పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

31, డిసెంబర్ 2012, సోమవారం

మరికొద్దిసేపట్లో మన నుండి సెలవు తీసుకుంటున్న 2012 కు వీడ్కోలు పలుకుతూ..




 సంవత్సరం క్రితం ఏంతో  సంతోషంగా 
నా ఆహ్వానం అందుకుని మెరుపులా వచ్చి ...

ఎదురుచూపులలో నిదానంగా కదులుతూ 
కంగారులో నా మనసు కంటే  వేగంగా పరిగెత్తుతూ 
సంతోషంలో అప్పుడే అయిపోయిందా అనిపిస్తూ
బాధలో అసలు కదలకుండా మొరాయిస్తూ 
విసిగిపోయినప్పుడు నన్ను మరింతగా విసిగిస్తూ 

 కొత్త బంధాలను,స్నేహాలను చుట్టూ అల్లుతూ 
విజయాలను ఆనందించటంతో పాటూ 
ఓటమిని ఎదుర్కునే ధైర్యాన్ని అందిస్తూ 
అన్ని ఋతువుల ఆనందాలను జీవితంలో పంచుతూ..

నవ్విస్త్తూ ... ఏడిపిస్తూ ... కొత్త  ఆశలను కల్పిస్తూ
మంచి,చెడు,బాధ,సంతోషం,లాభం,నష్టం 
అన్నిటిలో వెన్నంటి ఉండి ,నాతో 365 రోజులు ప్రయాణం చేసి,
ఇంకొన్ని గంటల్లో వీడ్కోలు పలుకుతుంది 2012...

ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా తీపి,చేదుల కలయికగా ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా వెళ్లిపోయినట్లు అనిపించింది.. కుటుంబపరంగా 
ప్రతి  మనిషికీ ఏవో  సమస్యలు ఎలాగో వస్తుంటాయి పోతుంటాయి.అలాగే సమాజంలో కూడా ఈ సంవత్సరం ఎన్నో సమస్యలు, ప్రతి మనిషీ భయపడే ఎన్నో సంఘటనలు జరిగాయి.

ఆగదేనాడు కాలము ఆగినా గడియారము అంటూ  ఎవరి కోసమూ ఒక్క క్షణము కూడా ఆగని కాలం కదిలి పోతూనే వుంది.. నిన్న జరిగిన దాని నుండి నేర్చుకుని  ,ఈ రోజు జరిగేదాన్ని గురించి ఆలోచిస్తూ ,రేపటి మన కలను నిజం చేసుకోవటమే జీవితం. ఈ జీవితప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పడిలేచే కడలి తరంగం నాకు ఆదర్శం.. ఓడిపోతాను.. ఓడినా గెలుస్తాను అనే నమ్మకమే మనిషిని సంతోషంగా ఉంచుతుంది అని నమ్ముతాను.

మరికొద్దిసేపట్లో మన నుండి సెలవు తీసుకుంటున్న  2012 కు  వీడ్కోలు పలుకుతూ.. రాబోయే కాలం అంతా మంచి జరగాలని కోరుకుంటూ...




25, డిసెంబర్ 2012, మంగళవారం

ఏమైపోతుంది సభ్యసమాజం ... ఏమైపోతుంది మానవ హృదయం




2012 యుగాంతం ప్రపంచం అంతా అంతమైపోతుంది.. ఇంక ఈ  భూమి మీద మనుగడ లేదు అని అందరూ భయపడ్డారు.కొందరు బాధ పడ్డారు.కొంతమంది చూద్దాంలే అంత  తేలికగా యుగాంతం అవుతుందా అనుకున్నారు.కొందరు ఉంటే  ఎంత పొతే ఎంతలే అని వేదాంతం చెప్పారు.కానీ ప్రస్తుత సమాజాన్ని,పరిస్థితులను చూస్తుంటే నాకనిపిస్తుంది 2012 యుగాంతం మనుషులకా? మనుషుల్లోని మానవత్వానికా ??  అని..

ఆడవాళ్ళ మీద అత్యాచారాలు,హత్యలు,ప్రేమోన్మాదుల దాడులు
భార్యను బయటికి గెంటేస్తున్న భర్తలు, భర్త ఇంటిముందు  భార్యల మౌన దీక్షలు.

భార్య మీద అనుమానంతో పిల్లలకు DNA టెస్టులు చేయించమనే తండ్రులు
భర్త మీద కోపంతో క్షణికావేశంలో కడుపున పెట్టుకుని కాపాడాల్సిన పిల్లలను  కడతేర్చే మాతృమూర్తులు

కీచకావతారం ఎత్తుతున్న గురుదేవులు
బడిలో బాలికకూ,విశ్వవిద్యాలయంలో మహిళలకు తప్పని లైంగిక వేధింపులు

బతికుండగానే కన్నతల్లిదండ్రులను స్మశానానికి చేరుస్తున్న సుపుత్రులు,పుత్రికలు
తమ కడుపున పుట్టిన పిల్లలే తమని వేధిస్తున్నారంటూ కాపాడమని HRC ని ఆశ్రయిస్తున్న పండుటాకులు.

ప్రజారక్షణే మీ కర్తవ్యం  కదా మమ్మల్నిరక్షించమని  వచ్చిన మహిళను కోరిక తీర్చమనే రక్షక భటులు
తన కింద పనిచేసే మహిళా ఉద్యోగితో అక్రమసంబంధం పెట్టుకుని ఆమెను వంచించే న్యాయమూర్తులు.

ఇలాంటివన్నీ గత కొన్ని సంవత్సరాలుగా " FIR " " CRIME REPORT " అంటూ టీవీల్లో యాంకర్లు
మహా సీరియస్ గా వీటి గురించి చెప్తూ ఉంటారు...వాటిని చూస్తూ,వింటూ ఇదేముందిలే ఇలాంటివి రోజూ జరుగుతూనే వున్నాయి అనుకోవటం,వాటిలో నిజానిజాలు ఎంత? ఎవరిది తప్పు ? అని మనమే నిర్ణయించేసుకోవటం కాసేపటి తర్వాత ఆ విషయాలు మర్చిపోవటం.. వదిలేయటం.. ఇలా మనమందరం ఈ దారుణాలను,అమానుష సంఘటనలను సమాజంలో భాగంగా చాలా తేలికగా తీసుకునే స్థాయికి వచ్చాము...

ఇలాంటి సమయంలో రాజధానిలో జరిగిన సామూహిక అత్యాచారం సంఘటన  ఇంతకుముందు కేసుల్లాగానే  విచారణ,పరిష్కారం అంటూ సంవత్సరాలు పడుతుందిలే  అనుకున్నాము.. కానీ ఈ అత్యాచారం విషయంలో ప్రజల్లో,మహిళా సంఘాల్లో,ముఖ్యంగా యువతరంలో కలిగిన స్పందన అనూహ్యం, ప్రశంసనీయం. వారిలో చెలరేగిన ఆవేశం,దోషులకు ఉరిశిక్షపడాలనే ఆవేదన ప్రభుత్వాన్ని,పాలకులను  ఆలోచనలో పడేలా చేసింది.వీరి దీక్షకు మధ్యవయస్కులు, సాదారణ పౌరులు కూడా మద్దతు పలకటం సమాజంలో మిగిలి ఉన్న మానవత్వానికి నిదర్శనం అని చెప్పొచ్చు.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతను చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగా హింసాత్మక చర్యలకు కూడా ప్రభుత్వం వెనుకంజ వేయకపోవటం శోచనీయం...

అమ్మాయిల మీద దాడులు జరిగినప్పుడు అసలు అమ్మాయిల వస్త్రధారణ సరిగా లేదు అందుకే
మగవాళ్ళు పశువుల్లా ప్రవర్తిస్తున్నారు అంటాడు ఒక అధికారి.

అసలు ఆడవాళ్ళకి అర్ధరాత్రి తిరిగే సాతంత్ర్యం,హక్కు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నిస్తాడు  మరో నాయకుడు ..

 అర్ధరాత్రి బాయ్ ఫ్రెండ్ తో తిరిగే ఆడపిల్లలు ఇలాంటివి జరుగుతాయని తెలియదా అంటారు పెద్దవాళ్ళు.

అసలు ఆడవాళ్ళదే  తప్పు ఎక్కడ ఎలా ఉండాలి?ఎక్కడికి ఎప్పుడు వెళ్ళాలి? అని తెలుసుకోవాలి అంటారు సాంప్రదాయవాదులు.( ఇది కొంతవరకు నిజమే)

చట్టం,న్యాయం తన పని తాను  చేసుకుపోతుంది అంటారు మేధావులు..

సరే వీళ్ళ మాటలే నిజమని ఒప్పుకుంటే  సినిమాలు,సినిమాల్లో చెడుని చూసి పెడత్రోవ పట్టే యువత
అంత తేలికగా సినిమాలను చూసి ప్రభావితం అయ్యేటట్లయితే సినిమాల్లో మంచిని చూసి నేర్చుకోవచ్చు
కదా  మంచి వస్త్రధారణ,ప్రవర్తన ఉన్న మహిళల మీద దాడులు జరగట్లేదా?బయట తిరిగే స్వాతంత్ర్యం
లేకపోతె పోనీ ఆఫీసుల్లో స్వేచ్చగా పనిచేసుకునే పరిస్థితులు ఉన్నాయా??కార్యాలయాల్లో,కాలేజీల్లో ప్రయాణాల్లో,కనీసం ఇంట్లో  ఇలా ఇంకెన్నో చోట్ల చెప్పుకోలేని ఇబ్బందులకు గురయ్యి మౌనంగా బాధపడే
మహిళలు ఎందరో  లేరా?

వీటన్నిటికీ కారణం నేరస్తుల్లో చట్టం,న్యాయం మమ్మల్ని ఏమి చేస్తాయిలే అన్న తెగింపు, ఎన్ని తప్పులు
చేసినా చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని తప్పించుకో గలము అనే లెక్కలేనితనం..దీనికి పరిష్కారం లైంగిక నేరాల చట్టాలను సవరించి, మరింత పటిష్టం చేయటం,ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేసి వేగవంతంగా విచారణ పూర్తి  చేయటం,ప్రలోభాలకు లొంగకుండా తీర్పును వెలువరించి,శిక్షను అమలుచేయటం ప్రస్తుత కర్తవ్యం. .అని అందరి అభిప్రాయం .

 అలాగే ప్రభుత్వం, పాలకులు మహిళలలోని లోపాలను ఎత్తిచూపి మీ వల్లనే ఇలా జరుగుతున్నాయంటూ
తప్పును ఆపాదించి,నిందించకుండా మీ ప్రయత్నం లో భాగంగా సరైన శాసనాలను,చట్టాలను చెయ్యాలి.
మహిళలకు రక్షణ కల్పించాలి..ఆపదలో ఉన్నామని ఆశ్రయించిన వాళ్లకు సత్వర సహాయం అందించే రక్షణ యంత్రాంగాన్ని సక్రమంగా అమలు చేయాలి. మనుషుల్లో సాటి మనిషిని మనిషిగా గౌరవించే  సహృదయం,మానవత్వం, నైతికవిలువలు, మంచి.చెడుల విచక్షణా జ్ఞానం పెంపొందాలి.

ఈ సమస్య తీరిపోతే ఇంకే సమస్య రాదన్న నమ్మకం లేకపోయినా, ఉరిశిక్ష,లేక ఇంకే కఠిన శిక్ష పడితేనో
ఇంకో నేరస్తుడెవడూ ఇలాంటి నేరం చేయడన్న నమ్మకం లేకపోయినా మంచి మనస్సుల్లో  మొదలైన
ఈ ఉద్యమం రాజకీయరంగు పులుముకోకుండా  అనుకున్న లక్ష్యం సాధించాలని కోరుకుంటూ,
సభ్యసమాజం తలదించుకునే ఇలాంటి సంఘటనలు  మళ్ళీ జరగకూడదని,  తాను ఎలాంటి తప్పు
చేయకపోయినా  దారుణమైన శిక్ష అనుభవిస్తున్న బాధితురాలికి సరైన న్యాయం జరగాలని
సాటి మనుషులుగా ఆకాంక్షించటం మానవత్వం  ఉన్న ప్రతి  మనిషి  కర్తవ్యం...




23, డిసెంబర్ 2012, ఆదివారం

పదకవితా పితామహుడు - అన్నమయ్య






అన్నమయ్య - తాళ్ళపాక అన్నమాచార్యులు (1408-1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు, సంకీర్తనాచార్యుడు .వాగ్గేయకారుడంటే పాటలు స్వయంగా వ్రాసి పాడేవాడని అర్ధం.అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉన్నది. దక్షిణపధంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని, అహోబిలములోని నరసింహ స్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసుకొని ఉంటాయి.. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమైపోయాయి.

అన్నమయ్య మనుమడు "తాళ్ళపాక చిన్నన్న"  "అన్నమాచార్య చరితము" అన్న ద్విపద కావ్యములో అన్నమయ్య జీవిత విశేషాలను పొందుపరచాడు..అన్నమయ్య జీవితం గురించి మనకు తెలిసిన వివరాలకు
ఈ రచనే ఆధారం.

"తెలుగు పదానికి జన్మదినం - అన్నమయ్య జననం"
సంతానం లేని అన్నమయ్య తల్లిదండ్రులు వెంకటేశ్వరస్వామికి మొక్కుకుని,తిరుమల తిరుపతిని దర్శించుకొని, ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రమాణం ఆచరించినపుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని అన్నమయ్య జన్మగాధ..

తన 8వ ఏట ఎవరికీ చెప్పకుండా అన్నమయ్య కాలినడకన తిరుపతి బయలుదేరాడు. సంప్రదాయం తెలియక తిరుమల కొండను చెప్పులతో కొండనెక్కుతుండగా అలసిపోయి ఒక వెదురు పొదలో నిద్రపోతున్న ఆయనకు కలలో అలివేలు మంగమ్మ దర్శనమిచ్చి పరమాన్నాన్ని ప్రసాదించి, పాదరక్షలు లేకుండా కొండనెక్కమని బోధించింది.
"వేడుకుందామా  వేంకటగిరి వేంకటేశ్వరుని
అని  కీర్తిస్తూ  యాత్రికులతో కలిసి తిరుపతి చేరుతాడు అన్నమయ్య..తిరుమల కొండను  సందర్శించి పరవశం తో
"అదివో అల్లదివో శ్రీ హరివాసము" 
అంటూ  తిరుమల గిరులను  స్తుతించి,గురువుల వద్ద వైష్ణవ తత్వాలను తెలుసుకొంటూ, ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ,

"అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీవుయ్యాల"
అని వేంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే  జీవితం గడపసాగాడు అన్నమయ్య.. అన్నమయ్య చెప్పిన కీర్తనలను ఆయన శిష్యులు గానం చేస్తూ తాళపత్రాలలో భద్రపరచేవారట ..

అంటూ  లక్ష్మీదేవిని, 
"పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు" అని అలమేలుమంగను 
"పలుకు తేనెల తల్లి  పవళించెను" అంటూ పద్మావతీదేవిని
కీర్తించే అన్నమయ్య కీర్తనలను వినటం అమ్మవారికి కూడా చాలా ఇష్టమట. 

అంటూ స్వామివారి బ్రహ్మోత్సవాలలో స్వామిని కీర్తించాడు అన్నమయ్య.ఇప్పటికీ బ్రహ్మోత్సవం అంటే అందరికీ గుర్తొచ్చే పాట ఇది.
అంటూ మనుషులందరూ పరబ్రహ్మ స్వరూపమే అని, కులమతాల వివక్షను తొలగించే ప్రయత్నం చేశాడు.

 విజయగర రాజ ప్రతినిధి, దండనాధుడు అయిన సాళ్వ నరసింగరాయలు. అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. రాజ ప్రాపకం వలన అన్నమయ్య సంగీత ప్రభావం కన్నడదేశంలో ప్రసిద్ధమయ్యింది. 

"ఏమొకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను" 
అంటూ అన్నమయ్య స్వామివారి శృంగారాన్ని  గురించి పాడిన పాటను విన్న  నరసింగరాయలు తరువాతి కాలంలో  అన్నమయ్యను తనపై కూడా ఒక్కపదాన్ని వినిపించమని కోరాడట. హరిని కీర్తించే నోట నరుని కీర్తించనని అన్నమయ్య నిరాకరించినందున, కోపించి రాజు అతనిని చెరసాలలో సంకెళ్ళలో ఉంచాడట..రాజాస్థానం తనకు తగినది కాదని తెలుసుకొని అన్నమయ్య తిరుమల చేరాడు. తన శేషజీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలో, సంకీర్తనా దీక్షలో గడిపాడు.

"దాచుకో నీ పాదాలకు తగ నే చేసిన పూజలివే"
"అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితినీ"
అని స్వామివారిలో ఐక్యం అయ్యాడు అన్నమయ్య..

అన్నమయ్య శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. "పదకవితా పితామహుడు", "సంకీర్తనా చార్యుడు", "పంచమాగమ సార్వభౌముడు", "ద్రవిడాగమ సార్వభౌముడు" - ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు
  
అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అన్నమయ్య  కీర్తనలు ఆ దేవ దేవునికే కాదు ఆబాల గోపాలానికి అన్నమయ్య పాటలు ప్రియమైనవే ...అందుకే కదా ప్రతి తెలుగుతల్లి తన బిడ్డకు చందమామను చూపిస్తూ,గోరుముద్దలు తినిపిస్తూ...
"చందమామ రావో జాబిల్లి రావో"
అంటూ  పాడుతూంది..
అంటూ జోలపాడి నిద్రపుచ్చుతుంది.

ఇప్పటికీ తిరుమల గిరివాసుడు అన్నమయ్య మేలుకొలుపు వింటూ నిదురలేచి,జోలపాట వింటూ నిద్రపోతాడట.అన్నమయ్య పాట స్వామి  దైనందిన చర్యలో ఒక భాగమై నిలిచింది.నిధి కాదు హరిపద సన్నిధి చాలా సుఖమని నమ్మి నడచిన పరమభాగవతుడు అన్నమయ్య...అన్నమయ్య పదములు వినగలిగిన మనమూ ధన్యులమే 

 

ఇందరికి అభయమ్ము లిచ్చు చేయి..



  ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగంటే అన్నమయ్య పాట అనిపించుకున్నతెలుగు పదకవితా పితామహుడు 
శ్రీ తాళ్ళపాక  అన్నమాచార్యులకు వందనములతో.


 

14, డిసెంబర్ 2012, శుక్రవారం

కార్తీకమాసం - మా సత్యనారాయణస్వామి వ్రతం





హరిహరులకు ఇష్టమైన కార్తీకమాసంలో మేము చేసుకున్న 
సత్యనారాయణ స్వామివ్రతం 

శ్రీసత్యనారాయణుని సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా
 నోచిన వారికి నోచిన వరము
చూసిన వారికి చూసిన ఫలము



 

 





శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా





26, నవంబర్ 2012, సోమవారం

అవును పిచ్చెక్కించటం చాలా సులభం ..




ఈ లోకంలో మనిషికో పిచ్చి వుంటుంది ఒకళ్ళకి సినిమాల పిచ్చి,మరొకరికి డబ్బు పిచ్చి,ప్రేమ పిచ్చి,ఇంకొకళ్ళకి పేరు ప్రతిష్టలు, పదవుల కోసం పిచ్చి.. ఇలా పిచ్చి రకరకాలు. ఎవరైనా అర్ధం లేకుండా మాట్లాడుతున్నా విసిగిస్తున్నా నీకేమైనా పిచ్చెక్కిందా అంటుంటాము.. కానీ ఇప్పుడు నేను చెప్పేది అలాంటి పిచ్చి గురించి కాదు.. మానసిక ఆరోగ్యానికి సంబంధించిన పిచ్చి అనే వ్యాధి గురించి..

మనసు ఎంత బలమైనదో అంత బలహీనమైనది కూడానట.అందుకేనేమో ఎదుటి మనిషి ప్రవర్తనను బట్టి మన మనసు స్పందిస్తూ వుంటుంది..మన అనుకున్న వాళ్ళు  ప్రేమిస్తే సంతోషించటం, చిన్నమాట అన్నా బాధపడటం అన్నిటికీ మనసే కదా మూలం.మనసుకు బాధ కలిగినప్పుడు కొన్ని మనసుల భాష మౌనమైతే మరి కొన్ని మనసుల బాధ పిచ్చి...ఎలాంటి వ్యాదికైనా నివారణ ఉన్నట్లే ఈ మానసిక వ్యాధికి పరిష్కారం వుంది.. అలాగే ఎవరికైనా పిచ్చిలేకపోయినా పిచ్చెక్కిస్తా అంటూ.. పిచ్చివాళ్ళగా  తయారుచేసే అవకాశం కూడా వుంది ..

 అవునండీ నేను చెప్పేది నిజమే..! మనం ఎవరినైనా పిచ్చి వాళ్ళు అని నిరూపించాలనుకుంటే  పిచ్చెక్కించటం చాలా సులభం ..మనకి  సంఘం లో కొంత పలుకుబడి,డబ్బు,పరిచయాలు ఉంటే చాలు ఎవరినైనా పిచ్చి వాళ్ళను చేసేయొచ్చు..రెండు రోజుల క్రితం న్యూస్ లో  చూశాను ఒక లాయర్ తన భార్య పిచ్చిదని నిరూపించి విడాకులు తెచ్చుకోవాలనుకున్నాడు.. అనుకున్నదే తడవుగా తనకు తెలిసిన ఒక మానసిక వైద్యునితో కలిసి భార్యకు మత్తు మందులు ఇచ్చి కరెంట్ షాక్ తో పిచ్చిదాన్ని చేసే ప్రయత్నం చేశాదు కానీ ఆ భార్య ఎలాగో తప్పించుకుని, మీడియాను ఆశ్రయించి ఈ విషయాన్ని బయటపెట్టింది..ఇది బయటపడిన ఒక మనిషి సమస్య మాత్రమే ..కానీ నిజంగా మానసిక సమస్య లేకపోయినా మానసిక వైద్యం పేరుతో శిక్ష అనుభవిస్తున్న ఇలాంటి మానసిక రోగులు ఎందరో ..

ప్రేమలో విఫలమయ్యామని ,జీవితంలో అనుకున్నది జరగలేదని, ఎదుటివాళ్ళు తమను సరిగా అర్ధ చేసుకోవటం లేదని, ఇంకా రకరకాల కారణాలతో మానసిక రోగులుగా తయారయ్యేది కొందరైతే, ఒక మనిషి మానసిక పరిస్థితి సరిగా లేనప్పుడు వాళ్ళు ఎలాంటి నేరం చేసినా దాన్ని నేరంగా పరిగణించదుచట్టం.దీన్ని ఆసరాగా చేసుకుని,శిక్ష తప్పించుకోవటానికి పిచ్చి అని నిరూపించుకునే  వాళ్ళు కొందరు, అలాగే ఆస్తుల కోసం, ఇంకా రకరకాల కారణాలతో సొంత వాళ్ళనే కావాలని పిచ్చివాళ్ళను చేసేవాళ్ళు కొందరు

ఎవరికైనా జ్వరం వస్తే అది ఏ జ్వరం అని టెస్ట్ చేసి నిర్ణయిస్తారు డాక్టర్లు.కానీ నాకు తెలిసి మానసిక వైద్యులు ఒక మనిషిని పిచ్చివాడు అని నిర్ణయించటానికి ఎక్కువగా ఆధారపడేది టెస్టుల కంటే  రోగికి సంబంధించిన  సొంత మనుషుల మాటల  మీదనే.. ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యం సరిగా లేదని  సైకాలజిస్టు దగ్గరికి వెళ్ళగానే ఆ డాక్టర్ రోగిని బయటికి పంపి, అతని  కుటుంబ సభ్యులను కొన్ని ప్రశ్నలు అడిగి,ఆ రోగి పరిస్థితి గురిచి ఒక అంచనాకు వస్తారు..ఇక్కడ కుటుంబ సభ్యులు రోగి  గురించి ఇచ్చే సమాచారమే  కీలకంగా మారుతుంది..ఇదే మంచి అవకాశంగా తీసుకుని ఎదో కొంచెం మెంటల్ డిప్రెషన్ లో ఉన్న వ్యక్తిని కూడా  అతని ప్రవర్తనను గోరంతలు కొండంతలుగా వర్ణించి,డాక్టర్ ను కూడా నమ్మించి,పిచ్చి కోసం ట్రీట్ మెంట్  ఇప్పించి ఆ వ్యక్తిని  పూర్తి స్థాయి మానసిక రోగిగా మార్చిన సందర్భాలు కూడా లేకపోలేదు..

పిచ్చిని  నిర్ధారించటాని చేసే క్లినికల్ సైకాలజీ టెస్ట్ ల  ద్వారా రోగి ప్రవర్తనా సరళిని గమనించటం, రోగిని ప్రశ్నించడం ద్వారా తెలుసుకునే విషయాలను అన్నిటినీ కలిపి ఒక వ్యక్తి  మానసిక ఆరోగ్య పరిస్థితిని గురించి ఒక అవగాహనకు  వస్తారు సైకాలజిస్టులు ..మానసిక వైద్యం కోసం ఒక మనిషిని ఎవరైనా తీసుకు రాగానే పరోక్షంగా రోగి  ప్రవర్తనను ఇతరుల ద్వారా తెలుసుకోవటం , ఒక నిర్ణయానికి వచ్చేసి ట్రీట్ మెంట్ ప్రారంభించడం  మాత్రమే కాకుండా , న్యూరో  సైకలాజికల్‌ విధానం అమలు చేసి, రోగి ఇచ్చే సహకారం, అతనిలో ఉత్కంఠత ( Anxiety ) , ఇంకా ఇతర ప్రవర్తనలను అంచనా వేయడం జరుగుతుంది. రోగి మెదడు  ఆకస్మికంగా పని చేయకపోయినట్లయితే అనేక కారణాల రీత్యా అంచనాలు జరగవలసి ఉంటుంది.ప్రాథమిక పరీక్షల వల్ల, ప్రశ్నించడం వల్ల రోగికి సంబంధించిన చాలా విషయాలు తెలుస్తాయి. వ్యక్తిగతంగా రోగిని పరీక్షించి, సైకలాజికల్‌  అనాలసిస్ చేయటం వలన  అసలు
ఆ రోగికి ఎటువంటి చికిత్స అవసరమో వైద్యులకు అర్థమవుతుంది.దాని ద్వారా అతనికి  ట్రీట్ మెంట్ చేయటం సులభం అవుతుంది.

ఇదంతా దైవంతో సమానమని నమ్మే వైద్యులు ఒక మానసిక రోగిని కాపాడటానికి చేసే  ప్రయత్నాలు..కానీ అన్ని చోట్లా మోసం,అవినీతి ఉన్నట్లే డబ్బు,పరిచయాలు,స్నేహాల కోసం ఒక మనిషిని పిచ్చివాడిగా నిరూపించగలిగే  సైకాలజిస్టులు కూడా ఉంటారనేది అందరికీ తెలిసిన నిజమే.ఒకప్పుడు పాత సినిమాల్లో,ఇప్పటికీ కొన్ని సీరియల్స్ లో మామూలు మనుషుల్ని పిచ్చివాళ్ళ గా తయారు చేయటం లాంటి కధలు ఉండేవి.అలాంటివి సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా జరుగుతున్నాయని  ఈ లాయర్ విషయం ద్వారా మరోసారి  బయటపడింది...

ఇలాంటి విషయాలు  తెలిసినప్పుడు అయ్యో  ఇలా  జరుగుతుందా అని బాధపడటం,తర్వాత
ఎవరి పనుల్లో వాళ్ళం బిజీ అయిపోవటం.ఇంతకన్నా ఏమీ చేయలేని సగటు మనుషులము కదా అంతే మరి..
ఇదంతా నా మనసుకు అనిపించింది ... చెప్పేశాను..ఎవరి పిచ్చి వాళ్లకి ఆనందం అంటారు కదా...

ఏది ఏమైనా కానీ కలత పడిన మనసుకు మరొక  మనసు మాత్రమే స్వాంతనను కలిగిస్తుంది అనేది మాత్రం నిజం. స్వచ్ఛమైన మనసు, ప్రేమపూర్వక స్పర్శ, చిన్న ఓదార్పు మానసికంగా ధైర్యాన్నిస్తుంది..మనసుకు ఎంతో ఆత్మీయతను అందిస్తుంది.. కొండంత అండను, ఉపశమనాన్ని ఇస్తుంది..
 



మనసొక మధుకలశం పగిలే వరకే 
అది నిత్య సుందరం 





24, నవంబర్ 2012, శనివారం

మా చిన్నిప్రపంచానికి యువరాజు ...



అక్టోబర్ -22- 2012  దుర్గాష్టమి... అందరూ  దుర్గాష్టమి పూజల  సందడిలో ఉంటే  మాకు మాత్రం విపరీతమైన టెన్షన్.మా చెల్లికి డెలివరీ టైం ఉదయం నుండి మొదలైన మా టెన్షన్ సాయంత్రం 5.24 కు మా చేతిలోకి చిన్నారి బాబును అందుకుని,ఆ తర్వాత మా చెల్లి క్షేమంగా మాట్లాడటం చూసేదాకా కంటిన్యూ అయ్యింది..కొన్ని పరిస్థితుల్లో ఎంత తప్పదు  అని తెలిసినా భయపడటం,బాధపడటం మానవ సహజం అనుకుంటాను.


 బాబును చూడగానే అప్పటిదాకా మేము పడిన బాధ,భయం అన్నీ మాయం అయినట్లయింది ..బాబు నాన్నగారికి,బంధువులకి అందరికీ విషయం చెప్పేసి,అందరి అభినందనలు అందుకుని, అప్పటి నుండి ఇప్పటిదాకా చెల్లిని,బాబుని కేర్ తీసుకునే విషయంలో  నెలరోజులు ఎలా గడిచిపోయిందో  కూడా తెలియలేదు.నా చిన్ని ప్రపంచానికి యువరాజు,
మా చెల్లి,మరిది గారి ప్రేమకు ప్రతిరూపం, మా బుజ్జి బుజ్జాయి,చిన్నారి చందమామ రాకతో మా బొమ్మరిల్లు ఆనందాల హరివిల్లుగా మారిపోయింది... 


వింత వింత హావభావాలతో, తన చిన్ని చిన్ని కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న మా  చిన్నారి పేరు "జయాదిత్య". జన్మనక్షత్రం ప్రకారం ఆ పేరు పెట్టాము.శివుడికి ఇష్టమైన సోమవారం,అమ్మవారి దుర్గాష్టమి రోజున శివపార్వతుల కానుకగా  వచ్చిన మా బుజ్జాయికి నేను పెట్టుకున్న ముద్దు పేరు కుమార స్వామి.. ఇంకా ఎన్నెన్నో ముద్దు పేర్లు.. ఎవరికి  ఎప్పుడు ఎలా నచ్చితే అలా పిలవటం  :) ఇవండీ ప్రస్తుతానికి మా బుజ్జి కుమారస్వామి కబుర్లు.. ఇంకా మరెన్నో కబుర్లున్నాయి..

మా చిన్నారి జయాదిత్యను  భగవంతుడు  తన చల్లని  ఆశీస్సులతో  కాపాడి,ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో,సుఖ సంతోషాలతో దీవించాలని ప్రార్ధిస్తూ.. అమ్మా,నాన్నలయిన మా చెల్లి,మరిది గారు భద్ర,రమ్య లకు 
నా చిన్నిప్రపంచం తరపున హృదయపూర్వక అభినందనలు... 

మా చిన్నారి "జయాదిత్య" కు "నా చిన్నిప్రపంచం" ఫ్రెండ్స్ కూడా 
మీ  దీవెనలను అందించమని కోరుకుంటున్నాను.


Dear Ramya, Bhadra

 Congratulations on one of your best moments in life. 
May this little parcel of joy bring 
prosperity, joy and luck to you. 

 May your new little one grow strong, 
wealthy and wise. 
Congratulations for the new baby! 
చిన్ని  తండ్రీ నిను చూడగా 
వేయి కళ్ళైన సరిపోవురా 
 అన్ని కళ్ళూ చూస్తుండగా 
నీకు దిష్టెంత దిష్టెంత తగిలేనురా 
అందుకే అమ్మ ఒడిలోనే దాగుండి పోరా..




13, నవంబర్ 2012, మంగళవారం

దీపలక్ష్మీ నమోస్తుతే - దీపావళి శుభాకాంక్షలు



హృదయంలో  ప్రేమ జ్యోతులు 
మనసులో శాంతి జ్యోతులు 
కుటుంబంలో ఆనంద జ్యోతులతో 
అందరి  జీవితాలలో సుఖ సంతోషాలనే  
కోటి కాంతుల వెలుగులు నిండాలని కోరుకుంటూ 

శుభదీపావళి శుభాకాంక్షలు 


 


 

24, అక్టోబర్ 2012, బుధవారం

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి ...


 శ్రీ రాజరాజేశ్వరీదేవి - 24 - 10 - 2012 

ఆశ్వయుజ దశమి - విజయ దశమి 
దసరా 

పదవ రోజైన ఆశ్వయుజ దశమినాడు అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు. షోడశ మహా విద్యా స్వరూపిణి మహా త్రిపుర సుందరీ, 
శ్రీ చక్ర అధిష్టాన దేవత ఈ రాజరాజేశ్వరి దేవి. దేవీ నవరాత్రుల్లో తొమ్మిదిరోజుల తర్వాత జరుపుకునే విజయదశమి అపరాజితాదేవి పేర మీద ఏర్పడిందంటారు. 
శ్రీ రాజరాజేశ్వరి నివాసం శ్రీ మన్మణి ద్వీప శ్రీనగర స్థితి చింతామణి గృహం. పరమశాంత స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ ఇయు ఖండాన్ని (చెరుకుగడ) చేతిలో ధరించి ఒక చేత అభయ ముద్రతో దర్శనమిస్తుంది.

 రాజరాజేశ్వరీ రాజ్యదాయనీ రాజ్య వల్లభా’


అంబా సృష్టి వినాశ పాలనకరీ ఆర్యా విసంశోభీతా
గాయత్రీ ప్రణవాక్ష రామృతసరః పూర్ణానుసంధీకృతా
ఓంకారీ వినుతా సురార్చిత పదా ఉద్దండ దైత్యాపహా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి 

  శ్రీ రాజరాజేశ్వరీ స్తోత్రం 









23, అక్టోబర్ 2012, మంగళవారం

జయ జయహే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలశుతే


శ్రీ మహిషాసురమర్దనీ దేవి - 23 - 10 - 2012

ఆశ్వయుజ నవమి - మహర్నవమి 

 తొమ్మిదోరోజైన ఆశ్వయుజనవమి నాడు అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్దనిగా అలంకరిస్తారు. శరన్నరాత్రులలో చివరిరోజు నవమి. దీనినే  మహర్నవమి అంటారు. దుర్గాదేవి అష్ట భుజాలతో, దుష్ట రాక్షసుడైన మహిషాసురుడ్ని చంపి లోకాలన్నింటికీ మేలు చేసింది. 
మహిషాసురమర్దనీ దేవి సింహ వాహనం మీద ఒక చేత త్రిశూలం తో మహిషాసురుడ్ని సంహరిస్తున్న రూపంలో దర్శనం ఇస్తుంది.

 ‘అపర్ణా చండికా చండమండాసుర నిఘాదినీ’



అయిగిరి నందిని నందిత మేదిని
విశ్వవినోదిని నందినుతే 
గిరివర వింధ్య శిరోధినివాసిని 
విష్ణువిలాసిని జిష్ణునుతే 
భగవతి హే శితికంఠకుటుంభిని భూరికృతే 
జయ జయ హే మహిషాసురమర్ధిని 
రమ్యకపర్దిని శైలశుతే

 మహిషాసుర మర్దినీ స్తోత్రం 








22, అక్టోబర్ 2012, సోమవారం

దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖ హంత్రీ సుఖ ప్రదా


శ్రీ దుర్గాదేవి - దుర్గాష్టమి - 22 - 10 - 2012 

ఆశ్వయుజ శుద్ధ అష్టమి 

ఆశ్వయుజ శుద్ధ అష్టమినాడు అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరిస్తారు. దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపిణి అమ్మవారు దుర్గాదేవి. 
ఈ రూపంలో అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచప్రకృతి మహాస్వరూపాలలో దుర్గాదేవి మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షం ప్రసాదిస్తుంది. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మని అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి. విజయం కలుగుతుంది. సకల గ్రహ బాధలు తల్లి నామం జపిస్తే తొలగిపోతాయి. 

ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి, ఎర్రని బట్టలు పెట్టి, ఎర్ర అక్షతలు, ఎర్ర పుష్పాలతో అమ్మను పూజించాలి. దుర్గా సూక్తం పారాయణం చెయ్యాలి. “ఓం దుం దుర్గాయైనమః” అనే మంత్రాన్ని పఠించాలి.“ఆయుధ పూజ లేక అస్త్రపూజ” చేస్తారు. దుర్గమ్మను లలితా అష్టోత్తరం, లలితా సహస్రంతో పూజిస్తే ఆ తల్లి పరమశాంతి స్వరూపంతో మనల్ని కటాక్షిస్తుంది. శరన్నవరాత్రుల్లో శార్దూల వాహినిగా, త్రిశూలాన్ని ధరించిన శక్తిస్వరూపిణిగా దర్శనమిస్తుంది.
  
 దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖ హంత్రీ సుఖ ప్రదా



యాదేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై  నమో నమః
యాదేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై  నమో నమః

శ్రీ దుర్గా స్తోత్రం 
 
 

  


21, అక్టోబర్ 2012, ఆదివారం

ప్రాత:స్మరామి లలితావదనారవిందం ...

 
 శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి - 21 - 10 - 2012
ఆశ్వయుజ శుద్ధసప్తమి 

ఈరోజు అమ్మవారిని శ్రీలలితా  సుందరిగా అలంకరిస్తారు.
త్రిపురత్రయంలో రెండో శక్తి లలితాదేవి.ఈమెనే త్రిపుర సుందరి అంటారు.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులకన్నా పూర్వం నుంచి వున్నది కాబట్టి త్రిపుర సుందరి అను పిలువబడుతుంది.శ్రీ చక్ర అధిష్టాన శక్తిగా,పంచదశాక్షరీ మహామంత్ర అధిదేవతగా భక్తుల్నిఉపాసకుల్ని అనుగ్రహిస్తుంది.

దుర్గమ్మ సన్నిధిలో శంకరాచార్యుల వారిచే ప్రతిష్టితమైన శ్రీచక్ర అధిష్టాన దేవత కూడా లలితా త్రిపుర సుందర దేవియే.లలితా సహస్ర నామంలో వర్ణించినట్లు ' సచామర రమావాణీ సవ్య దక్షిణ సేవితా ' అన్నట్లు లక్ష్మీ దేవి,సరస్వతీ దేవి అటు ఇటు నిలబడి లలితా దేవిని వింజామరతో సేవిస్తున్నట్లుగా అలంకారం చేస్తారు. చిరునవ్వులు చిందిస్తూ,చేతిలో చెరకుగడను ధరించి,శివుని వక్ష స్థలం మీద కూర్చుని,  అపురూపంగా శ్రీ లలితాదేవి దర్శనమిస్తుంది.

   సచామర రమావాణీ సవ్య దక్షిణ సేవితా



ప్రాత: స్మరామి లలితావదనారవిందం
బింబాధరం పృధుల మౌక్తిక శోభినాశమ్
ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాడ్యం
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్


 లలితా పంచరత్నం 







20, అక్టోబర్ 2012, శనివారం

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామ రూపిణీ


శ్రీ సరస్వతీ దేవి (మూలా నక్షత్రం) - 20 - 10 -2012
ఆశ్వీయుజ  పంచమి,షష్టి 

ఆశ్వయుజ శుద్ధ పంచమి,షష్టి మూలా నక్షత్రం నాడు దుర్గమ్మ సరస్వతీ దేవిగా దర్శనమిస్తుంది.సరస్వతీదేవిని చదువుల తల్లిగా కొలుస్తారు.
తల్లి సకల విద్యలను ప్రసాదించి,జ్ఞాన దీపాన్ని వెలిగించే విద్యాశక్తి.
త్రిశక్తులలో మహాలక్ష్మి,మహా కాళి,మహాసరస్వతి మూడు రూపాలు.

దసరా నవరాత్రుల్లో సరస్వతీ దేవి అలంకారానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రంరోజు ఈ అలంకారం చేస్తారు.ఈ రోజున అమ్మవారిని విద్యార్ధులు భక్తితో పూజిస్తే అన్నింటా విజయం లభిస్తుందని నమ్మకం.సరస్వతీ దేవి ధవళ వస్త్రాలను ధరించి,తెల్లని హంస వాహనం పై చేతిలో కచ్ఛపి అనే వీణను ధరించి వీణాపాణి గా దర్శనమిస్తుంది.

 సరస్వతీ నమస్తుభ్యం వరదే కామ రూపిణీ 
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భావతు మే సదా ||

 
 
యా కుందేందు తుషారహార ధవళా యాశుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వరదండ మండిత కరా యాశ్వేత పద్మాసనా
యాబ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతిభి ర్దేవైస్సదా పూజితా
సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా 

శ్రీ సరస్వతీ  స్తోత్రం 

 

 

Related Posts Plugin for WordPress, Blogger...