పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

30, ఏప్రిల్ 2012, సోమవారం

కన్నె అందమా ... కనకమందమా...??


మా ఆయన బంగారం,మా బాబు బంగారు కొండ,ఆ అమ్మాయి పుత్తడి బొమ్మ అంటూ మంచి వాటిని పోలిక పెట్టటానికి బంగారమే వాడుతుంటాము.బంగారం మీద మోజు పడని వాళ్ళు,కావాలని కోరుకోని వాళ్ళు ఉండరేమో నాకు తెలిసి..
బంగారం లేనిదే కుటుంబాల్లో శుభకార్యాలు జరగవు.అమ్మాయి పెళ్లి లో ప్రముఖ పాత్ర పోషించేది బంగారమే... ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది అంటారు.అలాగే డబ్బు తర్వాత స్థానం మాత్రం ఈ బంగారానిదే..ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుందన్న ఆర్ధికశాస్త్ర ప్రాధమిక సూత్రం కూడా ఈ బంగారం మోజు ముందు చిన్నబోతుంది.

వందేళ్ళ క్రితం బంగారం రూపాయి నలభై పైసలట. మన ఇళ్ళల్లో తాతయ్యలో, బామ్మలో మా రోజుల్లో తులం బంగారం ముప్ఫై రూపాయలు అంటే వినటానికి తమాషాగా ఉంటుంది, అలాగే ఆరోజుల్లోఎక్కువ బంగారం ఎందుకు కొనలేదో వీళ్ళు అని కొంచెం బాధగా కూడా అన్పిస్తుందేమో కానీ... 1925 లో తులం బంగారం ధర 18 రూపాయలు మరి ఇప్పుడు బంగారం ధర 30,000 అవుతున్నా ధరతో సంబంధం లేకుండా కోనేస్తున్నాం.. రేటులో ఎన్ని హెచ్చుతగ్గులు వచ్చినా కొనాలన్న ఆలోచన మాత్రం మానుకోము. అందాలకి,అలంకరణలకి మాత్రమే కాదు ఆపదలో కూడా ఆదుకునే ఈ బంగారం ధర ఇప్పుడు చుక్కల్లోనే అయినా బంగారం స్థానం మాత్రం మన మనసుల్లోనే..ఎందుకంటే అది బంగారం కదా మరి.

బంగారం అంటే ఇష్టపడని వాళ్ళు ,ఆభరణాలు పెట్టుకోవాలని కోరుకోని ఆడవాళ్ళు వుండరు కదా..అలాగే నాకు కూడా చాలా ఇష్టమైనది బంగారం.బంగారం నగల యాడ్స్, నగల మోడల్స్ పిక్చర్స్ సేకరించటం ఇష్టం .. ఒకప్పుడు నగల మోడల్స్ ఫొటోస్ ఒక పెద్ద ఆల్బం నిండా కలెక్ట్ చేసేదాన్ని .. ఇప్పుడు నెట్ లో కలెక్ట్ చేస్తున్నాను.
అలా నెట్ లో ఈ అందమైన అపరంజి బొమ్మలని చూడగానే ఈ పోస్ట్ పెట్టాలనిపించింది ...


శ్రేయా
ఘోషల్ పిక్చర్ By:వనజవనమాలి గారు..
థాంక్యూ "వనజవనమాలి" గారూ!!


Gold As Pure As Music





23, ఏప్రిల్ 2012, సోమవారం

Relationships give us a reason to live ...!


"ఒక మనిషిని బంధించి,బానిసగా చేసుకుని,వాళ్ళఆలోచనలతో,అభిప్రాయాలతో ప్రమేయం లేకుండా మన అభిరుచులకి అనుగుణంగా నడవమన్నప్పుడు మనిషి నిజంగా స్వేచ్చాజీవి ఐతే మనల్ని ప్రేమించరు, ద్వేషిస్తారు..!! ఎదుటి మనిషి చుట్టూ స్వార్ధమనే సంకెళ్ళను బిగిస్తే అది బంధం కాదు బంధనం అవుతుంది...
" వివేకానంద "
ప్రతి మనిషి జీవితంలో బంధాలు .. అనుబంధాలు ఎన్నో ఉంటాయి."మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యమూ" అన్నది అక్షర సత్యం. మనిషికి ఎన్నో బంధాలు ఉంటాయి..ఇందులో ఎవరూ ఎక్కువా కాదు .. ఎవరూ తక్కువ కాదు ఎవరి స్థానం వారిదే.. ఇలాంటి రిలేషన్స్ గురించి నాకు నచ్చిన కొన్ని కొటేషన్స్..











12, ఏప్రిల్ 2012, గురువారం

మా మాచర్ల చెన్నకేశవుని రధోత్సవం..

మా పల్నాటి సీమకే మకుటాయమానంగా వెలుగొందే మాచర్ల శ్రీ లక్ష్మీ చెన్నకేశవుని రధోత్సవం నిన్న (11-04-2012 )
జరిగింది. ఊరంతా సందడిగా, సంతోషంగా రధోత్సవం లో పాల్గొన్నారు.చెన్నకేశ స్వామి రధం లాగితే కోరిన కోర్కెలు తీరతాయని నమ్మకం. అందుకే పోటీలు పడి మరీ మగవాళ్ళు రధం లాగుతారు.ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ త్రయోదశి నుంచి స్వామి వారికి జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా పౌర్ణమి రోజున కల్యాణం,మూడవ రోజున రధోత్సవం జరుగుతాయి.
శ్రీ లక్ష్మీ చెన్నకేశ స్వామి దేవాలయం చారిత్రాత్మకంగా చాలా ప్రసిద్ధి చెందింది. దేవాలయం వద్ద లభించిన శాసనాల ప్రకారం హైహయ వంశీయులు ఈ ప్రాంతాన్ని పరిపాలించినట్లు తెలుస్తుంది. శ్రీ లక్ష్మీ చేన్నకేశ స్వామిని త్రేతాయుగం లో కార్త వీర్యార్జునుడు ప్రతిష్టించినట్లు స్థల పురాణాలు చెప్తున్నాయి.ఈ ఆలయం కృతయుగం నాటిదన్న భావన కూడా ఉంది.బ్రహ్మనాయుడు కూడా ఈ ఆలయంలోనే పూజలు నిర్వహించేవాడు..
ఈ ప్రాంతం లో చంద్రవంక నది తన గమన దిశను మార్చుకుని,ఉత్తరవాహిని అయ్యింది.అందువల్లే ఈ ఆలయం మహిమాన్విత క్షేత్రంగా కీర్తి పొందింది.శ్రీనాధుడి పల్నాటి చరిత్ర ఇక్కడ ప్రాధాన్యతను తెలియ చేస్తుంది.శ్రీనాధుడు ఈ ఆలయం నుండే పల్నాటి వీర చరిత్రను రచించటం ప్రారంభించాడట.ఈ ఆలయంలో మండప స్తంభాలు చోళరాజుల కాలం నాటి శిల్ప కళా శోభకు ప్రత్యక్ష సాక్ష్యాలు.గర్భాలయం ముందున్న నాలుగు స్తంభాలపై భారత,భాగవత,రామాయణ గాధలు,దశావతారాలు అత్యంత మనోహరంగా చెక్కబడి ఉంటాయి.
స్వామి వారి బ్రహ్మొత్సవాల్లో మొదటి రోజున అంకురార్పణ,ధ్వజారోహణం, కల్యాణోత్సవం,హనుమద్వాహనం,
శేషవాహనం, గరుడ వాహనం,రవిపొన్న వాహనం,రధోత్సవం,అశ్వవాహనం,శుక వాహనం,పుష్పయాగం,
ద్వాదశ ప్రదక్షిణలు,ఏకాదశ కలశ స్థాపన,పవళింపు సేవ ఇలా 15 రోజుల పాటు రోజుకో సేవ తర్వాత 16 రోజుల పండుగతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి..ఇవీ మా మాచర్ల చెన్న కేవుని రధోత్సవ విశేషాలు..


మా తిరునాళ్ళ స్పెషల్ స్వీట్స్.

10, ఏప్రిల్ 2012, మంగళవారం

పనికిరాని విద్య లేదు ... పనికిరాని మనిషీ లేడు ...!


అన్ని
విద్యలకు హృదయమే నిలయం. హృదయ వికాసం కలిగించి,మానసిక వికాసం,వివేకం,సత్సంస్కారం కలిగించే విద్య ఒకటైతే,హృదయంతో సంబంధం లేకుండా కేవలం భౌతిక సుఖాలకు,విలాసాలకు పనికి వచ్చేది లౌకిక విద్య.ఈ లౌకిక విద్యకు డబ్బు,అవసరాలతోనే సంబంధం..ఇప్పటి ప్రపంచంలో కావాల్సింది ఈ విద్య కాబట్టే ఎన్నో రకాల ఉపాధి కోర్సులు పుట్టుకొస్తున్నాయి.

ప్రతి చదువులోనూ,ఉద్యోగం లోనూ ఇష్టపడి చేసేవి,కష్టపడి చేసేవి రెండూ ఉంటాయి.కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒక చదువు చదువుతారు,ఉద్యోగం చేస్తారు..కానీ కొందరు వాళ్ళు ఏది చదవాలనుకుంటే అదే చదువుతారు,ఏ ఉద్యోగం చేయాలనుకుంటే అదే చేస్తారు.చేసే పనిని ప్రేమించాలి...అప్పుడే అందులో విజయాన్ని సాధిస్తారు ఎవరైనా.

పిల్లలు చిన్నప్పుడు పాటలు పాడితే,డాన్స్ చేస్తే సంతోషిస్తాం,ఎంకరేజ్ చేస్తాం ..కానీ అదే పిల్లలు పెద్దయ్యి మేము డాన్స్ చేస్తాము,పాటలు పాడతాం అంటే ప్రోత్సహించే పెద్దలు ఎంతమందో ఉండరు.పిల్లలు డాక్టర్లు,ఇంజినీర్లు మాత్రమే కావాలి కానీ ఇలా తైతక్కలాడటమేమిటి అని పక్కింటి పిల్లలతో,బంధువుల పిల్లలతో పోల్చి వాళ్లకి ఇష్టం లేకపోయినా మనకిష్టమైన స్కూళ్ళల్లో కోర్సుల్లో చేర్చివాళ్ళను బలవంతంగా మనమేమి చెయ్యాలనుకుంటున్నామో అదే చేస్తాం.

కొంతమంది దృష్టిలో కొన్ని మాత్రమే పనికి వచ్చే విద్యలు,కొన్ని మాత్రమే పనికి వచ్చే ఉద్యోగాలుమిగతా వాళ్ళంతా పనికిరాని వాళ్ళు.

నేను చదివిన ఒక కధ :

అర్జునుడు పాశుపతాస్త్రం సాధించిన తర్వాత ఇంద్రుడి ఆహ్వానం మేరకు అమరావతి పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ విలాసాల్లో మునిగి తేలకుండా,గంధర్వుల దగ్గర నృత్యం నేర్చుకున్నాడట.అప్పటికే అర్జునుడు సకల విద్యల్లో ఆరి తేరి ఉన్నాడు కానీ ఒక్కో విద్య ఒక్కో చోట ఉపయోగపడుతుందనే ముందు చూపుతో నాట్యం కూడా నేర్చుకున్నాడు.
విద్యతోనే అర్జునుడు అజ్ఞాతవాసం సమయంలో తనను ఎవరూ గుర్తుపట్టకుండా విరాట రాజు కొలువులో బృహన్నలగా,నాట్యాచార్యునిగా జీవించాడు. సమయంలో అర్జునునికి అంతకుముందు నేర్చిన అస్త్ర విద్యలేమీ పనికి రాలేదు,పైగా వాటిని ప్రదర్శిస్తే అతను అర్జునుడని అందరికీ తెలిసి పోయేది..

కాబట్టి ఏ చదువు పనికి రానిది కాదు,ఏ వృత్తీ చిన్నవి కాదు.గొప్ప చదువులు చదివితేనే గొప్ప వారు కాలేరు.కొత్త ఆలోచనలు చేసి కొత్త రంగాల్లోకి ప్రవేశించి,విజయం సాధించిన వాళ్ళందరూ గొప్ప గొప్ప చదువు చదివిన వాళ్ళేమీ కాదు.
ఎవరు చదివే చదువు పట్ల వాళ్లకి గౌరవం వుండాలి,చేసే వృత్తి పట్ల అంకిత భావం ఉండాలి.అప్పుడే చదివిన చదువుకి ఒక అర్ధం..అంతే కానీ
డొనేషన్స్ కట్టి చదువుకుని, డబ్బు తిరిగి వసూలు చేయాలనుకుని, వృత్తితో వ్యాపారం చేసేవాళ్ళు,
లంచం కట్టి ఉద్యోగం తెచ్చుకుని ఆ డబ్బును తిరిగి సంపాదించాలని అవినీతికి పాల్పడే వాళ్ళు,
గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేయటం నామోషీగా భావించే వాళ్ళు,తమని నమ్మి వచ్చిన వాళ్ళని మోసం చేసే వాళ్ళు ,
డబ్బు పోగేసుకునే యంత్రాల్లాగా మారిపోయిన డాక్టర్లు,ఇంజినీర్లు,లాయర్లు, ఇంకా
ఇలాంటి వాళ్ళు ప్రతి వృత్తిలో ఉన్నారు. మంచి,చెడు,మోసం అన్ని రంగాల్లో ఉన్నాయి ఇవి కేవలం కొందరికే పరిమితం కాదు.మోసం చేసారన్న కారణం తో ఎవరినైనా బహిష్కరించాలి అనుకుంటే మొత్తం ఈ ప్రపంచాన్నే బహిష్కరించాల్సి వస్తుందేమో..

మంచి, చెడు లని ఎవరు నిర్ధారించగలరు?? మనకి మంచి అనిపించింది ఇతరులకు చెడు అనిపించొచ్చు.మనకి చెడు అనిపించింది ఇతరులకు మంచి అనిపించొచ్చు... ఎవరిలోనో కోరుకునే మార్పుమనలోనేరావాలి.ఎవరినోనిందించి,సంస్కరించాలి అనుకునే వాళ్ళు ముందు వాళ్ళ ఇంటి నుండే ఈ సంస్కరణలను అమలుచేయ గలగాలి.

ఏ విద్య అయినా వృత్తి అయినా మనిషికి సంస్కారాన్ని నేర్పాలి,సమాజానికి ఉపయోగపడాలి,ఎదుటి మనిషిని గౌరవించటం నేర్పాలి.అప్పుడే ఆ విద్యకు,వృత్తికి సార్ధకత.
విద్య వల్ల వినయం రావాలేగానీ.. అహంభావం కాదు..!!


7, ఏప్రిల్ 2012, శనివారం

ప్రయాణ సాధనములు ... వివిధ రకములు...!


ఒక పని లేని మధ్యాహ్నం నెట్ లో,బ్లాగుల్లో తిరిగీ తిరిగీ విసిగి పోయి,అలసి పోయి అలా చల్లగాలికి
కూర్చుందామని మా బాల్కనీలో కూర్చున్నాను..
అక్కడ కూర్చుని రోడ్డున వస్తున్న వివిధ రకాల వాహనాలను చూడగానే, ఒక ఆలోచన వచ్చింది.
అంతే... వెంటనే కెమేరా తెచ్చుకుని, వాళ్ళందరినీ నా కెమెరాలో,ఆ తర్వాత ఇప్పుడు
నా
చిన్ని ప్రపంచంలో బంధించేస్తున్నాను..
















Related Posts Plugin for WordPress, Blogger...