానే నేను నవ్వాలా? మొహం పక్కకి తిప్పుకున్నాను.పాపం కావ్య ఫీల్ అయినట్లుంది. ఫీల్ అయితే అవ్వనీ నాకేంటి? లంచ్ టైమ్ లో కూడా కావ్య నన్ను చూడగానే మాధవ్ మాధవ్ అని పిలుస్తున్నా  వినపడనట్లు వెళ్ళిపోయాను.లేకపోతే  నన్ను పట్టుకుని పక్కన అమ్మాయి పర్స్ దొంగతనం చేయమంటుందా?

ఆరోజంతా కావ్య నన్ను పలకరించాలని చూసినా నేను మాట్లాడలేదు.ఇలాగే వారం గడిచిపోయింది.కావ్య కూడా రెండు రోజులు నన్ను మాట్లాడించాలని  ప్రయత్నించి తర్వాత మానేసింది. ఆరోజు ఆదివారం రూమ్ లోనే పడుకుని10 అయినా బద్ధకంగా లేచి ఫ్రెష్ అయి వచ్చి నా డెస్క్ లో చూసేసరికి అన్నీ ఉన్నాయి కానీ నా చైన్ కనపడలేదు.ఒక్కక్షణం గుండెఆగినట్లు అనిపించింది.పిచ్చివాడిలాగా రూమ్ లో, బాత్ రూమ్ లో, నా పెట్టెలో చివరికి ఇల్లంతా వెతికినా చైన్ కనపడలేదు. 

మా నాన్నమ్మ మాటలు గుర్తొచ్చాయి.ఎంత జాగ్రత్త చెప్పింది,పాపం నాన్న ఎంత ప్రేమగా చేయించాడు నాకోసం.. కన్నీళ్లు పొంగుతున్నాయి. రూమ్ మేట్స్ ,కొత్తగా వచ్చిన పెద్ద మాధవ్ అంతా కంగారుగా వెతికారు.దొరక్కపోతే వాళ్ళ మీద కూడా అనుమానం వస్తుందని భయపడ్డారు అందరూ. అయినా మాధవ్ జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా.. ఇప్పుడు ఎవరినని అడుగుతావు నువ్వు అన్నాడు హేమంత్. అందరం కలిసి మాట్లాడాక మా అనుమానం వంటపని,ఇంట్లో పని ఒక్కతే చేసే పనమనిషి మీదకి మళ్ళింది.కానీ అడిగితె చెప్తుందా? 

మా  అనుమానం నిజం చేస్తూ రెండో రోజు పనిమనిషి పనికి రాలేదు. ఆరోగ్యం బాగాలేదు రెండురోజులు పనికి రానని వాళ్ళాయనతో కబురు చేసింది. ఇప్పుడు మా అనుమానం నమ్మకంగా మారింది.ఇప్పుడేమి చేయాలి?నాన్నతో
చెప్తే ఇప్పటికే నన్ను ఏమీ తెలియని,లోకజ్ఞానం లేని వెఱ్రిపీనుగ అనుకుంటున్నారు ఇంట్లో అందరూ..  ఇప్పుడీ విషయం తెలిస్తే ఇంకేమన్నా ఉందా? అందుకే నేనే సొంతగా ఈ  ప్రాబ్లెమ్ సాల్వ్ చేయాలని డిసైడ్ అయ్యాను. 

నా బాధ చూసిన హేమంత్ టౌన్ సి.ఐ గారి భార్య,మా పిన్నిమంచి ఫ్రెండ్స్ తన దగ్గరికి వెళ్తే కంప్లైంట్స్,కేసులతో పనిలేకుండా ఈజీగా పని అవుతుంది ఏమంటావు మాధవ్  అన్నాడు.. హేమంత్ పిన్ని అంటే కావ్య వాళ్ళ అమ్మ. 
రెండురోజుల క్రితం దాకా కావ్య  పలకరించినా పలక్కుండా తిరిగిన నేను ఇప్పుడు కావ్య వాళ్ళమ్మని హెల్ప్ అడగాలా .. దేవుడా ఎందుకు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు తెస్తావు ?? 


21, డిసెంబర్ 2014, ఆదివారం

హైదరాబాద్ పుస్తక ప్రదర్శన 2014




హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ఈ నెల 17 న మొదలయ్యింది. పుస్తకాలంటే మా ఇంట్లో అందరికీ ఆసక్తే కాబట్టి చూసి,కొని వద్దామని బయలుదేరాము. ఈ పుస్తక ప్రదర్శనని  పుస్తక ప్రదర్శన కాదు పుస్తకాల సముద్రం అనాలేమో .. ఢిల్లీ,కోల్ కతా నగరాల తర్వాత  అతిపెద్ద పుస్తక ప్రదర్శన ఇదేనట. తిరిగే ఓపిక, కొనే ఓపిక ఉండాలే కానీ లేని పుస్తకం అటూ లేదేమో అనిపించేన్ని ఎన్నో పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి.


 ప్రవేశ టికెట్  ఒకరికి 5 రూపాయలు.ఈ టికెట్ పోయిన సంవత్సరం లేదట. ఈ సంవత్సరమే పెట్టారని ఎవరో జర్నలిస్ట్ అడిగితే  చెప్తున్నారు అక్కడి వాళ్ళు. 


తెలుగు,హిందీ,ఇంగ్లీష్,కన్నడం,తమిళం,మలయాళం ఇలా అన్ని భాషలకు సంబంధించిన సాహిత్యం, భాగవతం, భారతం లాంటి గ్రంధాలతో పాటూ సచిన్, మలాలా ఆత్మ కధలు , పిల్లలకు కావాల్సిన పుస్తకాలు,రకరకాల రైమ్స్ CD లు,GK బుక్స్ , దేశ విదేశాలకు సంబంధించిన వంటలు, ఇలా ఇంకా నాకు తెలియనివి చాలానే ఉండి  ఉంటాయి.. 


Asia Law House వాళ్ళ స్టాల్ బాగుంది.సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి కృష్ణ అయ్యర్ గారి పుస్తకాలు చాలా ఉన్నాయి ఇక్కడ. 




 పుస్తక ప్రదర్శన లో ఈసారి ఒక  విశేషం బ్లాగ్,ఫేస్ బుక్ ఫ్రెండ్స్  
తమ రచనలతో ఏర్పాటు చేసిన స్టాల్... 



బ్లాగ్స్ లో ఫేస్ బుక్ లో తెలిసిన మాలా కుమార్ గారు, ఇంకా కొంతమంది రచయిత్రులు రాసిన "తండ్రి, తనయ"  పుస్తకం కొన్నాను. రైటర్ కన్నెగంటి  అనసూయ గారు,బ్లాగర్,రైటర్ జ్యోతి,జ్ఞాన ప్రసూన గారు వారి పుస్తకాలను  గురించి చెప్పారు. 

ఓషో -- మహిళ
మహిళ గురించి ఏమి రాశారో తెలుసుకోవాలని 
ఈ పుస్తకం కొన్నాను.


 పెద్దల కోసం వంటల పుస్తకాలు 


 పిల్లల కోసం కార్టూన్స్,cd లు 



రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రచురణ సంస్థలు,ప్రజలు  ఈ ప్రదర్శనలో పాల్గొన్నా ప్రదర్శన అంతా తెలంగాణా ఆనవాళ్ళు,సాంస్కృతిక చిహ్నాలతో తెలంగాణా వైతాళికుల పేర్లు,చిత్రాలతో ఏర్పాటు చేసిన వేదికలు,ద్వారాలతో మొత్తానికి పుస్తకాల ప్రదర్శన అంతా  తెలంగాణా సాంస్కృతిక అస్తిత్వ ప్రదర్శనగా కళ కళ లాడుతుంది... 

పుస్తక ప్రపంచంలో ఎంత సేపు విహరించినా విసుగు రాలేదు. కానీ కాళ్ళ నొప్పులతో ఆగిపోవాల్సి వచ్చింది. ఇవీ "హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2014" విశేషాలు.

6, డిసెంబర్ 2014, శనివారం

OH My God - Act Of God


Act of God

An event that directly and exclusively results from the occurrence of natural causes that could not have been prevented by the exercise of foresight or caution; an inevitable accident.

మనిషి ముందు చూపుతో కనిపెట్టలేని,ముందు జాగ్రత్తతో ఆపలేని సంఘటనలని,ప్రమాదాలని ఉదాహరణకి వరదలు,భూకంపాలు,సునామీ  లాంటి అనేక ప్రకృతి వైపరీత్యాలని  Act Of God అంటారు. ఇన్సూరెన్స్ కంపెనీలు నష్టపరిహారం చెల్లించకుండా తప్పుకోవటానికి కొన్ని సందర్భాల్లో  "Act Of God"  Law ని  ఉపయోగిస్తుంటారు. 

ఈ  Act Of God గురించి తీసిన హిందీ సినిమా "OH My God". పరేష్ రావల్, అక్షయ్‌కుమార్, సోనాక్షి సిన్హా, మిథున్ చక్రవర్తి  నటించిన ఈ సినిమాలో  పరేష్ రావల్ (కాంజీలాల్ మెహతా )పరమ నాస్తికుడు. ముంబయి చోర్ బజార్ లో  దేవతా మూర్తులు,పూజా సామగ్రి అమ్మే ఒక వ్యాపారి.  దేవుడంటే నమ్మకం లేకపోయినా దేవుడికి సంబంధించిన సామాగ్రిని భక్తులకు తనకి ఇష్టమైన ధరలకు అమ్ముతూ ఉంటాడు. దేవుడే లేడని దైవభక్తిని, భక్తులను ఎగతాళి చేస్తుంటాడు. అతని భార్య సుశీల దైవభక్తురాలు. 

కృష్ణాష్టమి రోజు పరేష్ రావల్ కొడుకు  ఉట్టి కొట్టే ఫంక్షన్ లో ఆడటం చూసి అక్కడికి వెళ్లి కొడుకుని ఆపి,పక్కనే ఉన్న మైక్ లాక్కుని అన్ని ఆలయాల్లో కృష్ణుడు పాలు,వెన్న తాగుతున్నాడని ,ఒక్క గంట మాత్రమే ఈ అవకాశం  ఉంటుందని చెప్పగానే అప్పటిదాకా అక్కడున్న జనమంతా ప్రసంగం చెప్తున్న స్వామీజీని ,ఉట్టిని వదిలేసి కృష్ణుడి మందిరాలకి పరుగులు తీస్తారు. దీంతో ఆగ్రహించిన స్వామీజీ నిన్ను దేవుడు శిక్షిస్తాడని శపిస్తాడు. ఇలాంటి శాపాలకి భయపడనని ఇంటికి వచ్చిన కాసేపటికే చోర్ బజార్ లో భూకంపం  వలన పరేష్ రావల్ షాప్ ఒక్కటే కూలిపోయిందని టీవీలో న్యూస్ వస్తుంది. 

భార్యా.బంధువులు అందరు నువ్వు దేవుడిని ఎగతాళి చేసినందుకు ఆ శాపం వలనే ఇలా అయ్యిందని తిడుతూ బాధ పడుతున్నా అవేమీ లెక్క చెయ్యకుండా కూలిపోయిన శిధిలాల్లో ఇన్సూరెన్స్ పాలసీ వెతికి తీసుకుని ఇన్సూరెన్స్ ఆఫీస్ కి వెళ్ళిన పరేష్ రావల్ కి అక్కడ ఆఫీసర్ భూకంపం Act Of God వలన అయ్యింది కాబట్టి కంపెనీ  నష్టపరిహారం ఇవ్వదు  అంటాడు.  పరేష్  రావల్ లో అప్పటిదాకా లేని భయం,బాధ కనపడుతుంది.ఇన్సూరెన్స్ ఆఫీసర్ ని చితక్కొట్టి,నాలో కూడా దేవుడే ఉన్నాడు కదా దేవుడే కొట్టాడనుకో అని చెప్పి వచ్చేస్తాడు.

ఇంటికి వచ్చాక బాగా ఆలోచించి ఈ నష్టం దేవుడి వలన జరిగింది కాబట్టి దేవుడి మీద కోర్టులో దావా వేస్తానని కోర్టుకి వెళ్తాడు. అక్కడ లాయర్లు ఇతని వింత మాటలు విని మావల్ల  కాదంటూ పారిపోతారు. అప్పుడు లాయర్ ఓంపురి ఈ కేస్ నేను చేస్తానని దేవుడికి ప్రతినిధులుగా చెప్పుకునే కొందరు ప్రముఖ స్వామీజీలకి నోటీస్ లు పంపుతాడు.దేవుడు మాతో మాట్లాడతాడు, మాకు భగవంతుడికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు కాబట్టి భగవంతుడి తరపున నష్టపరిహారం కూడా మీరే చెల్లించాలని తన కేస్ తనే వాదించుకుంటాడు పరేష్ రావల్ . 

ఇతని ఆరోపణలు సమంజసమేనని భావించిన జడ్జ్ కేస్ విచారణకి స్వీకరించగానే ఇలాగే Act Of God వలన నష్టపోయిన వాళ్ళందరూ కూడా కోర్టుకి వెళ్తారు. దీంతో  స్వామీజీలు,మాతలు,అన్ని మతాలకు చెందిన మతాధిపతుల ఆగ్రహానికి గురవతాడు. వారి భక్తులు ఆగ్రహంతో   పరేష్ రావల్ మీద దాడి చేస్తారు.సరిగ్గా సమయానికి అక్షయ్ కుమార్ వచ్చి ప్రమాదంలో ఉన్న పరేష్ రావల్ ని తన బైక్ మీద ఎక్కించుకుని కాపాడతాడు. ఇంటిమీదకి కూడా వెళ్లి భార్యా బిడ్డల మీద కూడా దాడి చేయటంతో అతన్ని వదిలి అందరూ వెళ్ళిపోతారు. 

చివరికి ఒంటరిగా మిగిలిన పరేష్ రావల్ ఇంటికి కృష్ణ వాసుదేవ్ యాదవ్ (అక్షయ్ కుమార్) గా వచ్చిన గోపాలుడు (భగవంతుడు)నాస్తికుడైన పరేష్ రావల్ తో భగవద్గీత, ఖురాన్, బైబిల్ అన్నీ చదివించి భగవద్గీతలోని  సృష్టించేదీ భగవంతుడే ,నాశనం చేసేది భగవంతుడే అన్న మాటతో కోర్టు కేస్ గెలిపిస్తాడు.. 

భగవంతుడు ప్రతి మనిషిలో ఉంటాడు కానీ మేమే దేవుడి ప్రతినిధులమని చెప్పుకుని,దేవుడి పేరుతో వ్యాపారం చేస్తూ, విలాసాలని అనుభవిస్తున్న స్వామీజీలు,బాబాలు ఇప్పడు లోకంలో దేవుడి కంటే ఎక్కువయ్యారు. అలాంటి వాళ్ళ గురించి,వాళ్ళని గుడ్డిగా నమ్మి,నష్టపోయే జనం గురించి సంధించిన వ్యంగ్యాస్త్రమే ఈ సినిమా.  కొన్ని విషయాలు వాస్తవానికి విరుద్దంగా ఉన్నా కాసేపు సరదాగా చూడటానికి బాగుంది,దేవుడిని నమ్మే భక్తులకు సంతోషం కలిగిస్తుందీ సినిమా. 

దైవారాధన, మానవశక్తి రెండు కలిస్తేనే కార్యసాధన సాధ్యమంటాడు భగవంతుడు.  ఏ కులమైనా,మతమైనా భగవంతుడు ప్రతి మనిషిలోనూ ఉంటాడు.తన భక్తులైనా కాకపోయినా ఈ భూమి మీద జీవరాశి నంతటినీ కాపాడేది భగవంతుడే.. నమ్మిన వారిని వెన్నంటి కాపాడే సర్వాంతర్యామి సర్వకాల సర్వావస్థల్లోనూ  ఏ రూపంలోనైనా అవతరిస్తాడని భక్తుల నమ్మకం.ఆ భగవంతుడి మరో రూపం ఈస్వామీజీలు, గురూజీలే  ఐతే అందరికీ మంచిదే. 

అలాగే ప్రకృతి వైపరీత్యాలు Act Of God అని అనకూడదేమో ఎందుకంటే మనిషి తన అవసరాల కోసమో,స్వార్ధం కోసమో చేస్తున్న కొన్ని పనుల కారణంగానే ఈ భూకంపాలు, సునామీలు, వరదల లాంటి భీభత్సాలు సంభవిస్తున్నాయని, దేవుడికి భక్తుడికి మధ్య ఉండాల్సింది భక్తి అనే వంతెన మాత్రమే కానీ బాబాలు, స్వామీజీలు,గురువులనే దళారులు కాదు అనేది  అందరూ అంగీకరించాల్సిన నిజం...  

ఇది సినిమా కాబట్టి సరిపోయింది కానీ నిజంగా దేవుడి ప్రతినిధులమని చెప్పుకునే కొందరు స్వామీజీలని చిన్న మాట అన్నా తట్టుకోలేని వారి అతి విదేయ భక్తులు,శిష్యులు  చాలా మందే  ఉంటారనుకుంటాను. ఇప్పటి రోజుల్లో అలాంటి స్వామీజీలు, గురువులని ఈ సినిమాలో లాగా చేస్తే "అనుకోకుండా ఒకరోజు" సినిమాలో ఛార్మి లాగా "నీడల్లే తరుముతు ఉంది" అని పాడుకోవాల్సి వస్తుందేమో.. 

ఇంతకీ ఇప్పుడు ఈ సినిమా ఎందుకు గుర్తొచ్చిందంటే తెలుగులో  కూడా వెంకటేష్,పవన్ కళ్యాణ్ హీరోలు గా "గోపాలా గోపాలా" పేరుతో ఈ సినిమా రాబోతుంది. మన సినిమా ఎలా ఉంటుందో త్వరలోనే  చూద్దాం .. 


'వసతి వాసయతీతి వా వాసుదేవః'  
మనలో తానుగా ఉండేవాడూ,తాను మనలో ఉన్న కారణంగా 
మనల్ని జీవించి ఉండేలా చేసేవాడు ఆ భగవంతుడే.. 




21, నవంబర్ 2014, శుక్రవారం

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 12




అప్పట్లో ఇప్పటిలాగా దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు ఇళ్ళలో పూజలు అంతగా చేసేవాళ్ళు కాదు.. ఒక్క దసరా మాత్రం బాగా జరుపుకునే వాళ్ళం. నాకు తెలిసి, గుళ్ళలో మాత్రం అలంకారాలు చేసేవాళ్ళు. నేను కాస్త దేవుడి పూజలకి దూరంగానే ఉంటాను. దసరా రెండు రోజులుందనగా పద్మాక్షి వదిన వచ్చింది మా ఇంటికి. ఆ రోజు మా అన్న (వదిన భర్త కాదు,మా సొంత అన్న)కూడా ఇంట్లోనే ఉన్నాడు. అన్న మంచి ఉత్సాహంగా ఉన్నాడు ఏమిటో మరి సంగతి అనుకున్నాను. 

కాసేపటికి మాటల్లో అర్ధం అయిన సంగతి ఏమిటి అంటే మా వదినకి నాట్యం, సంగీతం అన్నిటిలో ప్రవేశం ఉందట. ఇంటికే టీచర్ ని పిలిచి తనతో పాటూ వాళ్ళమ్మాయి సౌమ్య కి,ఇంకా ఆసక్తి ఉన్న చుట్టుపక్కల వాళ్లకి డాన్స్, సంగీతం నేర్పుతుందట. అందులో భాగంగానే ఇంట్లోనే డాన్స్&మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ ఉండేలా కొత్త ఇల్లు కట్టించారు.ఆ ఇంటి గృహప్రవేశంతో పాటే ఒక సంగీతకార్యక్రమం కూడా ఏర్పాటు చెయ్యాలని, ఎలాగు గృహప్రవేశానికి వచ్చిన బంధువులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ ముందు తన కళ  ప్రదర్శించాలన్న ఆమె కల కూడా తీరుతుందని వదిన ఆలోచన. 

భార్య ఇష్టాన్నే తన ఇష్టంగా  ప్రేమించి,ప్రోత్సహించే ఆమె భర్త నుండి కూడా అంగీకారం రావటం ,దానికి కావాల్సిన ప్రయత్నాలను ఆయన చేయటం కూడా జరిగిపోతున్నాయి.ఇంతకీ ఇక్కడ నాకు తెలియని ట్విస్ట్ ఏంటంటే మా సొంత అన్న.. వదిన వాళ్ళింట్లో సంగీతం నేర్చుకుంటున్నాడట..! అందులో భాగంగా రేపటి కార్యక్రమం లో మా అన్న కూడా వదినతో పాటూ తన కళ ప్రదర్శించబోతున్నాడు. ఈ మాట వినగానే ఆహా.. మా అన్న ఎంతైనా మేధావి, అరవైనాలుగు కళల్లో ఒక్కటేమిటి అన్నీ నేర్చుకోగల సమర్ధుడు.  కానిదే ఒక పక్క జాబ్ చేస్తూనే సంగీతం నేర్చుకున్నాడా .. ఇలాంటి అన్న నాకున్నందుకు ఎంతైనా గర్వించాల్సిందే అనుకున్నా మనసులో .

ఎదురు చూసిన రోజు రానే వచ్చింది దసరా రోజు పద్మాక్షి వదిన వాళ్ళింటికి అన్న తన కొత్త కారులోన అమ్మని, అమ్మమ్మని,ఇద్దరు అక్కల్ని తీసుకెళ్ళి , చిన్న కారు కదా అందరం సరిపోమని నన్ను తన బైక్ మీద రమ్మన్నాడు మా తాతతో ( అమ్మ వాళ్ళ నాన్న) పాటూ.. అలాగే అందరం వదిన వాళ్ళింటికి చేరుకున్నాము.వదిన వాళ్ళ ఇల్లు అధునాతనంగా, చక్కని ఫర్నిచర్ తో తన అభిరుచికి తగినట్లుగా కట్టుకున్నారు.బెడ్ రూమ్ లు,పెద్ద హాలు చుట్టూ కాంపౌండ్, అప్పటికే నాటినట్లు బాగా బ్రతికి,పచ్చగా పెరిగిన మొక్కలు,ఇంటి ముందు లాన్,అన్నిటికన్నా ఆశ్చర్య పరిచేది మొదటి అంతస్తులో గదులేమీ లేకుండా పెద్ద హాల్ లో ఒక పక్కన డాన్స్, సంగీతం నేర్చుకోవటానికి, ఎప్పుడన్నా  ప్రదర్శనలివ్వటానికి వీలుగా స్టేజ్ కట్టించి, చూడగానే నృత్యమందిరం అనిపించేలాగా ఇంటీరియర్ డెకరేషన్ చేయించారు .


వదిన అభిరుచికి హ్యాట్సాఫ్ అనాలనిపించేలా ఉంది ఇల్లు. ఎన్ని ఆస్తులున్నా అనుభవించే అదృష్టం కూడా ఉండాలన్నట్లు.. ఇల్లు కట్టిస్తే డబ్బులు వడ్డీ దండగని,ఇప్పటికీ తాతల కాలంనాటి మట్టిమిద్దె లో ఉండే అమ్మమ్మ, మంచి బెడ్ రూమ్ లు ఉండే ఇల్లు కొందామా నాన్నా అంటే తక్కువ రేటుకి వస్తుందని ఆ చివర చూస్తె ఈ చివర కనిపించేలా 4 బారు గదులున్న ఇల్లు కొని ఆ ఇళ్ళని అద్దెలకి ఇచ్చేసి, నాన్నమ్మ పేర్తో ఒక రైతు దగ్గర కొన్న ఇందిరమ్మ ఇంట్లో ఉంటాములే .. మీరందరూ ఇప్పుడు వేరే వేరే చోట్ల ఉంటున్నారు కదా అంత  ఇల్లు మాకెందుకు అంటాడు నాన్న.. ఇప్పటిదాకా అలాంటి ఇళ్ళనే చూసిన మా వాళ్లకి సిటీలో ఆధునాతనంగా ఉన్న ఈ ఇల్లు చూసి ఆశ్చర్యం,ఆవేదన,అసూయ లాంటి భావాలన్నీ ఒకేసారి వచ్చాయి. 


కొంతమంది మనుషుల సహజ లక్షణం వాళ్ళ కంటే బాగున్నవాళ్ళని, సంతోషంగా ఉండే వాళ్ళని చూసి ఓర్చుకోలేక,అసూయతో వాళ్ళని ఏదో ఒకటి అనేసి కడుపుమంట చల్లార్చుకుంటారు.ఇప్పుడు మా వాళ్ళు కూడా అదే పనిలో ఉన్నారు. ఊర్లో మనకన్నా ఎక్కువ ఆస్తులేమీ లేవు సంపాదన ఎంతుంటుందో ఇంత ఇల్లు కట్టాడు ఎలా వచ్చిందో అంత డబ్బు అంటూ అమ్మ,అమ్మమ్మ ,అక్కలు మొదలుపెట్టారు రహస్య పంచాయితీ. అమ్మో మాటలే రానట్లుందే అమ్మ కూడా బయటి వాళ్ళనేసరికి చిన్నగా తనకి తోచిన మాటలు అందిస్తుంది మా అమ్మమ్మకి, అక్కలకి.నాకెందుకో వీళ్ళు అలా మాట్లాడటం నచ్చలేదు. కానీ ఏమి చేస్తాం ఎంతైనా "నా పెద్దలు కదా..  దైవంతో సమానం.  వాళ్ళని ఏమీ అనకూడదు". 

భోజనాలు అయ్యాయి.మా వాళ్ళు "కడుపుమంట"తో సరిగా తిన్నారో లేదో పాపం.. ఇంతలో అసలు కార్యక్రమం మొదలయ్యింది.మా కజిన్ వదిన, మా సొంత అన్న,వాళ్ళ మ్యూజిక్ ట్రూప్ సినిమాలో కచేరీ సీన్ లో చూపించినట్లు  స్టేజ్ ఎక్కి పక్క పక్కన కూర్చున్నారు."సరిగమలు.. గలగలలు .. ప్రియుడే సంగీతము ప్రియురాలే నాట్యము" పాట  వదిన పాడుతుంటే మా అన్న ఫ్లూట్ వాయిస్తున్నాడు. మా అన్న అని చెప్పటం కాదు కానీ తెల్లని లాల్చీ పైజమా వేసుకుని సాగరసంగమంలో కమల్ హాసన్ లా ఉన్నాడు.  

వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే నాకు "ఇది కధ కాదు" సినిమాలో శరత్ బాబు, జయసుధ .. సరిగమలు .. గలగలలు అని పాడుతున్నట్లు,"సాగరసంగమం" లో జయప్రద, కమల్ హాసన్ నాద వినోదము నాట్యవిలాసము అని పాడు తున్నట్లు అనిపించింది. నా మొహం.. పెళ్ళైన వదినతో అన్నకి ఈ పోలిక పెట్టటం బాలేదు కానీ అక్కడ సీన్ అలా వుందని నా భావం .. ఏమి చేస్తాం నాకలా గుర్తొచ్చింది అంతే.. 

నేను బాగానే ఎంజాయ్ చేస్తున్నాను కానీ మా వాళ్లకి ఎందుకో నచ్చినట్లు, సంతోషంగా ఉన్నట్లు అనిపించలేదు. ఎప్పుడూ  ఎవర్నో ఒకర్ని కదిలించుకోకపోతే నిద్రపట్టదు కదా నాకు..  నా పక్కనే కూర్చున్న చిన్నక్కని చిన్నగా కదిపాను.అక్కా వాళ్ళిద్దరి ప్రొగ్రామ్ చూస్తే నీకేమనిపిస్తుంది అన్నా..  నాకొచ్చిన మహత్తరమైన ఆలోచన తనకి వచ్చిందా లేదా తెలుసుకుందామనే ఉత్సాహంతో.. చిన్నక్క నాకేసి ఒకసారి చూసి ఆ... నీకేమనిపించిందో చెప్పు ముందు అంది. మనకసలే కడుపులో ఏమన్నా ఉంటే (విషయాలు) బయటికి కక్కిందాకా మనసుకి శాంతి ఉండదు కదా.. 

నాకనిపించిన జయసుధ,శరత్ బాబు,జయప్రద,కమల్ హాసన్ గురించి చెప్పగానే అక్క నన్ను చీదరగా చూసి నీ మొహమేమి కాదు నీ పోలికలు..  నువ్వు అంది. ఓహో పెళ్ళైన వదినతో అన్నకి ఆ పోలిక పెట్టటం అక్కకి నచ్చినట్లు లేదు. అందుకే అలా అంది ఎంతైనా ఆడవాళ్ళు కదా తోటి ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే ఇష్టపడరులే అనుకునేలోపే చిన్నక్క పక్కనే కూర్చున్న పెద్దక్కని పిలిచి నేను చెప్పిన విషయం అక్కకి చెప్పి ఈయన గారికి ఆయన గారిని చూస్తే కమల్ హాసన్ గుర్తోచ్చాడట .. నాకైతే "శృతిలయలు" సినిమాలో రాజశేఖర్, జయలలిత "తెలవారదేమో స్వామీ" పాట గుర్తొస్తుంది అన్నది.ఆ సినిమాలో జయలలిత, రాజశేఖర్ అంత  బాగుంటారా??  నేనా సినిమా చూడలేదే అన్నాను అక్కతో. 

మంచిపని చేశావులే ఈ సారి ఎప్పుడన్నా సినిమా చూడు తెలుస్తుంది అంది పెద్దక్క.మొత్తానికి అనుకున్న కార్యక్రమాలన్నీ అనుకున్నట్లే అయ్యాయి. అక్కడున్నంత సేపు ఒక్క మా అన్న తప్ప ఎవరూ సంతోషంగా లేరు. మా అమ్మమ్మ,అమ్మ,అక్కలు,తాత అందరూ వాళ్ళ సొమ్మేదో పోయినట్లు బాధపడుతున్నారు,అక్కలు బొద్దుగా ముద్దుగా ఉండే వదిన వాళ్ళమ్మాయి సౌమ్యని బండది బండది అంటూ అక్కసుగా పిలుస్తున్నారు. నాకేమీ అర్ధం కాలేదు కానీ ఇల్లుని చూసి మానవ సహజమైన ఈర్ష్యా, అసూయలు అనుకున్నా.. వచ్చేటప్పుడు మా అన్న పద్మాక్షి వదినకి,వాళ్ళాయనకి తనతో మ్యూజిక్ ప్రోగ్రాం ఇప్పించినందుకు థ్యాంక్స్ చెప్పి మమ్మల్ని ఇంటికి బయల్దేరదీశాడు.. 

ఈర్ష్యా,అసూయలు ఒకరి కంటే మనం బాగుండాలన్న స్ఫూర్తిని కలిగిస్తే సంతోషమే కానీ మనకి లేనిది ఇతరులకి ఉందని,దాన్ని దూరం చేసి సంతోషించాలనే దుర్మార్గపు ఆలోచనలు కలిగిస్తే అది ఇతరుల జీవితానికి,ఒక్కోసారి మన జీవితానికి, ఈ రెండు కాకపోతే మధ్యలో ఈ విషయంలో ఏమీ సంబంధం లేని వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయ్యే ప్రమాదం లేకపోలేదు... తప్పు చెయ్యటం ఎంత తప్పో,తప్పు చేసే వాళ్ళని ఖడించకుండా మౌనంగా ఉండే వాళ్ళది కూడా అంతే తప్పు.
                     



9, నవంబర్ 2014, ఆదివారం

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 11



పడుకున్న నాకు బయట మాటలు వినిపించి మెలకువొచ్చింది. ఎవరా చూద్దామని బయటికి రాగానే ఎదురుగా మా అమ్మమ్మ తరుపు దగ్గరి  బంధువులు పద్మాక్షి వదిన, అన్నయ్య కనపడ్డారు. నాకు మా వదిన పద్మాక్షి పేరు వెరైటీగా అనిపిస్తుంది . కామాక్షి,మీనాక్షి లాగా పద్మాక్షి ... పద్మాక్షి అంటే పద్మముల వంటి నయనములు (పద్మనయన) కలదని అర్ధమట. వదిన నిజంగా పేరుకు తగినట్లు ఉంటుంది.. అన్నయ్య ఒక గవర్న్ మెంట్ బ్యాంక్ లో మేనేజర్ గా జాబ్ చేస్తున్నాడు. వాళ్లకి ఒక పాప,బాబు .సొంత ఊరినుండి ఎప్పుడో హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ హ్యాపీగా సెటిలయినట్లే.

నన్ను చూడగానే మాధవ్ ఎలా ఉన్నావ్,కాలేజ్ విశేషాలేంటి అంటూ ఆప్యాయంగా పలకరించారు అన్న,వదిన. మాటల్లో తెలిసిన విషయం ఏంటంటే మా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పటి నుండి మా అన్న,వదిన వీళ్ళకి అన్ని రకాల సహాయం చేస్తూ తోడుగా ఉంటున్నారని,అందువల్లే మా వాళ్లకి కొత్త ప్రదేశం అనే సమస్య లేకుండా పోయిందని అర్ధమయ్యింది. పద్మాక్షి వదినని చూస్తే  నాకు అప్రయత్నంగానే కావ్య వాళ్ళమ్మ గుర్తొచ్చింది. కావ్య ఏమి చేస్తుందో అనుకుని మళ్ళీ నన్ను అంత అవమానించిన మనిషితో నాకెందుకులే అనిపించింది.

కాసేపు కూర్చుని ఆ కబుర్లు,ఈ కబుర్లు వూరిదగ్గర బంధువుల విషయాలు ఇలా లోకాభిరామాయణం అంతా  మాట్లాడాక దసరా షాపింగ్ కి అమ్మని, అమ్మమ్మని తీసుకెళ్ళారు అన్నా,వదిన. ఇక్కడికొచ్చాక అమ్మలో చాలా మార్పు వచ్చింది. మా ఇంట్లో నాన్న,నాన్నమ్మ ముందు మాట్లాడకుండా మౌనంగా వుండే అమ్మ ఇక్కడ బాగానే అందరితో కలిసిపోయి మాట్లాడుతూ సరదాగా షాపింగ్ లకి, పక్క న ఇళ్ళల్లో చిన్న చిన్న పార్టీలకి వెళ్తుందని తెలిసి చాలా సంతోషంగా అనిపించింది.ఎంతైనా సిటీ జీవితం వేరు.ఎవరి పనులు వాళ్ళవి ,ఎవరి లోకం వాళ్ళది. అనుభవించగలిగిన వాళ్లకి అంతా  స్వేచ్చ ,సంతోషమే..

అందరూ వెళ్ళాక నేనొక్కడినే ఇంట్లో ఉన్నాను. టీవీ చూస్తూ కాసేపు కూర్చున్నాక అక్కడే టీపాయ్ మీద వాక్ మాన్ కనపడింది. పెద్దక్క దనుకుంటాను. ఇప్పుడు సెల్ ఫోన్ లాగా అప్పట్లో చదువుకునే,ఉద్యోగాలు చేసే యువతరం దగ్గర తప్పకుండా వాక్ మాన్ వుండేది. అందులో ఇష్టమైన పాటలు లిస్టు రాసుకుని వెళ్లి మరీ ఆడియో కాసెట్లు  రికార్డ్ చేయించి అవే పాటలు అరిగిపోయే దాకా వినేవాళ్ళం.. నా వాక్ మాన్ రూమ్ లోనే మర్చిపోయ్యి వచ్చాను సరే   కాసేపు పాటలు విందామని  వింటుంటే అన్నీ ఇంగ్లీష్ పాటలే . పెద్దక్కకి అమెరికా వెళ్లాలని తెగ పిచ్చి .పెళ్ళంటూ చేసుకుంటే అమెరికాలో ఉద్యోగం చేసుకునే వ్యక్తినే చేసుకోవాలని ఒక గట్టి కంకణం కూడా కట్టుకుంది. ఆ ప్రయత్నంలోనే ఇప్పుడు పాటలు కూడా ఇంగ్లీష్ వే  వింటుందన్నమాట..

రెండు మూడు ఇంగ్లీష్ పాటలయ్యాక  "బావలు సయ్యా మరదలు సయ్యా"  అంటూ పాట  వస్తుంది . అమ్మ నాయనో ఇదేంటి ఈ పాట .. మేము ఇప్పటిదాకా వింటే " దొరకునా ఇటువంటి సేవా " అని పాడుకునే భక్తి  పాటలో లేకపోతే  "ఓ నాన్నా నీ మనసే వెన్నా" లాంటి సెంటిమెంట్ పాటలు వింటాం, చూస్తాం కానీ ఇదేంటీ ఘోరంగా ఈ పాట? ఆ ఆడియో రికార్డింగ్ షాప్ వాడు పొరపాటున రికార్డింగ్ డాన్స్ పాట మా అక్క కాసేట్ లో రికార్డ్ చేసినట్లున్నాడు లేకపోతే ఇలాంటి పాటలు ఉంటాయని కూడా అక్కకి తెలుసా పాపం అనుకుని టక్కున పాట  ఆపేసి అక్క కోసం ఎదురు చూస్తున్నా ఈ విషయం చెప్పాలని.

ఒక గంటలో అక్క ఇంటికి రాగానే  మొహమాటపడుతూనే ఈ విషయం అక్కకి చెప్పా .. దానికి అక్క పెద్దగా నవ్వి ఏంటి మాధవ్ చిన్నపిల్లాడిలా మాట్లాడతావ్.. "బావలు సయ్యా మరదలు సయ్యా" నాకు చాలా ఇష్టమైన పాట స్పీడ్ గా, రిధమ్ తో చాలా బాగుంటుంది. అందుకే కావాలని చెప్పి రికార్డ్ చేయించా. అయినా నా వాక్ మాన్ ఎందుకు తీశావ్  అది నాకు అన్నయ్య అమెరికా నుండి వాళ్ళ ఫ్రెండ్ తో తెప్పించాడు తెలుసా ? పాడయితే రిపేర్ చేయించటం కూడా కుదరదు  అంటూ అంతెత్తున ఎగిరింది అక్క నామీద .ఆ దెబ్బకి రికార్డింగ్ డాన్స్ పాట సంగతి మర్చిపోయ్యా. మరే ఇంతోటి వాక్ మాన్ నాకు వాడటం రాక పాడు చేస్తాను .. నాకు తెలియదా వాక్ మాన్ గురించి అని కోపం వచ్చింది. కానీ కాసేపటి తర్వాత  ఛీ అక్కేదో మామూలుగా అంటే నేను కోపం తెచ్చుకోవటం తప్పు . ఎంతైనా పెద్దక్క  కదా .. !! ఇంట్లో వాళ్ళ మీద ఎవరన్నా కోపం తెచ్చుంటారా ? అని నాకు నేనే సర్ది  చెప్పుకున్నాను.

ఈలోగా బయటి వెళ్ళిన అందరూ వచ్చారు. అన్న రాలేదు. ఇంకా అన్న రాలేదేంటి అనగానే మా చిన్నక్క అందుకుని  ఆయనగారు అప్పుడే ఎందుకొస్తారు మధ్యలో ఎన్నెన్ని పనులు అంటూ మా నాన్నమ్మ లా రాగం తీసింది.దానికి మా వాళ్ళంతా నవ్వులు నాకేమీ అర్ధం కాలేదు.. నాకే విషయాలు చెప్పరు కదా వీళ్ళు . సాయంత్రానికి  అందరూ టీవీ దగ్గర చేరారు "అంతరంగాలు అనంత మానస చదరంగాలు" అంటూ మొదలెట్టి "ఓ విధీ విచిత్రాల నిధీ"  దాకా చూస్తూ కధల్ని,నటుల్ని కామెంట్ చేస్తూ చూస్తున్న వాళ్ళని చూస్తే  అంత నచ్చకపోతే అలా కామెంట్స్ చేస్తూ చూడటం ఎందుకు వేరే ప్రోగ్రామ్స్ చూడొచ్చు కదా అనిపించింది .. ఎదుటి వాళ్ళని ఏదో విధంగా విమర్శించటం మనుషుల జన్మహక్కనుకుంటా...

కాసేపటికి అన్న వచ్చాడు  మాధవ్ నీకు పండక్కి బట్టలు అంటూ ప్యాకెట్ అందించాడు. తీసి చూడగానే ఎప్పటిలాగే బారు చొక్కా, లూజు ప్యాంటు ఈ డ్రెస్ వేసుకుంటే  ఏదో సినిమాలో బాబుమోహన్ డ్రెస్ లా ఉంటుందని అన్నకి చెప్పాలనుకుని కూడా వద్దులే పాపం మళ్ళీ అన్న ఫీల్ అవుతాడు అనుకుని బట్టలు లోపల పెట్టటానికి వెళ్లాను. అన్న భోజనం చేస్తూ అమ్మమ్మతో అంటున్నాడు ఈ దసరాకి కారు కొనాలనుకుంటున్నాను. ముందు కొంచెం డబ్బు మీరు కట్టండి మిగతాది ఇన్స్టాల్ మెంట్స్ లో నేనే కట్టుకుంటాను అన్నాడు అమ్మమ్మతో. అప్పంటే మీ నాయన  ఏమంటాడో నాయనా అంది అమ్మమ్మ అందుకే ఇప్పుడు నువ్వు ఇవ్వు నేను తర్వాత ఇప్పిస్తా అన్నాడు అన్న. మొత్తానికి ఈ దసరాకి అన్న కార్ కొంటున్నాడన్నమాట. నాకు అన్నని చూస్తే చాలా గర్వంగా,సంతోషంగా అనిపించింది .

అదే మాట చిన్నక్కతో అనగానే నీ మొహంలే ఆయనేమన్నా కారు సొంతగా కొంటున్నాడా నువ్వంత గర్వించటానికి .ముందు అమ్మమ్మ అప్పు ఇస్తుంది తర్వాత కొన్నాళ్ళకి నేను నెల నెలా ఫైనాన్స్ వాళ్లకి అప్పు కట్టలేను నానా అంటే అప్పుడు నాన్నే చచ్చినట్లు మిగతా డబ్బు ఇస్తాడు. అది ఆయన గారి ప్లాన్ అంటూ మహా కచ్చగా తన మనసులో మాటల్ని నాదగ్గర వెళ్ళగక్కింది .. అమ్మబాబోయ్ "నువ్వు డ్రాప్ చేస్తే కానీ కాలేజ్ కి వెళ్లను"  అని మా అన్న ముందు అనే చిన్నక్కేనా ఇలా మాట్లాడుతుంది అనిపించింది. మళ్ళీ అంతలోనే ఏదోలే కోపతాపాలు మనుషులకి కాకపొతే మానులకి వస్తాయా ఎంతైనా చిన్నక్క కదా .. !!  అనుకుని ఆ విషయం మర్చిపోయాను .


  కొంతమంది మనుషుల నోటి ప్రభావమో,లేకపోతే అంతబాగా ఆలోచిస్తారో తెలియదు కానీ, కొన్ని మాటలు వందశాతం నిజమవుతాయని చెప్పటానికి  అన్న కారు గురించి మా చిన్నక్క నాతో చెప్పిన మాటలు ఉదాహరణ.. రెండు సంవత్సరాల తరవాత కారుకి కట్టాల్సిన అప్పు కోసం ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు మారిన మా అన్న ఇంటి అడ్రెస్, ఫోన్ నెంబర్ కోసం మా వూరిలో ఇంటికి ఫోన్ చేయటం, అప్పుడు ఇంట్లోనే ఉన్న నేను నన్ను కాబట్టి అడిగారని గొప్పగా అన్న కొత్త ఫోన్ నంబర్,అడ్రెస్ చెప్పటం .. ఆ నెంబర్ పట్టుకుని  వాళ్ళు డబ్బు కోసం అన్నని నిలదీయటం తప్పని పరిస్థితిలో నాన్న మిగతా అప్పు కట్టటం , అంతా ఆరోజు చిన్నక్క చెప్పింది చెప్పినట్లే జరిగింది. కానీ ఇక్కడ నింద  మళ్ళీ నా మీదే పడింది. ఫైనాన్స్ కంపెనీ వాళ్లకి నా ఫోన్ నెంబర్ ఎందుకు చెప్పావురా ఆ మాత్రం తెలియదా అంటూ .. అన్న నా మీద విరుచుకు పడ్డాడు.

నువ్వు కావాలని నెంబర్ మార్చావని తెలియక వాళ్లకి చెప్పేశాను అయినా  నువ్వు అప్పు కట్టేసి ఉంటావనుకున్నాను,అందుకే వాళ్లకి నెంబర్ చెప్పాను చెప్పకూడదని నాకు తెలియలేదు అన్నాను..నాకు అర్ధం కాని విషయం ఎప్పటికైనా అప్పు కట్టాలి కదా.. అంటే నేను నెంబర్ చెప్పకపోతే అన్న వాళ్లకి  ఎప్పటికీ అప్పు కట్టేవాడు కాదా? అది తప్పు కాదా ?? అలా మా అన్నకి కారు, నాకేమో తెలివి తక్కువగా ఫైనాన్స్ కంపెనీ వాళ్లకి అన్నని పట్టించాననే అపనింద  మిగిలిపోయింది..  ఏంటో ... ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో, ఎలా, ఎందుకు మాట్లాడాలో ( మా అమ్మమ్మ బాషలో లోకజ్ఞానం ) నాకు ఎప్పటికైనా తెలుస్తుందో లేదో .. ??

కధ  మరీ  ఎక్కడికో ముందుకు వెళ్లిపోయింది  కదా..  వస్తున్నా వెనక్కి .మళ్ళీ దసరా పండగ రోజున హైదరాబాద్ లోని మా అన్న ఇంటికి.


1, నవంబర్ 2014, శనివారం

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 10


 

ఛా ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటాను ఎవరికీ  అనవసరంగా చనువు ఇవ్వకూడదని,ఎవరిని తొందరగా నమ్మ కూడదని, కానీ మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తూనే ఉంటాను.చాలా బాధగా ఉంది లోలోపల కసిగా కూడా ఉంది. నన్ను ఒక అమ్మాయి పర్స్ దొంగతనం చెయ్యమని ఇంకో అమ్మాయి అడగటం తలచుకుంటేనే పిచ్చి కోపం వస్తుంది . ఇంక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా బయటికి వస్తున్న నాకు వెనక నుండి మాధవ్ మాధవ్ అని కావ్య పిలవటం వినిపిస్తూనే ఉంది కానీ ఆగాలనిపించలేదు.లంచ్ తర్వాత క్లాస్ కి వెళ్ళాలనిపించలేదు. డైరెక్ట్ గా రూం కి వెళ్లాను. హేమంత్ రూమ్ లోనే వున్నాడు పెళ్ళికి వెళ్ళొచ్చి బాలేదని రెస్ట్  తీసుకుంటున్నాడు. హేమంత్ ని చూడగానే అసలు వీడివల్లే తన చెల్లెలు పరిచయం అయ్యింది లేకపోతే  నేను అమ్మాయిలతో పరిచయం ఎందుకు చేసుకుంటాను అనుకుని హేమంత్ తో ఏమీ మాట్లాడకుండా వెళ్లి పడుకున్నాను. సాయంత్రానికి సోహిల్,రఫీ,దివాకర్ రూమ్ కి వచ్చారు. 

నన్ను చూసి ఏమైంది మాధవ్ అని అడిగి ఉదయం కాలేజ్ లో పేషెంట్ విషయం గురించి బాధపడుతున్నాను అనుకుని అందరూ ఫ్రెష్ అయ్యి భోజనాల తర్వాత మొన్న వెళ్ళిన పెళ్లి ఫోటోలు చూద్దామని కూర్చున్నారు. దివాకర్ మంచి ఫోటోగ్రాఫర్.  అప్పట్లో రీల్ కేమెరాలే కదా..  కెమెరా మెడలో వేసుకుని తిరుగుతూ కనపడ్డ ప్రతి పుట్టని,గుట్టని ఫోటోలు తీస్తూ మమ్మల్ని ఆ ఫోటోలు చూడమని,మెచ్చుకొమ్మని, వాటి గురించి విశ్లేషించమని చావగొట్టేవాడు.అందరూ ఫోటోలు చూడటం కాగానే దివాకర్ ఫ్రెండ్ మా సీనియర్ సుధాకర్ దొరై మా రూమ్ కి వచ్చాడు ఇతను తమిళనాడులో పుట్టినా తన చదువంతా ఇక్కడే జరిగింది.తను పాటలు చాలా బాగా పాడతాడు. కానీ వచ్చిన చిక్కేమిటంటే తమిళ పాటలు పాడి, వాటి అర్ధాలు కూడా చెప్తూ చావ గొట్టి చెవులు మూసేవాడు.వాడు,వాడి అరవ గోల.  కొంతమందికి ఒక లక్షణం ఉంటుంది. ఎవరికీ తెలియని విషయాలు వాళ్ళకే తెలిసినట్లు, వాటన్నిటిని మాలాంటి అజ్ఞానులకి చెప్పేసి అందరినీ ఎడ్యుకేట్ చేయటమే వాళ్ళ పని అన్నట్లు ప్రవర్తిస్తారు. ఎదుటివాళ్ళకి వాటి గురించి ఆసక్తి ఉందా లేదా అని కూడా తెలుసుకోరు.. 

ఇవాళ రూమంతా అందరితో సందడిగా, సరదాగా ఉన్నా నాకు మాత్రం మనసు చిరాగ్గా ఉంది.ఇంక అక్కడ ఉండాలనిపించలేదు. వెళ్లి పడుకున్నా గానీ నిద్రపట్టలేదు. ఇంతలో ఫోన్ రింగవ్వగానే హేమంత్ వచ్చి  మాధవ్ నీకే ఫోన్ అంటూ పిలిచాడు. ఎవరా అని వెళ్లి ఫోన్ తీయగానే అటునుంచి నాన్న. కుశల ప్రశ్నలయ్యాక మాధవ్ ఎలాగూ  త్వరలో దసరా హాలిడేస్ కదా వీలుంటే ఒక రెండు రోజులు ముందే వచ్చేయ్ .. హైదరాబాద్ వెళ్దువుగాని అందరు నిన్ను రమ్మన్నారు అన్నాడు. హమ్మయ్య వెతకబోయిన తీగ దొరికినట్లు అనిపించింది. ఇక్కడ ఉండలేని పరిస్థితిలో నాన్న రమ్మనటం హాయిగా అనిపించింది. సరే నాన్న  వచ్చేస్తా అన్నాను. 

ఫోన్ పెట్టేసి రూమ్ లోకి రాగానే నా ఆలోచనలు ఇంటి వైపు మళ్ళాయి. అన్న B.tech, అక్క ఆయుర్వేద డాక్టర్ కోర్స్ అవ్వగానే ఇద్దరి ఉద్యోగాల కోసం ఈ సంవత్సరమే హైదరాబాద్ కి వెళ్ళారు. వాళ్ళతో పాటు వాళ్లకి వంట చేయటానికి,తోడుగా కూడా ఉంటుందని అమ్మ,అమ్మమ్మ కూడా వాళ్ళతో వెళ్ళారు. మా నానకి ఎలాగు మా అమ్మ దగ్గర ఉన్నా, లేకపోయినా పర్వాలేదు కాబట్టి మా నాన్నమ్మ, నాన్న ఆయన జాబ్ చేస్తున్న ఇంటిదగ్గరే ఉంటున్నారు.ఇంక చిన్నక్క కూడా ఒక్కతే  ఎందుకని అన్న దగ్గరే ఉంటూ లా చదువుతుంది.చిన్నప్పుడు ఎప్పుడూ అతి తెలివిగా అడ్డదిడ్డంగా వాదించే మా చిన్నక్కని నాన్నమ్మ అనేదట నువ్వు నందిని పంది పందిని నంది చేయగల సమర్దురాలివే నువ్వు వకీలుగా  బాగా పనికొస్తావు అని. ఆమాట నిజం చేయాలన్న ధృడ సంకల్పంతో మా అక్క ఇప్పుడు "లా" చదువుతుందన్నమాట. 

నేను ఇక్కడ కాలేజ్ లో చేరటం, ఎప్పుడైనా లీవ్ వచ్చినా నానే వచ్చి వెళ్ళటంతో ఇంటికి ఇప్పటిదాకా వెళ్ళలేదు. ఇన్నాళ్ళ తర్వాత అందరు నన్ను రమ్మని పిలవటం చాలా సంతోషంగా అనిపించింది. వెంటనే లగేజ్ సర్దుకుని రెడీగా ఉంచుకుని నిద్రపోయాను. ఉదయాన్నే రఫీకి,సోహిల్ కి చెప్పి ఇంటికి బయల్దేరాను.ముందు నాన్న దగ్గరికి వెళ్లి, నాన్నమ్మని పలకరించి రాత్రికి హైదరాబాద్ బయల్దేరాను.తెల్లారేసరికి హైదరాబాద్ బస్టాండ్ కి చేరుకొని నాన చెప్పిన అడ్రెస్ ఎంత జాగ్రత్తగా వెతుక్కుంటూ వెళ్లినా దారి తప్పిపోయాను. కాయిన్ బాక్స్ నుంచి ఇంటికి ఫోన్ చేయగానే అప్పుడే నిద్ర లేచిన అన్న ఫోన్ తీసి అంత  క్లియర్ గా ఉన్న అడ్రెస్ కూడా తెలుసుకోలేవా అంటూ కసిరి ఆటో అతనికి నేను చెప్పినట్లు చెప్పు అంటూ కరెక్ట్ అడ్రెస్ చెప్పాడు.మొత్తానికి ఎలాగో ఇల్లు చేరాను. 

మంచి పోష్ లొకాలిటీలో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అది. అన్నకి అప్పుడే కొత్తగా ఉద్యోగం వచ్చింది.అద్దె,ఖర్చులు అన్నీ నాన్నే చూస్తున్నాడు .అన్న కోసం నాన్నఎంతైనా ఖర్చు చేస్తాడు. అన్న ఏమి చేసినా ఉపయోగకరంగా,  తెలివిగా చేస్తాడని మా నాన్నకే కాదు మా ఫ్యామిలీ అందరి నమ్మకం.అందుకే ఎంత నమ్మకం లేకపోతే  అన్నని నమ్మి అమ్మమ్మ, అమ్మ,ఇద్దరు అక్కలు ఇంత  పెద్ద సిటీలో ఉంటారు.. నాకు కూడా అనిపించింది ఎంతైనా అన్న సమర్దుడే అని.అందరు నిద్రలేచి టిఫిన్,కాఫీలయ్యాక పెద్దక్క జూనియర్ డాక్టర్ గా చేస్తున్న హాస్పిటల్ కి, అన్న ఆఫీస్ కి,చిన్నక్క కాలేజ్ కి రెడీ అవుతున్నారు.చిన్నక్క బయటికి వస్తూనే అన్నని పిలిచింది తనని కాలేజ్ లో డ్రాప్ చేయటానికి. అన్న నాకు లేట్ అవుతుంది ఇవాల్టికి మాధవ్ తో వెళ్ళొచ్చు కదా అనగానే లేదు నన్ను నువ్వే డ్రాప్ చెయ్యాలి లేకపోతే కాలేజ్ కి వెళ్ళను అంది. సరే పద అంటూ అన్న,చిన్నక్క వెళ్లిపోయారు 

అక్కకి  నన్ను కాలేజ్ కి తీసుకెళ్లటం ఇష్టం లేదని అర్ధం అయ్యింది. ఫీల్ అవుతున్న నా దగ్గరికి మా కవరింగ్ మాస్టర్ అమ్మమ్మ వచ్చి ఏమీలేదులే నాయనా నువ్వు ఇక్కడ కొత్త కదా అందుకని అన్నని రమ్మందిలే అక్క, నువ్వేమీ వేరేగా ఆలోచించగాకు అంది. హాలిడేస్ ఇవ్వటానికి ఇంకా రెండ్రోజులు ఉండటంతో అందరు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ నేనే పనిపాటా లేనట్లు ముందే వచ్చి కూర్చున్నా.. ఈ లోగా అమ్మ టిఫిన్ పెట్టగానే తినేసి ప్రయాణ బడలికతో అలాగే పడుకుని నిద్రపోయాను. మధ్యానానికి ఎవరివో కొత్త గొంతులు వింటూ మెలకువ వచ్చింది.


29, అక్టోబర్ 2014, బుధవారం

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 9




కావ్య వాళ్ళ ఇంటికి వెళ్లి వచ్చిన దగ్గరి నుండి కావ్య నన్ను ఏమి అడగబోతుందా అన్న ఆలోచనే వెంటాడుతుంది.ఉదయాన్నే కాలేజ్ కి వెళ్ళాము అందరం. కాలేజ్ లో ఈ రోజు క్లినికల్ వార్డులో, అవుట్ పేషెంట్ డిపార్ట్ మెంట్లో పేషెంట్స్ తో మాట్లాడి వాళ్ళ ఆరోగ్య సమస్యలు నోట్ చేసుకోవటం, వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేయాలి. పేషెంట్స్ ని చికిత్స కన్నా ముందు మన మాటలతో ఎలా సాంత్వన కలిగించాలి ఇలాంటి విషయాలను చాలా చక్కగా వివరిస్తున్నారు మా ప్రొఫెసర్ ఎర్రన్న .. 

ప్రశాంతంగా ఆలోచించగలగాలి . ఎదుటి వాళ్ళ ప్రాణాలు మన చేతిలో ఉన్నాయన్న బాధ్యత, ఉండాలి కానీ గర్వం లేకుండా ఉండటమే ఒక డాక్టర్ వృత్తి ధర్మం లో ముఖ్యమైనది .. ఏంటో ఇలా పాఠాలు చెప్తారు కానీ పేషెంట్స్ తో అంత మర్యాదగా,నిదానంగా మాట్లాడుతూ వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు  ,ఆరోగ్య చరిత్రలు తెలుసుకుంటూ వైద్యం చేయాలంటే రోజుకి ఎంతమందికి వైద్యం చేయగలం,ప్రాక్టికల్ గా ఇవన్నీ సాధ్యమేనా??  


మొత్తానికి అవుట్ పేషెంట్ వార్డుకి వెళ్లి BP ఆపరేటస్ తెచ్చుకుని ఒక పేషెంట్ కి BP చూస్తుండగా కావ్య కూడా అక్కడికి రావటం,నా ఆలోచన తన వైపుకి మళ్ళటం అప్రయత్నంగా జరిగిపోయింది.ఈలోగా పేషెంట్ కి మోచేతి పైన పెట్టిన BP కఫ్ (cuff ) బిగుసుకుపోయి పేషెంట్ నొప్పితో పెద్దగా అరుస్తూ అసలే కుర్చీలో కాకుండా స్టూల్ మీద కూర్చున్నాడే మో అలాగే వెనక్కి పడిపోయాడు.. 


అతనికేమి జరిగిందా అని ఇక్కడ నా గుండె ఆగిపోయింది. వార్డంతా గొడవ గొడవగా అక్కడికి చేరారు.నా ఫ్రెండ్ సోహిల్,రఫీ వెంటనే అతన్ని లేపి కూర్చోపెట్టి మాట్లాడించారు. కొంతమంది పేషెంట్స్ ఎంత పెద్ద జబ్బైనా నిబ్బరంగా ఉటారు కానీ కొంతమంది మాత్రం చిన్న జ్వరానికి కూడా కంగారుపడి,పదిమందిని కంగారు పెట్టి హంగామా చేస్తారు.. ఇతను కూడా అలాంటివాడే అసలే తన గుండెకి ఏదో అయ్యిందన్న భయంలో హాస్పిటల్ కి వచ్చిన ఆయన చేతి దగ్గర కొద్దిగా బిగుసుకోగానే తనకేదో అయ్యిందని భయపడిపోయాడు. 

అతనికేమీ ప్రమాదం లేదని తెలుసుకున్నాక ఇప్పుడు నన్ను కాపాడే ప్రయత్నం మొదలుపెట్టారు నా ఫ్రెండ్స్. ఆ పేషెంట్ ని  గట్టిగా కసురుతూ అయినా ఇంత  చిన్నదానికి అంత  గొడవ చెయ్యాలా. BP ఎలా చూడాలో మాకు తెలుసా నీకు తెలుసా అంటూ అతన్ని భయపెట్టి,బుజ్జగించి  అక్కడినుండి పంపేశారు. ( పేషెంట్స్ ని అప్పుడప్పుడు నీకు తెలుసా నాకు తెలుసా అని బెదిరించటం కూడా డాక్టర్  ప్రొఫెషన్ లో ఒక స్కిల్ అని తర్వాత తెలిసింది)ఎలాగో మా హెడ్ అక్కడ లేకపోవటం పెద్ద ప్రమాదం తప్పింది.నాకు అందరిముందు తల కొట్టేసినంత పనయ్యింది . ఛీ వెధవ జీవితం ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తాను అని నన్ను నేనే తిట్టుకున్నా కాసేపు. 

ఉదయం ఈ క్లాసులు అవ్వగానే లంచ్ కి వెళ్ళాము. మళ్ళీ కాలేజ్ కి రాగానే కావ్య లైబ్రరీకి వెళ్దాం రమ్మంది.  లైబ్రరీలో స్టూడెంట్స్ తక్కువగా ఉన్నారు. ఇందాక జరిగిన విషయం కాస్త సిగ్గుగా అనిపించింది కావ్య ముందు.కానీ తను ఆ విషయం ఏమీ గుర్తులేనట్లే లంచ్ చేశావా మాధవ్ అని,నిన్న నేను మా ఇంట్లో అడిగిన విషయం గుర్తుంది కదా అంది. నేను ఆ విషయం ఎప్పుడు చెప్తావా అనే ఎదురుచూస్తున్నాఅన్నాను. 

మాధవ్ నువ్వు మన ఫ్రెషర్స్ డే రోజు నీ గురించి చెప్తూ కొన్ని మాటలు చెప్పావ్ అవి నీకు గుర్తున్నా లేకపోయినా నాకు మాత్రం బాగా గుర్తుండిపోయాయి, ముఖ్యంగా నువ్వు చెప్పావు కదా మనిషి తలచుకుంటే, గట్టి పట్టుదల ఉంటే  ఏదైనా చేయగలమని ఆ మాట అన్ని విషయాల్లో సాధ్యమవుతుందా అంది. కావ్య మాటలు వినగానే అప్పటి విషయాలు ఇప్పటికీ గుర్తుంచుకుని నన్ను మెచ్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. 

నా మనసులో అప్పటిదాకా ఉన్న ఉదయం పేషెంట్ బాధ పోయి ఉత్సాహం నిండిపోయింది.మళ్ళీ వివేకానంద బోధనలు మొదలు పెట్టేశాను.. తప్పకుండా కావ్యా చిన్నప్పటి నుండి నాకంటూ సొంత ఆలోచన లేకుండా అమ్మమ్మ,తాత,నాన్నమ్మ,నాన్న,అమ్మ,అక్కలు, అన్న ఇలా అందరి మధ్యలో నేను ఒక చిన్నపిల్లాడిని అనే భావంతో, నా విషయాలు ఏవైనా వాళ్ళే చూసుకుంటార్లె అనే నిర్లక్షంతో పెరిగాను కానీ మా నాన్నకి గిఫ్ట్ గా ఇంటికి వచ్చిన వివేకానంద పుస్తకం చదివాక మనిషి ఎలా ఉండాలి అనే దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. 

ఆ ప్రభావంతోనే మెడిసిన్ లో మొదటిసారి సీట్ రాకపోయినా సొంతగా నానని ఒప్పించి మరీ లాంగ్ టర్మ్ చేసి సీట్ సాధించాను. అందుకే తలచుకుంటే మనం ఏదైనా చేయగలమని నాకు గట్టి నమ్మకం.సరే కావ్యా ఇప్పటికే నిన్ను విసిగించాను .. ఎనీ హౌ అప్పటి మాటలు గుర్తుంచుకుని ఇప్పుడు మెచ్చుకున్నందుకు చాలా థాంక్స్ సరే ఇంతకీ నేనేమి హెల్ప్ చేయగలను నీకు అనగానే కావ్య మా పక్కన టేబుల్ చూపిస్తూ అక్కడొక బ్యాగ్ ఉంది చూడు మాధవ్ అది నా ఫ్రెండ్ శైలుది అందులో తన పర్స్ ఉంటుంది తనకి తెలియకుండా తెచ్చిస్తావా? అంది.

నాకు ఒక్క క్షణం తను ఏమి అడిగిందో అర్ధం కాలేదు, అర్ధం అయిన తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. ఛీ ఈ పని చెయ్యటానికా నన్ను ఇంతలా మాట్లాడించింది. అసలు తను నా గురించి ఏమనుకుంటుంది? ఎందుకు ఇలా చేసింది. నేను మరీ అంత వెధవలా కనిపించానా? అందరితో పాటు తను కూడా నన్ను అవమానిస్తుందా అనిపించింది. కానీ ఎక్కడో ఒక మూల కావ్య అలా చేసే అమ్మాయి కాదే అని సందేహం కూడా రాకపోలేదు.ఇటు కావ్య మాత్రం ఏ ఫీలింగ్స్ లేకుండా నేను పర్స్ తెస్తానా, తేనా అన్నట్లు వెయిట్ చేస్తుంది.

23, అక్టోబర్ 2014, గురువారం

దీపావళి శుభాకాంక్షలు


దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరాయణం 
దీపేన హారతే పాపం దీపలక్ష్మీ నమోస్తుతే !




దీపావళి శుభాకాంక్షలు


18, అక్టోబర్ 2014, శనివారం

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 8




సాయంత్రం రూమ్ కి వెళ్ళగానే హేమంత్ ని అడిగాను రేపు మీ ప్రోగ్రామ్ ఏంటి అని..  మరి వాళ్ళు కూడా కావ్య ఇంటికి వస్తున్నారో లేదో తెలుసుకోవాలి కదా! రేపు మన క్లాస్ మేట్ రవి వాళ్ళన్నయ్య  పెళ్లి . రఫీ,సోహిల్ కూడా వస్తున్నారు నువ్వు వస్తావా అన్నాడు హేమంత్.. లేదులే హేమంత్ నాకు రావాలని లేదు మీరు వెళ్ళండి నేను అక్కడికి వచ్చినా కొత్త వాళ్ళతో కలవలేను , మీకు కూడా ఇబ్బంది నా వల్ల అనగానే రఫీ కూడా రారా మాధవ్ ఒక్కడివి ఏమి చేస్తావు రూమ్ లో అన్నాడు .. లేదులే ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను ఠక్కున అబద్ధం చెప్పాను. తెలిస్తే ఏమనుకుంటారో అనే ఆలోచన కూడా రాలేదు ఆ క్షణం.


వాళ్లటు పెళ్ళికి వెళ్ళగానే 10 గంటలకల్లా నేను కావ్య ఇంటికి వెళ్లాను. ఒక్కడినే వాళ్ళింటికి వెళ్ళటం కొత్తగా, కొంచెం కంగారుగా కూడా ఉంది. పక్కింటి వాళ్ళతో మాట్లాడుతూ వాకిట్లోనే ఆంటీ కనబడ్డారు. రా మాధవ్ కావ్య చెప్పింది నువ్వొస్తావని. హేమంత్ పెళ్ళికి వెళ్ళాడట కదా అంటూ నన్ను లోపలి తీసుకెళ్ళింది..ఎప్పటిలాగే నీట్ గా ప్రశాంతంగా ఉంది ఇల్లు. అంకుల్ ఆఫీస్ కి, కావ్య చెల్లి,తమ్ముడు స్కూల్ కి వెళ్ళారు. ఏదో రికార్డ్ వర్క్ చేసుకుంటున్న కావ్య కూడా బయటికి వచ్చింది. ఆంటీ ఆ రోజు వెరైటీ టిఫిన్ పెట్టారు రవ్వ ఇడ్లీ అట .. అప్పటిదాకా మినపిడ్లీ తిన్నాను కానీ ఎప్పుడూ ఇవి తినలేదు.



ఎంతైనా ఆంటీ వెరైటీ గా వంటలు చేస్తారు అదే మాట అనగానే, ఆంటీ నవ్వి అంకుల్ జాబ్ కోసం మేము కొత్త ప్లేస్ లు చాలా తిరిగాము మాధవ్ ..అక్కడ నేర్చుకున్నాను ఇవన్నీ.నాకు ఫ్రెండ్ కూడా ఎక్కువే. అంటూ మీ అమ్మ వంట బాగా చేస్తారా అంది. నాకెందుకో అమ్మ విషయం రాగానే మనసుకు బాధ అనిపించింది.. ఎవరైనా మనసుకి దగ్గరగా అనిపించినా, కాస్త బాగా పలకరించినా నా మనసులో ఉన్నదంతా చెప్పెయ్యటం, ఇంటి విషయాలు కూడా దాచుకోకుండా చెప్పటం నాకొక బలహీనత ఇది మంచి అలవాటా, చెడ్డదా అని నాకు తెలియదు.



అలాగే ఆంటీ అమ్మ గురించి అడగగానే చిన్నప్పటి నుండి జరిగిన సంగతులన్నీ ఆంటీకి చెప్పాను . అక్కడే వున్న కావ్య కూడా మౌనంగా కూర్చుని వింటుంది . మనం ఎవరికైనా మన విషయాలు ఏవైనా చెప్పేటప్పుడు ఎదుటివాళ్ళు ఆ మాటల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, తర్వాత వాళ్ళ స్పందన ఎలా వుంటుంది అనే విషయాలన్నీ ముందే ఆలోచించుకోవాలి.. అమ్మ గురించి చెప్పిందంతా విన్న ఆంటీ మాధవ్ కొంత మంది మగవాళ్ళు ఉంటారు వాళ్ళు భార్యల్ని కొట్టరు,తిట్టరు,నలుగురికి కనపడేలా భార్యల్ని హింసించరు కానీ వాళ్ళ  ప్రవర్తనతో ఎదుటి మనిషికి జీవితం మీద విరక్తి కలిగేలా చేయగలరు. 



ఎవరిదాకా ఎందుకు మా అక్క వాళ్ళ ఆయన కూడా అంతే .. ఆ రోజుల్లోనే డిగ్రీ చదివిన అక్కని జాబ్ చేయొద్దు అన్నాడు సరేనని ఇంట్లోనే వుండిపోయింది. తన హాబీస్ , చుట్టుపక్కల ఫ్రెండ్స్ తో ఆమెకంటూ ఒక లోకం ఉండటం కూడా ఆయనకి  ఇష్టం ఉండదు. ఫ్రెండ్స్ తో ముచ్చట్లు , సరదాలు ఎక్కువయ్యాయి అంటూ అక్కని అనేవాడు.  మళ్ళీ ఆ ఫ్రెండ్స్ ఏంటి ఈ మధ్య కలవట్లేదు అని ఎవరైనా అడగగానే తనకి ఎవరితో కలవటం ఇష్టం ఉండదని అతనే ముందు వాళ్ళతో చెప్పేవాడు.చివరికి పిల్లల విషయం కూడా నువ్వు చెప్పకపోతే వాళ్ళకేమి చేయాలో నాకు తెలియదా అనేవాడు ఇలా ప్రతి విషయం ఏమి చేస్తే తప్పో , ఏమి చేస్తే ఒప్పో తెలియక, బయటి వాళ్లకు మాత్రం ఆమెకేమి తక్కువలే  అనుకునేటట్లుగా ఉండేది అక్క పరిస్థితి.



ఆడవాళ్ళు ఎప్పుడూ హక్కులు,పోరాటాలు అంటూ మగవాళ్ళనివేధిస్తారన్నది అపోహ మాత్రమే మాధవ్. మేము కోరుకునేది కనీసం సమానత్వం కూడా కాదు మాకంటూ ఒక స్థానం. భార్య కోసం పెళ్ళికాకముందు ఉన్న బంధాలు వదులుకోవాల్సిన అవసరం లేదు కానీ పెళ్ళితో కొత్తగా వచ్చిన బంధాల్ని కూడా సరైన స్థానంలో నిలుపుకుని కాపాడేవాడే భర్త. 


ఆడవాళ్ళు పెళ్లి కాగానే పుట్టింటిని పూర్తిగా వదిలేస్తారు. భర్త ఇల్లే తన ఇల్లు అనుకుంటారు కాబట్టి భార్యకి ఒక్క ఇంటి బాధ్యతే ఉంటుంది.కానీ మగవాళ్ళు అలా కాదు తల్లి,తండ్రి,ఉంటే అక్కచెల్లెళ్ళు ఒక కుటుంబం, భార్య,పిల్లలు మరొక కుటుంబం అన్నట్లు ఉంటుది పెళ్ళైన తర్వాత మగవాళ్ళ పరిస్థితి .. ఎవరి మనసు నొప్పించకుండా, తనూ బాధపడకుండా పరిస్థితులను చక్కదిద్దగలిగే మగవాళ్ళే ఆడవాళ్ళ కంటే గొప్ప . ఆ మాట మాత్రం నిజమే అంటాను నేను.. ఈ విషయంలో నేను మాత్రం అదృష్టవంతురాలినే మాధవ్  అంకుల్ చాలా మంచి మనిషి అంటూ ఇప్పటికే నేను చాలా ఎక్కువ మాట్లాడి ఉపన్యాసం చెప్పినట్లున్నాను అంటూ నవ్వేశారు.. 

ఆంటీని చూసిన నాకు అనిపించింది జీవితం నేర్పించే పాఠాలు చాలా గొప్పవి, అవి నేర్చుకోవాలంటే ఏదో పెద్ద పెద్ద చదువులు,ఉద్యోగాలు చేయాల్సిన పనిలేదు.. సరే మాధవ్ నేను వంట చేస్తాను భోజనం చేసి వెళ్దువుగాని అనగానే వద్దాంటీ నేను బయట తింటాను లెండి అన్నాను.. ఎందుకు మాధవ్ మొహమాటం మా హేమంత్ ఎలాగో నువ్వు అలాగే ఏమీ పర్లేదులే అని వెళ్ళబోతూ ఆంటీ అన్నారు..  

మాధవ్ నువ్వు ఏమీ అనుకోకపోతే ఒక మాట నువ్వు మాత్రం పెళ్ళైన తర్వాత నీ భార్యని బాగా చూసుకో మీ నాన్నలాగా డాక్టర్ అయ్యావు కానీ భార్య విషయంలో మాత్రం మీ నాన్నను ఫాలో అవ్వకు అన్నారు.నాకు ఒక్క క్షణం ఎందుకో మనసు కలుక్కుమంది ఏంటో మన వాళ్ళను మనం ఎన్ని తిట్టుకున్నా ఏమీ ఉండదు కానీ బయటి వాళ్ళు చిన్నమాట అన్నా బాధ అనిపిస్తుంది వాళ్ళు నిజమే చెప్పినా సరే. ఏమైనా నేను ఆరోజే డిసైడ్ అయ్యాను నా భార్య,పిల్లల్ని మాత్రం నేను బాగా చూసుకోవాలని .. "ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు" .. 

ఆంటీ వంట చెయ్యటానికి వెళ్ళిన తర్వాత కావ్యతో మాట్లాడుతుండగా  హేమంత్ వాళ్ళు వెళ్ళిన పెళ్లి గురించి కావ్య చెప్పింది మా క్లాస్ మేట్ రవి అన్నయ్య సుమన్ పెళ్లి అతని క్లాస్ మేట్ తోనే అట. వాళ్లిద్దరూ ఇప్పుడు పీజి చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా ప్రేమించి,ఇష్టపడని పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటున్నారని, పెళ్లి తర్వాత వెంటనే మా రూమ్ కి దగ్గరలోనే ఫామిలీ పెట్టటానికి ఇల్లు కూడా రెంట్ కి తీసుకున్నారని, చెప్పింది. 

ఏమిటో నాకు ఏ సంగతులు తెలియవు,ఎవరు చెప్పరు పోనీలే కావ్య వల్ల   కొన్ని తెలిశాయి అనుకున్నాను. ఈ లోపు ఆంటీ వంట చేశారు, అంకుల్ కూడా రాగానే అందరం లంచ్ చేసి కాసేపు కూర్చుని, ఇక వెళ్తానని చెప్పి రాబోతుండగా నా వెనకే వచ్చిన కావ్య మాధవ్ నువ్వు నాకొక హెల్ప్ చేయాలి చేస్తావా ? అంది..  నేను ఏంటి అనగానే "నువ్వు చేస్తాను అంటేనే చెప్తాను" అంది మళ్ళీ.. నాకు ఒక్క క్షణం అర్ధం కాలేదు ఏమి అడుగుతుంది, ఏమి  చెయ్యమంటుందీ అమ్మాయి అయినా..  తనకి నేనేమి చేయగలను అని ఆలోచిస్తూనే సరే చేస్తాను అన్నాను ...  

 
Related Posts Plugin for WordPress, Blogger...