పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

24, అక్టోబర్ 2012, బుధవారం

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి ...


 శ్రీ రాజరాజేశ్వరీదేవి - 24 - 10 - 2012 

ఆశ్వయుజ దశమి - విజయ దశమి 
దసరా 

పదవ రోజైన ఆశ్వయుజ దశమినాడు అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు. షోడశ మహా విద్యా స్వరూపిణి మహా త్రిపుర సుందరీ, 
శ్రీ చక్ర అధిష్టాన దేవత ఈ రాజరాజేశ్వరి దేవి. దేవీ నవరాత్రుల్లో తొమ్మిదిరోజుల తర్వాత జరుపుకునే విజయదశమి అపరాజితాదేవి పేర మీద ఏర్పడిందంటారు. 
శ్రీ రాజరాజేశ్వరి నివాసం శ్రీ మన్మణి ద్వీప శ్రీనగర స్థితి చింతామణి గృహం. పరమశాంత స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ ఇయు ఖండాన్ని (చెరుకుగడ) చేతిలో ధరించి ఒక చేత అభయ ముద్రతో దర్శనమిస్తుంది.

 రాజరాజేశ్వరీ రాజ్యదాయనీ రాజ్య వల్లభా’


అంబా సృష్టి వినాశ పాలనకరీ ఆర్యా విసంశోభీతా
గాయత్రీ ప్రణవాక్ష రామృతసరః పూర్ణానుసంధీకృతా
ఓంకారీ వినుతా సురార్చిత పదా ఉద్దండ దైత్యాపహా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి 

  శ్రీ రాజరాజేశ్వరీ స్తోత్రం 









23, అక్టోబర్ 2012, మంగళవారం

జయ జయహే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలశుతే


శ్రీ మహిషాసురమర్దనీ దేవి - 23 - 10 - 2012

ఆశ్వయుజ నవమి - మహర్నవమి 

 తొమ్మిదోరోజైన ఆశ్వయుజనవమి నాడు అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్దనిగా అలంకరిస్తారు. శరన్నరాత్రులలో చివరిరోజు నవమి. దీనినే  మహర్నవమి అంటారు. దుర్గాదేవి అష్ట భుజాలతో, దుష్ట రాక్షసుడైన మహిషాసురుడ్ని చంపి లోకాలన్నింటికీ మేలు చేసింది. 
మహిషాసురమర్దనీ దేవి సింహ వాహనం మీద ఒక చేత త్రిశూలం తో మహిషాసురుడ్ని సంహరిస్తున్న రూపంలో దర్శనం ఇస్తుంది.

 ‘అపర్ణా చండికా చండమండాసుర నిఘాదినీ’



అయిగిరి నందిని నందిత మేదిని
విశ్వవినోదిని నందినుతే 
గిరివర వింధ్య శిరోధినివాసిని 
విష్ణువిలాసిని జిష్ణునుతే 
భగవతి హే శితికంఠకుటుంభిని భూరికృతే 
జయ జయ హే మహిషాసురమర్ధిని 
రమ్యకపర్దిని శైలశుతే

 మహిషాసుర మర్దినీ స్తోత్రం 








22, అక్టోబర్ 2012, సోమవారం

దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖ హంత్రీ సుఖ ప్రదా


శ్రీ దుర్గాదేవి - దుర్గాష్టమి - 22 - 10 - 2012 

ఆశ్వయుజ శుద్ధ అష్టమి 

ఆశ్వయుజ శుద్ధ అష్టమినాడు అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరిస్తారు. దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపిణి అమ్మవారు దుర్గాదేవి. 
ఈ రూపంలో అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచప్రకృతి మహాస్వరూపాలలో దుర్గాదేవి మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షం ప్రసాదిస్తుంది. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మని అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి. విజయం కలుగుతుంది. సకల గ్రహ బాధలు తల్లి నామం జపిస్తే తొలగిపోతాయి. 

ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి, ఎర్రని బట్టలు పెట్టి, ఎర్ర అక్షతలు, ఎర్ర పుష్పాలతో అమ్మను పూజించాలి. దుర్గా సూక్తం పారాయణం చెయ్యాలి. “ఓం దుం దుర్గాయైనమః” అనే మంత్రాన్ని పఠించాలి.“ఆయుధ పూజ లేక అస్త్రపూజ” చేస్తారు. దుర్గమ్మను లలితా అష్టోత్తరం, లలితా సహస్రంతో పూజిస్తే ఆ తల్లి పరమశాంతి స్వరూపంతో మనల్ని కటాక్షిస్తుంది. శరన్నవరాత్రుల్లో శార్దూల వాహినిగా, త్రిశూలాన్ని ధరించిన శక్తిస్వరూపిణిగా దర్శనమిస్తుంది.
  
 దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖ హంత్రీ సుఖ ప్రదా



యాదేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై  నమో నమః
యాదేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై  నమో నమః

శ్రీ దుర్గా స్తోత్రం 
 
 

  


21, అక్టోబర్ 2012, ఆదివారం

ప్రాత:స్మరామి లలితావదనారవిందం ...

 
 శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి - 21 - 10 - 2012
ఆశ్వయుజ శుద్ధసప్తమి 

ఈరోజు అమ్మవారిని శ్రీలలితా  సుందరిగా అలంకరిస్తారు.
త్రిపురత్రయంలో రెండో శక్తి లలితాదేవి.ఈమెనే త్రిపుర సుందరి అంటారు.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులకన్నా పూర్వం నుంచి వున్నది కాబట్టి త్రిపుర సుందరి అను పిలువబడుతుంది.శ్రీ చక్ర అధిష్టాన శక్తిగా,పంచదశాక్షరీ మహామంత్ర అధిదేవతగా భక్తుల్నిఉపాసకుల్ని అనుగ్రహిస్తుంది.

దుర్గమ్మ సన్నిధిలో శంకరాచార్యుల వారిచే ప్రతిష్టితమైన శ్రీచక్ర అధిష్టాన దేవత కూడా లలితా త్రిపుర సుందర దేవియే.లలితా సహస్ర నామంలో వర్ణించినట్లు ' సచామర రమావాణీ సవ్య దక్షిణ సేవితా ' అన్నట్లు లక్ష్మీ దేవి,సరస్వతీ దేవి అటు ఇటు నిలబడి లలితా దేవిని వింజామరతో సేవిస్తున్నట్లుగా అలంకారం చేస్తారు. చిరునవ్వులు చిందిస్తూ,చేతిలో చెరకుగడను ధరించి,శివుని వక్ష స్థలం మీద కూర్చుని,  అపురూపంగా శ్రీ లలితాదేవి దర్శనమిస్తుంది.

   సచామర రమావాణీ సవ్య దక్షిణ సేవితా



ప్రాత: స్మరామి లలితావదనారవిందం
బింబాధరం పృధుల మౌక్తిక శోభినాశమ్
ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాడ్యం
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్


 లలితా పంచరత్నం 







20, అక్టోబర్ 2012, శనివారం

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామ రూపిణీ


శ్రీ సరస్వతీ దేవి (మూలా నక్షత్రం) - 20 - 10 -2012
ఆశ్వీయుజ  పంచమి,షష్టి 

ఆశ్వయుజ శుద్ధ పంచమి,షష్టి మూలా నక్షత్రం నాడు దుర్గమ్మ సరస్వతీ దేవిగా దర్శనమిస్తుంది.సరస్వతీదేవిని చదువుల తల్లిగా కొలుస్తారు.
తల్లి సకల విద్యలను ప్రసాదించి,జ్ఞాన దీపాన్ని వెలిగించే విద్యాశక్తి.
త్రిశక్తులలో మహాలక్ష్మి,మహా కాళి,మహాసరస్వతి మూడు రూపాలు.

దసరా నవరాత్రుల్లో సరస్వతీ దేవి అలంకారానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రంరోజు ఈ అలంకారం చేస్తారు.ఈ రోజున అమ్మవారిని విద్యార్ధులు భక్తితో పూజిస్తే అన్నింటా విజయం లభిస్తుందని నమ్మకం.సరస్వతీ దేవి ధవళ వస్త్రాలను ధరించి,తెల్లని హంస వాహనం పై చేతిలో కచ్ఛపి అనే వీణను ధరించి వీణాపాణి గా దర్శనమిస్తుంది.

 సరస్వతీ నమస్తుభ్యం వరదే కామ రూపిణీ 
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భావతు మే సదా ||

 
 
యా కుందేందు తుషారహార ధవళా యాశుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వరదండ మండిత కరా యాశ్వేత పద్మాసనా
యాబ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతిభి ర్దేవైస్సదా పూజితా
సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా 

శ్రీ సరస్వతీ  స్తోత్రం 

 

 

19, అక్టోబర్ 2012, శుక్రవారం

లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం..


 శ్రీ మహాలక్ష్మీ దేవి - 19 - 10 - 2012
ఆశ్వీయుజ శుద్ధ చవితి

ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు అమ్మ వారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు.మంగళప్రదమైన దేవత లక్ష్మీదేవి. లోకస్థితికారిణిగా,ధన,ధాన్య,ధైర్యవిజయ,విద్య,సౌభాగ్య,సంతాన,గజలక్ష్ములుగా భక్తులను అనుగ్రహించే అష్టలక్ష్ముల సమిష్టి రూపమే  శ్రీ మహాలక్ష్మి..
రెండు చేతులలో కమలాలను  ధరించి,వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ గజరాజులు  తనని కొలుస్తుండగా కమలాసీనురాలిగా శ్రీ మహాలక్ష్మీ దేవి దర్శనమిస్తుంది..


 లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీ రంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్షలబ్ద  విభవద్ర్భహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం 

సరసిజాం వందే ముకుంద ప్రియాం

శ్రీ మహాలక్ష్మీ అష్టకం 






18, అక్టోబర్ 2012, గురువారం

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..


శ్రీ  అన్నపూర్ణా దేవి - 18 - 10 - 2012      
ఆశ్వియుజ తదియ 
  
ఈ రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణా దేవిగా అలంకరిస్తారు.
అన్నం పరబ్రహ్మ స్వరూపం,సర్వజీవనాధారం.అటువంటి అన్నాన్ని ప్రసాదించే  మాతా అన్నపూర్ణేశ్వరి.నిత్యాన్నదానేశ్వరిగా సకల జీవరాశులకు ఆహారాన్ని ప్రసాదించి,జీవకోటిని కాపాడుతుంది.


   నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాభఖిలఘోరపాపనికరీ ప్రత్యక్షమహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ


శ్రీ  అన్నపూర్ణా స్తోత్రం  







17, అక్టోబర్ 2012, బుధవారం

శ్రీ గాయత్రీ వేదమాతా నమోస్తుతే...

శ్రీ గాయత్రీదేవి - 17 - 12 - 2012
ఆశ్వయుజ విదియ

ఈరోజు అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరిస్తారు.ఐదు ముఖాలతో,వరద అభయ హస్తాలు ధరించి, కమలాసీనురాలుగా  దర్శనమిస్తుంది. గాయత్రీ మాత సకల మంత్రాలకు మూలమైన శక్తి,వేదమాత.ముక్తా విద్రుమ హేమ నీల ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచాముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత.గాయత్రీ మంత్రాన్ని జపిస్తే కీర్తి,దివ్య తేజస్సు, సకల సంపదలు ,సమస్త శుభాలు కలుగుతాయి..సకల దేవతలకు నివేదన చేయబోయే నైవేద్యాలను ముందుగా గాయత్రీ మంత్రం తో నివేదన చేస్తారు.
.


ఓం భూర్ భుహస్వహ
తత్స వితుర్వ రెణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

మా బుద్ధులను ప్రేరేపించునట్టి,జగత్కారణమైనట్టి 
సూర్య భగవానుని సర్వోత్కృష్టమైన తేజస్సును 
మేము ధ్యానించుచున్నాము.
  
గాయత్రీమంత్రం  

 


 

16, అక్టోబర్ 2012, మంగళవారం

అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వరి శరన్నవరాత్రులు


జగన్మాత,జగద్విజేత,శక్తి స్వరూపిణి అయిన ఆ విశ్వ జనని శరన్నవరాత్రులు నేటి నుండి ప్రారంభమయ్యాయి.ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు ‘శరన్నవ రాత్రులు’ అని పిలుస్తారు. ఈ తొమ్మిది రోజులూ దీక్షతో అమ్మవారిని పూజించటం సంప్రదాయం. అలా సాధ్యం కాని వారు తదియ నుండి గాని, పంచమి నుండి గాని, సప్తమి నుండి కాని ప్రారంభించి దేవిని పూజిస్తారు. ఈ నవరాత్రులలో పరాశక్తిని విధి విధానంగా పూజించి, దశమి రోజున ఏదైనా పనిని ప్రారంభిస్తే తప్పక విజయం లభిస్తుందనేది విశ్వాసం.ఆశ్వయుజ శుద్ధ దశమి విజయదశమిగా చెప్పబడుతుంది. దీనికే అపరాజిత దశమి, దసరా అని కూడా పేర్లు. ఈ రోజున ఏ పనిని ప్రారంభించినా అందులో తప్పక విజయం లభిస్తుంది. ఈ రోజు సాయంత్రం జమ్మిచెట్టును దర్శించి పూజించాలి. జమ్మిచెట్టును పూజిస్తే అన్నింటా విజయం లభిస్తుందని అంటారు.

శ్రీ బాలా త్రిపుర సుందరి - 16-10-2012
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి 

నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది.త్రిపుర త్రయంలో ఈ దేవి మొదటిది.బాలా దేవి    మహిమాన్వితమైనది.శ్రీ బాలా త్రిపుర సుందరి మంత్రం సమస్త దేవీ మంత్రాలలోకెల్లా గొప్పది.అందుకే శ్రీ విద్యోపాసకులకు మొట్ట మొదట ఈ బాలా మత్రాన్నే ఉపదేశిస్తారు.పవిత్ర శ్రీ చక్రంలో మొదటి అమ్నాయం లో వుండే మొదటి దేవత బాలాదేవి. అందుకే ముందుగా ఆ దేవిని పూజిస్తే మహా త్రిపురసుందరీ దేవి అనుగ్రహాన్ని పొందగలుగుతాము.



మాతర్మే మధుకైటభగ్ని మహిష ప్రాణాపహారోద్యమే |
పేలానిర్మిత ధూమ్ర లోచన వధే,  హేచండ ముండార్దిని |
నిశ్శేషీకృత రక్తబీజ దనుజే | నిత్యే | నిశుంభాపహే |
శుంభ ధ్వంసినీ  సంహారాశు దురితం దుర్గే  | నమస్తే అంబికే !

చండ ముండాది శుంభ నిశుంభులను 
రాక్షసులను సంహరించిన దానవు!
ధూమ్రలోచనుని వధించిన దానవు!
మహిషాసుర మర్ధన సమయంలో ఎర్రనైన కన్నులు కలదానవు!
నిత్యమైన దానవు! పాపాలను పోగెట్టేదానవు 
అయిన ఓ తల్లీ ! నీకు నమస్కారం!

ఆ జగన్మాత సమస్త లోకాన్ని తన చల్లని చూపులతో.
ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో దీవించాలని ప్రార్ధిస్తూ...
 అందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు!

    శ్రీ బాలా త్రిపుర సుందరి స్తోత్రం





15, అక్టోబర్ 2012, సోమవారం

అందమైన అబద్ధం ...అప్పుడప్పుడూ..!




అబద్ధం చెప్పటం మనిషికి సరదా కాదు,కావాలని ఎవరూ అబద్ధాలు చెప్పరు.. కానీ జీవితంలో ఒక్కసారైనా అబద్ధం చెప్పని మనిషి వుండరేమో.."నేను ఎప్పుడూ  అబద్ధం ఆడలేదు" అని ఎవరైనా అంటే అంతకు మించిన అబద్ధం  ఉండకపోవచ్చు నాకు తెలిసి :)

కొంతమందికి అబద్ధం ఆపద్ధర్మం ఐతే.. మరి కొంతమందికి అబద్దం ఆడటమే హాబీ కూడా కావచ్చు.
వీళ్ళని అబద్ధాల కోరులు అని కూడా అంటారు లెండి..

ఆడవాళ్ళు,మగవాళ్ళు ఇద్దరూ ఆడే అబద్ధాలు వారిమధ్య సంబంధాలను కాపాడుకోవటానికి, అది ప్రేమ, స్నేహం లేదా కుటుంబ సంబంధం ఏదైనా కావచ్చు...లేదా ఇతరులనుండి రహస్యాలు దాచటానికైనా కావచ్చు. మొత్తంగా ఏదో ఒక విషయంలో ఎపుడో ఒకపుడు అబద్ధాలు చెప్పేస్తూంటాము ...

ఒక్కోసారి మనకి బాగా కావాల్సిన వాళ్ళు మనకోసం ప్రేమగా వంట చేస్తే అది బాగా లేకపోయినా,
వాళ్లకి నచ్చిన డ్రెస్ మనకు నచ్చకపోయినా , ఇంటికి వస్తున్నామని ముందుగా చెప్పకుండా వచ్చేసి ఇబ్బంది కలిగిస్తూ మీకేమన్నా ఇబ్బందా? అంటే మనసులో తిట్టుకుంటూ పైకి మాత్రం అబ్బే అదేమీ లేదండీ అంటూ ... ఎదుటి వాళ్ళ మనసు బాధపడకూడదని చెప్పే మొహమాటపు అబద్ధాలు,

నువ్వు చాలా అందంగా వున్నావని,నీ ముందు ఎవరైనా తక్కువే అంటూ ఇష్టమైన వాళ్ళను పొగిడేసి,వాళ్ళను సంతోషపెట్టే అందమైన అబద్ధాలు..చిన్నప్పుడు స్కూల్, ఎగ్గొట్టి తాతయ్యనో అమ్మమ్మనో చంపేసే అల్లరి అబద్ధాలు,ఆఫీస్ కి లేట్ గా వెళ్లినప్పుడు హెడ్ కి  చెప్పే కట్టుకదల అబద్ధాలు...

 ఇంకా మన బ్లాగ్ లోకం లో ఐతే  ఏ  పోస్ట్  పెట్టినా,అది పూర్తిగా నచ్చినా,నచ్చకపోయినా  చాలా బాగుంది అని మెచ్చుకునే అబద్ధాలు..అంటే ఇలాంటి అబద్ధాలు కొత్త వాళ్ళని ప్రోత్సహించి,వాళ్ళు మరింత బాగా రాయటానికి ఉపయోగ పడుతుంటాయి కూడా...నాకు ఈ పరిస్థితి రాలేదు లెండి ఎందుకంటే మన బ్లాగర్లందరూ చక్కగా రాస్తారు కదా అందుకని..

రాజేంద్రప్రసాద్ హీరోగా వంశీ డైరెక్షన్ లో వచ్చిన "ఏప్రిల్ ఒకటి విడుదల" సినిమా అందరికీ తెలిసిందే..
 

అబద్దాలతోనూ, లౌక్యంతోనూ ఆనందంగా బ్రతికే దివాకరం (రాజేంద్రప్రసాద్) ఒక అనాధ. రైల్వేలో డాక్టరుగా పని చేసే వసుంధర అతడిని కొడుకులా పెంచుతుంది. విజయనగరం లో పెళ్ళికి వెళ్ళిన దివాకరం భువనేశ్వరి (శోభన) అనే ఒక అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. రైల్వేలో బుకింగ్ క్లర్కుగా పనిచేసే ఆమె కొన్ని విలువలతో జీవిస్తుంటుంది. ఆమె కోసం ఆమె బాబాయితో మాట్లాడి పెళ్ళి కి ఒప్పించమని చెపుతాడు. ఆమెతో పెళ్ళి అయ్యేనాటికి అన్ని సౌకర్యాలు, ఇల్లు సమకూర్చాలని అబద్దాలతో, తన తెలివితేటలతోనూ, ఆ ప్రాంతానికి రౌడీగా చలామణీ అయ్యే తన మిత్రుడు గోపి (కృష్ణ భగవాన్) సహాయంతోనూ డబ్బు సమకూర్చి వీడియో షాపు ప్రారంభిస్తాడు.

భువన ట్రాన్సుపర్ మీద రాజమండ్రి వస్తుంది. తన ప్రేమను తెలియచేసి తను ఆమె కోసం ఏమేమి చేస్తున్నానో తెలియ చెపుతాడు దివాకరం. అప్పటికే అతనిపై మంచి అభిప్రాయం లేని ఆమె అతనికి కొన్ని షరతులతో కూడిన ఒక పేపరుపై సంతకం తీసుకొంటుంది. దాని ప్రకారం అతడు ఒక నెలపాటు అనగా ఏప్రిల్ 1 వరకూ అబద్దాలు చెప్పకుండా, తప్పులు చేయకుండా, నిజాలు మాత్రమే చెపుతూ ఉండాలి. అలాగైతే అతడితో పెళ్ళికి సరే అంటుంది. సరే అని ఒప్పుకుంటాడు దివాకరం.

అప్పటి నుండి అతడు నిజాలు చెపుతుండటం వలన ఆతనికి ,ఇంకా ఆ కాలనీలో  చాలా మందికి కష్టాలు ప్రారంభమవుతుంటాయి.చివరకు అతడు చెప్పిన నిజాల వలన అతని మిత్రుడు గోపి జైలుకు వెళతాడు. దివాకరంపై పగ పట్టిన గోపి అతడిని చంపేందుకు వెతుకుతూ అతడిని చంపబోతే అతడిని తల్లిలా పెంచిన వసుంధర గోపిని చంపేస్తుంది. తమ పందెంలో గడువు ఆ రోజుతో ముగుస్తుందని తెలిసీ తనను తల్లిలా పెంచిన ఆమె కోసం అతడు ఆ నేరాన్ని తనపై వేసుకొని జైలుకు వెళతాడు. కాని వసుంధర జరిగినది పోలీసులకు చెప్పి తను లొంగి పోతుంది. ఆపదసమయంలో చేసిన హత్య కనుక ఆమెకు ఎక్కువ శిక్ష పడదు. దివాకరం తను ఓడిపోయాను కనుక ఇక ఎప్పుడూ నీకు కనిపించనని భువనతో చెపుతాడు. అతడి నిజాయితీ అర్ధమయిన భువన అతడితో పెళ్ళికి ఒప్పుకుంటుంది.

ఇదీ సినిమా కధ..  అబద్ధం చెప్పటం హాబీగా పెట్టుకున్న మనిషికి నిజాలే మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే అది ఎంత ఘోరంగా వుంటుందో సరదాగా చూపించారు..అప్పుడప్పుడు అబద్ధం అనే ముసుగు వేసుకోకపోతే తనకే కాక ఎదుటివారికి కూడా ఎంత ప్రమాదమో ఈ సినిమా చెప్తుంది. 

రాజేంద్రప్రసాద్ సరదా నటన, సంభాషణలు,,శోభన సహజమైన అందం,నటన ఇంకా మిగిలిన హాస్యనటుల
హాస్యం ఈ సినిమాను  హాస్యచిత్రాలలో ఒక క్లాసిక్ గా నిలిచేలా  ఇప్పటికీ టీవీలో వస్తున్నా  చూడాలనిపించేలా  చేయగలిగింది...

ఈ సినిమాలో పాటలు కూడా ఎవర్ గ్రీన్ హిట్స్.. "మాటంటే మాటేనంట కంటబడ్డ నిజమంతా అంటా "  పాట  వింటే చాలు సినిమా అంతా  కళ్ళముందు కదులుతూ ఒక చిన్న నవ్వు వచ్చేస్తుంది వెంటనే..

ఈ మధ్య FM లో ఈ పాట  వినగానే ముఖ్యంగా ఈ పాటలో ఒక లైన్ ... 
భోజనానికి పిలిచి, వంట గురించి  అభిప్రాయం అడిగిన వాళ్ళతో 

 "అపార్ధం చేసుకోరుగా ... అనర్ధం చేయ్యబోరుగా 
 యదార్ధం చేదుగుంటది ... పదార్ధం చెత్తగున్నది 
 ఇది విందా నా బొందా ... తిన్నోళ్ళు  గోవిందా"

అని వినగానే నాకు అనిపించింది నిజంగా కొన్ని సందర్భాల్లో  అబద్ధం ఆడకుండా తప్పించుకోలేము,అది చాలా కష్టం కూడా  కదా అని..
 "ప్రాణ మాన విత్త హానులదప్పింప కల్లలాడువారుకవులుసుమ్ము" అని,
"వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి"  అని ఇలా అబద్ధం విషయంలో మన పెద్దలు కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఇచ్చారు...అలాగని పెద్దలే చెప్పమన్నారు కదా అని అదే పనిగా అబద్ధాలు చెప్తూ వుంటే నాన్నా  పులి  లాగా అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు.. ఎందుకంటే అతి సర్వత్ర వర్జయేత్ కదా ..!
 
"మాటంటే మాటేనంట కంటబడ్డ నిజమంతా అంటా"



                         

10, అక్టోబర్ 2012, బుధవారం

ఆరంభమౌ ప్రచండమైన యుద్ధమే ..




ఏ అడ్డుగోడనైనా తొలగించే
ఏ పర్వతాన్నైనా పెకిలించే
ఏ సాగరాన్నైనా మధించే
ఏ ఆకాశాన్నైనా అధిగమించే
ఏ లక్ష్యాన్నైనా భేధించే
ఏ అలవాటునైనా శాసించే శక్తి మీలోనే నిగూఢంగా దాగి ఉంది
మనస్పూర్తిగా ప్రయత్నిస్తే లక్షలమందికి స్ఫూర్తిఅవుతారు 
మీరు గెలిస్తే కోట్లాది మందికి వెలుగవుతారు
అనుకున్నది  సాధిస్తే చరిత్ర పుటల్లో చేరిపోతారు 

చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవటం కంటే ఒక చిన్న దీపాన్ని వెలిగించి ,ఆ చీకటిని తొలగించటం వివేకం.జీవితం ఒక ప్రయాణం మాత్రమే  గమ్యం  కాదు..నిన్నటి నుండి పాఠాలు నేర్చుకుంటూ, ఈ రోజు సంతోషంగా  జీవిస్తూ, రేపటి కోసం ఆశను పెంచుకోవటమే జీవితం.మనలో ఉన్న అనంతమైన శక్తిని తెలుసుకుని,సాధించాలని సంకల్పించి సాధించి చూపించటమే ఆత్మస్థైర్యం.

అపజయాలు ఎదురైనప్పుడు క్రుంగిపోవటం,బాధపడటం సహజం కానీ ఆ ఓటమిని విజయంగా మార్చినవారే విజేతలు..ఈ ప్రయత్నంలో తమకుతాము స్ఫూర్తి పొందేది కొందరైతే..గొప్పవాళ్ళ మాటలు,సూక్తుల ద్వారా స్ఫూర్తి పొందేది కొందరు..నాకు కూడా ఇన్స్పిరేషన్ కొటేషన్స్,పాటలు,చిత్రాలు సేకరించటం, చదవటం,వినటం ఇష్టం.

నేను ఈ మధ్య చూసిన  ఒక మంచి ఇన్స్పిరేషన్ సాంగ్ నాకు చాలా నచ్చింది."గులాల్"  హిందీ సినిమాలోని  ."Aarambh hai prachand"  పాటను   Lyricist, Singer, Stage Performer   "విప్లవ సేన్.అప్పరాజు" గారు స్వయంగా తెలుగు లిరిక్స్ రాసి,పాడిన ఈ పాట ఇన్స్పిరేషన్ సాంగ్స్ లో ఒక కొత్త ప్రయోగం అని చెప్పొచ్చు.

ThankYou  "Viplov Sen. Apparaju"  గారు.. 
మీరు మరెన్నో మంచి  స్ఫూర్తిదాయకమైన పాటలను అందించాలని  కోరుకుంటూ అభినందనలు..

ఆరంభమౌ ప్రచండమైన యుద్ధమే 





ఆరంభమౌ ప్రచండమైన యుద్ధమే 
అఖండమైన శంఖారావాలాపనే పూరించుదాం
జాతి ప్రీతి గాంచె ఖ్యాతి పదములోన యుద్దరీతి
నీతిగానే విజయము సాధించుదాం
తుది సమరమే ఆరంభం  

తలచినంత ప్రాణార్పణ తెగువ తేల్చు సంఘర్షణ
సమరానికి సిద్దమెప్పుడు వీరుడు
కృష్ణ గీత సారమిది దైవ శాసనాల విధి 
యుద్ధానికి జంకడెపుడు  యోధుడు

అనునయులే ఎదిరించిన సహచరులే వారించిన
ధర్మానికి బద్ధుడెపుడు ధీరుడు
 తలవంచని స్వభావాలు రాజసమే ఆనవాలు
ఒడిదుడుకుల కెదురేగే తత్వము 
అలుపెరుగని సాహసాల ఎగరేయి ఇక బావుటాలు
నలుదిక్కుల చాటు ఆధిపత్యము

 ఆరంభమౌ ప్రచండమైన యుద్ధమే 
అఖండమైన శంఖారావాలాపనే పూరించుదాం
జాతి ప్రీతి గాంచె ఖ్యాతి పదములోన యుద్దరీతి
నీతిగానే విజయము సాధించుదాం
తుది సమరమే ఆరంభం  ...

 అధైర్యవంతమా భావన శౌర్యవంతమా స్పందన 
ఓటమిదా ఆక్రందన ఎంచుకో  ..
నిలువరించి ఆవేదన దీక్షబూని చేయ్ సాధన 
ప్రతిఘటించి బలహీనత వదులుకో 

బ్రహ్మాండమంత నిలదీసిన  ఒంటరిగా వెలివేసిన 
సంకల్పం సడలకుండా నడుచుకో  
సమయమునే వృధాపరచు సుఖములకై పరితపించు 
హృది తలపుల సంకెలనే తెంచుకో  
ఉప్పెనలా బడబాగ్ని రక్తములో మరిగేట్టు 
పోరాటపు పౌరుషమే పెంచుకో 

ఆరంభమౌ ప్రచండమైన యుద్ధమే 
అఖండమైన శంఖారావాలాపనే పూరించుదాం
జాతి ప్రీతి గాంచె ఖ్యాతి పదములోన యుద్దరీతి
నీతిగానే విజయము సాధించుదాం
తుది సమరమే ఆరంభం  ...
తుది సమరమే ఆరంభం  ... 
 తుది సమరమే ఆరంభం  ... 

 concept - Screenplay - Direction 
Editing  - Lyrics - Singing 
By :
Viplov Sen. Apparaju 
  

 

7, అక్టోబర్ 2012, ఆదివారం

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు.......!


జీవితమనే మన ప్రయాణంలో ఎన్నో ...
మజిలీలు,గమ్యాలు
సుఖాలు, దుఖాలు
సంతోషాలు,బాధలు
బంధాలు ,బాధ్యతలు....

సుఖం వచ్చినప్పుడు సంతోషించటం,దుఖం కలిగితే బాధపడటం మనిషికి సహజం..
జీవితమనే ఈ ప్రయాణంలో ఎన్ని కష్టాలొచ్చినా నష్టాలొచ్చినా మనసున మనసై బ్రతుకున బ్రతుకై మన కష్ట,సుఖాల్లో పాలు పంచుకునే మనిషి వున్నవాళ్ళు అదృష్టవంతులు...ఎప్పుడైనా నాకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడూ కష్టాలు,బాధలు వచ్చే మనిషి దురదృష్టవంతుడు కాదు..ఆ కష్టాల్లో నీకు నేనున్నాను,నీ కష్టం నాది అని కనీసం ఓదార్చే తోడులేని మనిషే నిజమైన దురదృష్టవంతుడు అని..

జీవితంలో కొన్ని బంధాలు జన్మతో ఏర్పడతాయి..మరికొన్ని మనం ఎంచుకునే స్నేహితుల ద్వారా,జీవిత భాగస్వాముల ద్వారా  ఏర్పడతాయి, ఎలా ఏర్పడిన బంధమైనా, ఏ  సంబంధమైనా ...

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు,నీ కోసమే కన్నీరు నింపుటకు
నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండిన
అదే భాగ్యము.. అదే స్వర్గము

























మనసున మనసై ... బ్రతుకున బ్రతుకై 
తోడొకరుండిన అదే భాగ్యము ... అదే స్వర్గము..

 

Related Posts Plugin for WordPress, Blogger...