పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

28, అక్టోబర్ 2011, శుక్రవారం

కాణిపాకం To విష్ణుకంచి - 5 అరుణాచలం (తిరువన్నామలై )

సెప్టెంబర్ 5 ఉదయం రమణ మహర్షి ఆశ్రమం నుండి బయలుదేరి అరుణాచలేశ్వరుని దర్శనానికి వెళ్ళాము.
అరుణాచలం ఈ దేవుడిని దర్శించుకోవాలని మా చిరకాల వాంఛ...
జెమిని టీవీ లో శివయ్యగా,సన్ టీవీలో అన్నామలై గా వచ్చిన సీరియలో అరుణాచలం గుడిని
చూసి ఈ గుడి ఎంత బాగుంది ఎప్పటికైనా తప్పకుండా చూడాలి అని అనుకునేవాళ్ళం..
మా కోరికను శివయ్య అనుకోకుండా తీర్చటం మా పూర్వజన్మ పుణ్య ఫలం అని చెప్పొచ్చు..

అరుణాచలం
ఎక్కువగా ఋషులు,జ్ఞానులు ఈ అరుణాచలానికి వస్తుంటారని అతిథి ఆశ్రమంలో
మదర్ సౌమ్య చెప్పారు..వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం
పంచభూతాలలో ఒకటైన అగ్నిగా శివుడు వెలసిన క్షేత్రం అరుణాచలం.
అహంకారమనే చీకటిని తొలగించటానికి భగవంతుడు జ్యోతి స్వరూపమై వెలసి,
పర్వతంగా
నిలచిన మహిమాన్వితమైన క్షేత్రం అరుణాచలం.
అరుణాచలం స్వయంగా శివుడే..ఇక్కడ భగవంతుడైన శివుడు పర్వతరూపంలో వున్నాడు..
ప్రతి కార్తీక పౌర్ణమికి ఒక ప్రత్యేక సంతతి వారు మాత్రమే కొండపైకి వెళ్లి దివిటీలతో అఖండ దీపాన్ని వెలిగిస్తారు.
ఈ అఖండ జ్యోతి మూడు రోజుల పాటు వెలుగుతుంది.

ఈ కొండపై ఎన్నో ఔషద గుణాలు కలిగిన వనమూలికలు లభిస్తాయి.ప్రతి పౌర్ణమి రోజుకి చంద్రకిరణాలు సోకి
మూలికలు అమృతత్వాన్ని పొంది ఆ మూలికల పైనుండి వీచే గాలిని పీలిస్తే ఎటువంటి వ్యాధులైన నయమవుతాయని నమ్మకం అక్కడ.అందుకే ప్రతి పౌర్ణమికి వేల సంఖ్యలో భక్తులు వచ్చి చెప్పులు లేకుండా అరుణగిరికి ప్రదక్షిణ చేస్తారట.
భక్తులు ముందుగా సుమారు 16 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగిన అరుణాచలానికి ప్రదక్షిణ చేసి అప్పుడు
ఆలయంలోకి
వెళ్తారు.
కొందరునడిచి,చేతకానివాళ్ళు వివిధ వాహనాల మీద అరుణాచలం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు.
మేము కూడా మా వెహికల్ లోనే అరుణాచలం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి ఆలయానికి బయలుదేరాము..
అరుణగిరి ప్రదక్షిణ
ఆలయానికి వెళ్ళీ వీధులన్నీ చాలా రద్దీగా వున్నాయి.ట్రాఫిక్ చాలాఎక్కువగానే వుంది.
గుడికి కొంత దూరంనుండే ఆలయప్రధాన గోపురం కనపడుతూ వుంది.
దగ్గరికి వెళ్ళేకొద్దీ ఆలయ గోపురం నేలంతా విస్తరించి,గోపుర కలశాలు ఆకాశంలోని మబ్బులను
తాకుతూ మనసును ఏదో తెలియని ఆనంద పారవశ్యంలో ముంచెత్తింది.
నేను అనుభవించిన ఆ అనుభూతిని నేను మాటల్లో ఇంకా సరిగా చెప్పలేకపోతున్నాను.
ఎంతగా
తలెత్తి చూసినా పూర్తిగా కనపడనంత ఉన్నతంగా ,అపూర్వమైన శిల్పసంపదతో
అలరారుతున్న
ఆ గోపురం అందం నేను వర్ణించలేనేమో ..
ఆలయం ప్రధాన గోపురం
ఇక్కడ నాకు నచ్చిన మరో విషయం అందమైన పూలు,పూల మాలలు..
చాలా తక్కువ రేటుకే గులాబీ, కలువ పూలదండలు ఎంతో అందంగా కట్టి అమ్ముతున్నారు..
మేము కూడా పూలదండలు,పూజా సామాగ్రి కొనుక్కుని ఆలయంలోకి వెళ్ళాము..
ఆలయంలోకి వెళ్ళగానే వెనుక అరుణాచలం దాని ముందే ఆలయ శిఖరాలతో గోపురాలు,
మండపాలు ,అపురూపమైన శిల్పకళా సౌందర్యంతో,పరిశుభ్రమైన ఆలయప్రాంగణం
కన్నులపండువగా అలౌకికమైనఆనందాన్ని కలిగించేలా వుంది.
ఆలయంలోపలి ప్రాంగణం
ముందుగా అరుణాచలేశ్వరుని ఆలయంలోకి వెళ్ళాము అక్కడ గర్భగుడిలో పూజలు చేయించి,
సుమారు పావుగంట గర్భగుడిలో కూర్చున్న మా అందరికీ వొళ్ళంతా చెమటలు పట్టేసాయి..
అప్పుడు అక్కడ పూజారి చెప్పిన స్థల పురాణం ప్రకారం అరుణాచలేశ్వరుడు పంచభూతాలలో
ఒకటైన అగ్నిలింగమని అందుకే అక్కడ ఎప్పుడు అలాగే వేడిగా ఉంటుందని తెలిసింది.
ఇంక అక్కడ పూజ అయిపోగానే స్వామివారి విభూది,కుంకుమ,ప్రసాదాలు తీసుకుని అమ్మవారి

దర్శనానికి వెళ్ళాము.
శివునిలో అర్ధ భాగం కోసం కఠోరమైన తపస్సు చేసి సాధించుకున్న అమ్మవారిని ఇక్కడ
ఉణ్ణామలై (
అపర్ణ )గా పూజిస్తారు.అమ్మవారి దర్శనం కూడా గర్భగుడిలోకి వెళ్లి ప్రశాంతంగా జరిగింది.
చాలా దగ్గరనుండి అమ్మవారిని చూసిన మాకు చాలా సంతోషంగా అనిపించింది.
అక్కడినుండి బయటికి వచ్చి అక్కడ టికెట్ తీసుకుని వెలిగించే దీపాలను అందరం తీసుకుని వెలిగించాము.
ఆలయ ప్రాంగణంలో వున్న అన్ని గుడులలో దర్శనాలు చేసుకుని ఆలయంలో వున్న కోనేరు,
ఆలయంలోనే
వున్నరమణ మహర్షి పూజ చేసిన పాతాళలింగాన్ని కూడా దర్శించుకున్నాము.
ఆలయంలోని కోనేరు
అక్కడే ప్రసాదాలు తీసుకున్నాము...ఇక్కడ ప్రసాదాలు వెరైటీగా వున్నాయి..
జంతికలు ,అరిసెలు,లడ్లు,చెక్కలు ఇలా 4 రకాల పిండివంటలు ప్రసాదాలుగా ఒక కవర్ లో పెట్టి అమ్ముతారు..
అవి కొనుక్కుని అక్కడే వున్న పులిహోర ,ఆరెంజ్ కలర్లో హల్వాలాగా అనిపిస్తున్న స్వీట్ పొంగలిని
కొనుక్కుని తిని ,ప్రశాంతంగా అక్కడే కాసేపు కూర్చుని
అనుకోకుండా మాకు కలిగిన ఈ అదృష్టాన్ని ఆ అరుణాచలేశ్వరుడు మాకు ఇచ్చిన గొప్పవరంగా భావిస్తూ
ఈ మధురానుభూతులను మా గుండెలలో పదిలపరచుకుని ఆ స్వామిని మనసులో నిలుపుకుని
గుడి బయటికి వచ్చాము..
అరుణాచలం ఆలయ నమూనా
బయటికి రాగానే ఆలయం నుండి కార్ దగ్గరికి వెళ్ళే లోపే మా కాళ్ళు మే నేల ఎండల్లో
మనరోడ్ల మీద ఎలా కాల్తాయో అలా కాలిపోయాయి.
కాళ్ళు ఎక్కడ తారు రోడ్డుకు అంటుకుపోతాయో అన్నంత భయం వేసింది.
అంత వేడిగా వుంది ఇక్కడ వాతావరణం...
ఇక్కడ కూడా షాపింగ్ చేసుకుని అరుణాచలేశ్వరుడు,అమ్మవారి ఫోటోలు కొనుక్కుని
మరలా
మా ప్రయాణం మొదలుపెట్టాము.
అరుణాచల స్తోత్రం



2 కామెంట్‌లు:

రసజ్ఞ చెప్పారు...

బాగా వ్రాశారు! నేను VITలో నా మాస్టర్స్ చదివేటప్పుడు శని, ఆది వారాలు అలా తిరువన్నామలై వెళ్ళి వచ్చేదానిని అక్కడ ఆంధ్ర ఆశ్రమం, రమణ మహర్షి ఆశ్రమం చూడదగ్గ ప్రదేశాలయితే గిరి ప్రదక్షిణం చేయడం ఒక గొప్ప అనుభూతి. నేను కాలినడకన ఎన్ని సార్లు చేసానో! అక్కడ వాతావరణమే ఏదో తెలియని ఆధ్యాత్మికతని నింపుతుంది. ఈ క్రొత్త గుడిలో ఒక చోటనుండి చూస్తే మొత్తం తొమ్మిది గోపురాలు కనిపిస్తాయి! వర్ణనాతీతం పాత గుడిని చూసి అయితే నాకు అసలు వదిలి రాబుద్ది కాలేదు! ఒకసారి అలా నా పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి! ధన్యవాదాలు!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

థాంక్యూ రసజ్ఞ గారు..
అన్నిసార్లు ఆ భగవుంతుడిని దర్శించుకోవటం,
గిరి ప్రదక్షిణ చేయటం,
ఆ వాతావరణంలో అన్ని రోజులు మీరు గడపటం మీది నిజంగా చాలా అదృష్టమండీ..
గుడిలోనుండి బయటికి రావాలనిపించలేదు మాకు కూడా
మేము కూడా రమణ మహర్షి అతిధి ఆస్రమం చూశాము.అక్కడే వున్నాము ఒక రోజు.
మీ అనుభవాలు నాతో పంచుకున్నందుకు థాంక్సండీ

Related Posts Plugin for WordPress, Blogger...